
కోల్‌కతా/నందిగ్రామ్: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు ఓటు హక్కు వినియోగించుకోకుండా చేయడానికి బీజేపీ కుట్రలు పన్నుతోందని, బయటి నుంచి గూండాలను దిగుమతి చేస్తోందని తృణమూల్ చీఫ్ మమతా బెనర్జీ ఆరోపించారు. గరిటెలు, అట్లకాడలు, వంట పాత్రలతో బీజేపీ గూండాలను తరిమికొట్టాలని మహిళలకు పిలుపునిచ్చారు. పశ్చిమ మిడ్నాపూర్ జిల్లాలోని నారాయణగఢ్, పింగ్లాలో శనివారం ఎన్నికల ప్రచార సభల్లో ఆమె ప్రసంగించారు.
నందిగ్రామ్‌లో తనపై బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సువేందు అధికారిపై మరోసారి విరుచుకుపడ్డారు. ఆయన కుటుంబ సభ్యులు ద్రోహులని దుయ్యబట్టారు. సువేందు అధికారి కుటుంబ సభ్యుడొకరు శుక్రవారం రాత్రి ఓటర్లకు డబ్బులు పంచుతూ దొరికిపోయాడని అన్నారు. అతడిని మహిళలు పట్టుకొని పోలీసులకు అప్పగించారని చెప్పారు. బయటి నుంచి వచ్చిన మరో 30 మంది గూండాలను కూడా మహిళలు పోలీసులకు అప్పగించారని పేర్కొన్నారు.
నందిగ్రామ్‌లో ద్రోహులపై కన్నేశా: అసెంబ్లీ ఎన్నికలు స్వేచ్ఛగా, పారదర్శకంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘానికి మమతా బెనర్జీ విజ్ఞప్తి చేశారు. నందిగ్రామ్‌లో మీర్ జాఫర్లపై(ద్రోహులు) ఓ కన్నేసి ఉంచానని వ్యాఖ్యానించారు. సువేందు అధికారికి, అతడి సోదరులకు మంచి పదవులు కట్టబెట్టానని గుర్తుచేశారు. అయినప్పటికీ వారు తృణమూల్ కాంగ్రెస్‌ను దగా చేసి, బీజేపీలో చేరారని విమర్శించారు. డబ్బుకు అమ్ముడుపోయారని ధ్వజమెత్తారు.
బీజేపీ, తృణమూల్ కార్యకర్తల ఘర్షణ
పూర్బ మేదినీపూర్ జిల్లాలోని నందిగ్రామ్‌లో శనివారం బీజేపీ, తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తల మధ్య తీవ్రస్థాయిలో ఘర్షణ చోటుచేసుకుంది. ఈ ఘటనలో ముగ్గురు గాయపడ్డారని పోలీసులు వెల్లడించారు. సీఎం మమతా బెనర్జీ పోటీ చేస్తున్న నందిగ్రామ్ స్థానంలో ఏప్రిల్ 1న ఎన్నికలు జరుగనున్నాయి. బీజేపీ బయటి నుంచి తీసుకొచ్చిన రౌడీలు తమపై దాడి చేశారని మమతా బెనర్జీ ఎలక్షన్ ఏజెంట్ షేక్ సూఫియాన్ ఆరోపించారు. తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలు ముగ్గురు గాయాలపాలయ్యారని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment