నందిగ్రామ్‌లో మీడియాతో మాట్లాడుతున్న మమత
న్యూఢిల్లీ/నందిగ్రామ్: బీజేపీ, ఆ పార్టీ నేతృత్వంలో నడుస్తున్న కేంద్ర ప్రభుత్వం ప్రజాస్వామ్యంపై, రాజ్యాంగంపై, సమాఖ్య స్ఫూర్తిపై వరుస దాడులు చేస్తున్నాయని తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ ఆరోపించారు. స్వాతంత్య్రం తరువాత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సంబంధాలు మునుపెన్నడూ లేనంత దిగువకు దిగజారాయని పేర్కొన్నారు. బీజేపీ నియంతృత్వంపై కలసికట్టుగా పోరాడుదామని విపక్ష నేతలకు పిలుపునిచ్చారు. ఈ మేరకు దేశవ్యాప్తంగా ఉన్న బీజేపీయేతర పార్టీల నేతలకు ఆమె రాసిన లేఖను బుధవారం టీఎంసీ విడుదల చేసింది.
‘ఈ లేఖను మీతో పాటు దేశంలోని బీజేపీయేతర పార్టీల నాయకులకు రాస్తున్నాను. ప్రజాస్వామ్యంపై, సమాఖ్య విధానంపై బీజేపీ, కేంద్ర ప్రభుత్వం వరుస దాడులకు పాల్పడుతోంది. ఇది చాలా ఆందోళనకర అంశం. ఈ పరిస్థితుల్లో బీజేపీకి వ్యతిరేకంగా కలిసి పోరాడాల్సిన, ఒక ప్రత్యామ్నాయ వేదికను ప్రజలకు అందించాల్సిన సమయం ఆసన్నమైంది’ అని కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీ సహా విపక్ష నాయకులకు రాసిన లేఖలో మమత పేర్కొన్నారు. ఢిల్లీ లెఫ్ట్‌నెంట్ గవర్నర్(ఎల్జీ)కి అపరిమిత అధికారం, ఢిల్లీ ప్రభుత్వమంటే ఎల్జీనే అని స్పష్టం చేసే చట్టంపై లేఖలో మమత మండిపడ్డారు.
‘ఆ చట్టంతో ప్రజలు ఎన్నుకున్న రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్రం అధికారాలను లాగేసుకుంది. ఆ అధికారాలను తన ప్రతినిధి అయిన ఎల్జీ చేతిలో పెట్టింది. ఎల్జీని అప్రకటిత ఢిల్లీ వైస్రాయ్‌గా మార్చింది’ అని మమత వివరించారు. ఢిల్లీలో 2014, 2019 ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ.. ప్రజా తీర్పును బీజేపీ అంగీకరించడం లేదన్నారు. ఆ చట్టం భారతదేశ సమాఖ్య విధానంపై జరిపిన ప్రత్యక్ష దాడి అని ఆమె అభివర్ణించారు. సోనియాతో పాటు ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్, వైఎస్సార్సీపీ చీఫ్ వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి, డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్, సమాజ్‌వాదీ పార్టీ నేత అఖిలేశ్, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్, శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే, జేఎంఎం నేత హేమంత్ సోరెన్, ఆప్ కన్వీనర్ కేజ్రీవాల్, బీజేడీ నాయకుడు నవీన్ పట్నాయక్, నేషనల్ కాన్ఫెరెన్స్‌కు చెందిన ఫారూఖ్ అబ్దుల్లా, పీడీపీ చీఫ్ మెహబూబా, సీపీఐఎంఎల్ నేత దీపాంకర్ భట్టాచార్యలకు మమత ఈ లేఖను పంపించారు.
బీజేపీయేతర పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాలకు కేంద్రం నిధులు ఇవ్వకుండా వివక్ష చూపుతోందని విమర్శించారు. తద్వారా ఆయా రాష్ట్రాల్లో సంక్షేమ పథకాల అమలును ఉద్దేశపూర్వకంగా అడ్డుకుంటోందన్నారు. రాష్ట్రాలు తమ డిమాండ్లను కేంద్రం దృష్టికి తీసుకువచ్చే జాతీయ అభివృద్ధి మండలి, అంతర్రాష్ట్ర మండలి, ప్రణాళిక సంఘం... తదితర వ్యవస్థలను నిర్వీర్యం చేసిందని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వాల అధికారాలను మున్సిపాలిటీల స్థాయికి కుదించాలని, దేశంలో ఏకపార్టీ అధికార వ్యవస్థ కోసం కుట్ర పన్నుతోందని బీజేపీపై ఆరోపణలు గుప్పించారు. అక్రమ మార్గాల ద్వారా సేకరించిన నిధులను రాష్ట్రాల్లో విపక్ష పార్టీలను అధికారంలో నుంచి కూలదోయడానికి, బీజేపీలోకి ఫిరాయింపులను ప్రోత్సహించడానికి ఉపయోగిస్తున్నారని మండిపడ్డారు.
ప్రభుత్వ రంగ సంస్థలు ప్రజల ఆస్తులని, వాటిని ప్రైవేటు పరం చేయాలన్న బీజేపీ ఆలోచన నిర్లక్ష్యపూరితమైందని విమర్శించారు. బీజేపీ నియంతృత్వ పోకడలకు వ్యతిరేకంగా పోరాడేందుకు కలిసి రావాలని బీజేపీయేతర పార్టీల నాయకులను ఆమె కోరారు. కలిసికట్టుగా పోరాడితేనే విజయం సాధించగలమని, ఈ అసెంబ్లీ ఎన్నికల అనంతరం ఈ విషయంలో ఒక కార్యాచరణ రూపొందించే విషయమై చర్చిద్దామని ఆమె ప్రతిపాదించారు. మమత లేఖపై బీజేపీ స్పందించింది. మమత డిక్షనరీలో లేని పదమే ప్రజాస్వామ్యమని వ్యాఖ్యానించింది. మమత ప్రతిపాదనకు పీడీపీ చీఫ్, జమ్మూకశ్మీర్ మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ నుంచి మద్దతు లభించింది.
కోట్లు కుమ్మరిస్తున్నారు
ఎన్నికల్లో గెలవడం కోసం బీజేపీ నేతలు కోట్ల రూపాయలను ఓటర్లకు పంచిపెడ్తున్నారని మమతా బెనర్జీ ఆరోపించారు. దీనిపై ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. ఓటర్లను భయపెట్టేందుకు యూపీ, బిహార్ రాష్ట్రాల నుంచి గూండాలను దింపుతున్నారన్నారు. బీజేపీ నేతలు ఇదంతా బహిరంగంగా చేస్తోంటే.. ఈసీ ఏం చేస్తోందని ప్రశ్నించారు. నందిగ్రామ్‌లో తనపై దాడి చేసిన వారి వివరాలు తెలిశాయని, ఎన్నికల తరువాత ఆ విషయం చూస్తానని పేర్కొన్నారు. మరోవైపు, మమత బెనర్జీపై బీజేపీ ఈసీకి ఫిర్యాదు చేసింది. బీజేపీ కార్యకర్తలు, మద్దతుదారులను ఆమె బెదిరిస్తున్నారని ఆరోపించారు.
Comments
Please login to add a commentAdd a comment