మదురై మీనాక్షి దేవాలయంలో ప్రధాని మోదీ
జెయ్‌నగర్/ఉలుబేరియా: పశ్చిమ బెంగాల్ అంతటా బీజేపీ ప్రభంజనం కనిపిస్తోందని, అసెంబ్లీ ఎన్నికల్లో 294 సీట్లకు గాను 200కుపైగా సీట్లు సొంతం చేసుకోబోతున్నామని ప్రధాని∙మోదీ తేల్చిచెప్పారు. ఆయన గురువారం బెంగాల్‌లోని జెయ్‌నగర్, ఉలుబేరియాలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. మే 2వ తేదీన మమతా బెనర్జీ గద్దె దిగడం ఖాయమని మోదీ స్పష్టం చేశారు. ప్రజలు ఎన్నికల్లో పాల్గొనడం లేదని, రాష్ట్ర అభివృద్ధి కోసం బాటలు పరుస్తున్నారని చెప్పారు. ‘గోడలపై రాసిన రాతలు చదవండి. బెంగాల్ ప్రజలు మిమ్మల్ని శిక్షించబోతున్నారు’ అని మమతనుద్దేశించి వ్యాఖ్యానించారు.
నందిగ్రామ్‌లో పరాజయం తప్పదని తేలడంతో చివరి దశ ఎన్నికలు జరిగే స్థానం నుంచి పోటీ చేయడానికి నామినేషన్ వేయాలని మమత నిర్ణయించుకున్నట్లు వార్తలు వస్తున్నాయని, అవి నిజమో కాదో చెప్పాలన్నారు. ఎక్కడికి వెళ్లినా దీదీకిఓటమి తప్పదన్నారు. రాష్ట్రంలో ఎక్కడైనా ప్రజలు ఆమెకు గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. బెంగాల్‌లో ఇటీవలే బీజేపీ కార్యకర్త తల్లిని దారుణంగా హత్య చేశారని మోదీ ఆవేదన వ్యక్తం చేశారు. అలాంటి ఘోరం జరిగిన తర్వాత ప్రజలు కూల్‌గా ఉండాలని మమత చెబుతున్నారని, టీఎంసీ నేతలు, కార్యకర్తలు శూల్‌గా(శూలం) మారి ప్రజలను బాధిస్తున్నారని ధ్వజమెత్తారు. ‘అక్రమంగా వలస వచ్చినవారు మీకు సొంత మనషులు. స్వదేశంలోని ప్రజలను బయటివాళ్లు, టూరిస్టులు అంటారా? సొంత ప్రజలపై వివక్ష చూపడం మానుకోండి’ అని హితవు పలికారు.
చేసిన ప్రమాణం మరిచారా?
బిహార్, ఉత్తరప్రదేశ్ ప్రజలకు వ్యతిరేకంగా మమతా బెనర్జీ విమర్శలు చేయడం దారుణమని ప్రధాని మోదీ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్యాంగం చేసిన ప్రమాణం ఇలాంటి విమర్శలను అనుమతించదని గుర్తుచేశారు. భవానీపూర్ అసెంబ్లీ స్థానాన్ని విడిచిపెట్టి, నందిగ్రామ్‌ను ఎంచుకోవడం ద్వారా పెద్ద తప్పు చేశానన్న నిజాన్ని మమతా బెనర్జీ గ్రహించారని చెప్పారు. నందిగ్రామ్‌లో దీదీకి ఓటమి తప్పదన్నారు. ఆమెకు బెంగాల్ అనేది ఒక ఆట స్థలమని, బీజేపీకి అభివృద్ధి, విద్యా, పరిశ్రమల మైదానం కాబోతోందని వ్యాఖ్యానించారు.
జైశ్రీరామ్‌ను సహించలేదు
అవసరం కొద్దీ ప్రదర్శించే కాలానుగుణ విశ్వాసాలపై తనకు విశ్వాసం లేదని వ్యాఖ్యానించారు. ‘జైశ్రీరామ్ అని నినదిస్తే ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సహించలేదు. దుర్గా విగ్రహాల నిమజ్జనాలపై అసహనం వ్యక్తం చేశారు. ప్రజలు కాషాయం బట్టలు, నుదుటిపై తిలకం ధరించడం, పిలక పెంచుకోవడం పట్ల తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి అభ్యంతరాలున్నాయి. అలాంటి వారిని రాక్షసులుగా సంబోధిస్తోంది’’ అని విమర్శించారు. తాను ఇటీవల బంగ్లాదేశ్ పర్యటించడం, అక్కడి దేవాలయాలను సందర్శించడం ఎన్నికల ప్రవర్తనా నియామవళిని ఉల్లంఘించడమే అవుతుందంటూ తృణమూల్ కాంగ్రెస్ చేసిన ఆరోపణలను మోదీ తిప్పికొట్టారు. జిశోరేశ్వరి కాళీ మందిరాన్ని సందర్శించడం, శ్రీహరిచంద్ ఠాకూర్‌కు నివాళులర్పించడం తప్పెలా అవుతుందని ప్రశ్నించారు. మన నమ్మకాలు, సంప్రదాయాలను తాము గర్వకారణంగా భావిస్తామని అన్నారు.
మీనాక్షి ఆలయంలో మోదీ
మోదీ గురువారం తమిళనాడులోని, మదురైలో ఉన్న ప్రఖ్యాత మీనాక్షి అమ్మవారిని దర్శించుకున్నారు. ప్రధానికి ఆలయ పూజారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. సంప్రదాయ చొక్కా, ధోవతి, అంగవస్త్రం ధరించి ప్రధాని ఆలయంలో ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. నేడు మదురై, కన్యాకుమారిల్లో ప్రధాని మోదీ ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. తమిళనాడులో ఏప్రిల్ 6న ఒకే విడతలో ఎన్నికలు జరగనున్నాయి. కన్యాకుమారి లోక్‌సభ ఉప ఎన్నికలోనూ బీజేపీ పోటీ చేస్తోంది.
గెలుపు మమతదే: తృణమూల్
సీఎం మమతా బెనర్జీ నందిగ్రామ్‌లో కచ్చితంగా ఓడిపోతారని, అందుకే మరో స్థానాన్ని వెతుక్కుంటున్నారని ప్రధాని మోదీ చేసిన విమర్శలపై తృణమూల్ కాంగ్రెస్ వర్గాలు స్పందించాయి. నందిగ్రామ్‌లో దీదీ ఓడిపోయే ప్రసక్తే లేదని, మరో స్థానం నుంచి పోటీ చేసే ప్రశ్నే లేదని ప్రకటించాయి.
Comments
Please login to add a commentAdd a comment