నందిగ్రామ్‌లో స్వల్ప ఘర్షణలు | Sakshi
Sakshi News home page

నందిగ్రామ్‌లో స్వల్ప ఘర్షణలు

Published Fri, Apr 2 2021 3:54 AM

Mamata Banerjee alleges Central forces helping BJP at Shah behest - Sakshi

నందిగ్రామ్‌/గువాహటి: పశ్చిమబెంగాల్‌లో గురువారం జరిగిన రెండో దశ ఎన్నికల్లో స్వల్పంగా హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. అక్రమాలు జరిగాయని, కేంద్ర బలగాలు బీజేపీకి అనుకూలంగా వ్యవహరించాయని తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి మమత బెనర్జీ ఆరోపించారు. ఆమె బరిలో నిలిచిన నందిగ్రామ్‌లో గురువారం పోలింగ్‌ జరిగింది. కేంద్ర మంత్రి అమిత్‌ షా ఆదేశాల మేరకు నందిగ్రామ్‌ నియోజకవర్గంలో సీఆర్‌పీఎఫ్, బీఎస్‌ఎఫ్‌ బలగాలు బీజేపీకి ఓట్లు పడేలా సహకరించాయని మమత పేర్కొన్నారు.

ఎన్నికల సంఘం టీఎంసీ, ఇతర పార్టీల ఫిర్యాదులపై స్పందించడం లేదని, అమిత్‌ ఆదేశాలనే పాటిస్తోందన్నారు. తన ఆందోళన అంతా ప్రజాస్వామ్యంపై బీజేపీ చేస్తున్న దాడి గురించేనని ఆమె వ్యాఖ్యానించారు. మమతా బెనర్జీ, ఆమె ప్రత్యర్థి అయిన బీజేపీ అభ్యర్థి సువేందు అధికారి పలు పోలింగ్‌ బూత్‌లకు వెళ్లి, ఓటింగ్‌ సరళిని పరిశీలించారు. నందిగ్రామ్‌లో విజయం తనదేనని, ఇక్కడి ప్రజలంతా తనవారేనని, గ్రామాలకు, గ్రామాలే బీజేపీకి ఓటేశాయని సువేందు అధికారి పేర్కొన్నారు. రాష్ట్రంలోని 30 స్థానాల్లో జరిగిన రెండో దశలో ఎన్నికల్లో కూడా 80 శాతానికి పైగా ఓటింగ్‌ నమోదయింది. సాయంత్రం ఐదు గంటల వరకు రాష్ట్రంలో 80.53% ఓటింగ్‌ నమోదయిందని ఈసీ వెల్లడించింది.

ఎన్నికల సంఘం పక్షపాత ధోరణిలో వ్యవహరిస్తోందని, తమ ఫిర్యాదులను పట్టించుకోవడం లేదని మమత బెనర్జీ ఆరోపించారు. ‘ఉదయం నుంచి 63 ఫిర్యాదులు చేశాం. ఏ ఒక్క ఫిర్యాదు పైనా చర్యలు తీసుకోలేదు. అమిత్‌ షా ఆదేశాలను మాత్రమే ఈసీ పాటిస్తోంది. దీనిపై మేం కోర్టుకు వెళ్తాం. వేరే రాష్ట్రాల నుంచి గూండాలను తీసుకువచ్చి గందరగోళం చేస్తున్నారు’ అని బోయల్‌లో బూత్‌ నెంబర్‌ 7 బయట కూర్చున్న మమతా పేర్కొన్నారు. బీజేపీ గూండాలు బూత్‌ల స్వాధీనానికి, దొంగ ఓట్లకు పాల్పడుతున్నారన్నారు. టీఎంసీ తరఫున ఏజెంట్లుగా ఉండవద్దని గత రాత్రి తమ పోలింగ్‌ ఏజెంట్లను బీజేపీ నాయకులు బెదిరించారని మమత ఆరోపించారు.

బోయల్‌లో తమ ఓట్లను వేయనీయడం లేదని పలువురు ఓటర్లు, టీఎంసీ కార్యకర్తలు ఆమెకు ఫిర్యాదు చేయడంతో, ఆ బూత్‌ వద్ద ఆమె దాదాపు రెండు గంటల పాటు కూర్చున్నారు. బోయల్‌కు మమత చేరుకోగానే అక్కడి బీజేపీ కార్యకర్తలు జై శ్రీరామ్‌ అంటూ నినాదాలు చేశారు. టీఎంసీ కార్యకర్తలు వారిని అడ్డుకోవడంతో ఘర్షణ చోటు చేసుకుంది.  దీనిపై గవర్నర్‌ జగదీప్‌కు ఫోన్‌ చేసి మమత ఫిర్యాదు చేశారు. కేంద్ర బలగాలు తమను పోలింగ్‌ బూత్‌లకు వెళ్లనివ్వడం లేదని ఆరోపిస్తూ నందిగ్రామ్‌ బ్లాక్‌ 1 రోడ్డును టీఎంసీ కార్యకర్తలు దిగ్బంధించారు. సువేందు అధికారి కారుపై కొందరు దాడి చేశారు. టాకాపుర, సతేంగబరిల్లో ఆయనపై రాళ్లు రువ్వారు. కేశ్‌పూర్‌ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి తన్మయ్‌ ఘోష్‌ కారును కొందరు ధ్వంసం చేశారు. నందిగ్రామ్‌ ఘటనలపై ప్రధాని మోదీ స్పందిస్తూ.. అక్కడ మమత బెనర్జీ ఓడిపోతున్నారని అర్థమవుతోందని వ్యాఖ్యానించారు.  

పోలింగ్‌ను అడ్డుకోలేదు
నందిగ్రామ్‌లో పోలింగ్‌ బూత్‌ నెంబర్‌ 7లో పోలిం గ్‌ సక్రమంగా కొనసాగిందని, అక్కడ ఎవ రూ ఓటర్లను అడ్డుకోలేదని ఎన్నికల సంఘం స్ప ష్టం చేసింది. ఈ మేరకు తమకు ఎన్నికల ప్రత్యేక పరిశీలకుల నుంచి సమాచారం అందిందని పేర్కొంది.

అస్సాంలో..
అస్సాంలో రెండో దశ పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసింది. 39 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో సాయంత్రం ఐదు గంటల వరకు 77.21% ఓటింగ్‌ నమోదయింది. కొన్ని చోట్ల ఈవీఎంలు మొరాయించడంతో వెంటనే వాటిని మార్చారు. దాదాపు అన్ని బూత్‌ల్లో ఓటర్లు కోవిడ్‌ 19 నిబంధనలను పాటిస్తూ ఓటింగ్‌లో పాల్గొన్నారు.  


మమత వచ్చిన పోలింగ్‌ కేంద్రం వద్ద వ్యతిరేక నినాదాలు చేస్తున్న గ్రామస్తులు

Advertisement
 
Advertisement
 
Advertisement