సాక్షి, ఆదిలాబాద్: ఎంపీ సోయం బాపూరావు మూడు రోజులుగా దేశ రాజధాని ఢిల్లీలోనే ఉన్నారు. హైకమాండ్ పిలుపుతోనే ఆయన గత శనివారం ఇక్కడి నుంచి బయల్దేరి వెళ్లినట్లు పార్టీ శ్రేణులు పేర్కొంటున్నాయి. ప్రధానంగా ఆయనను బుజ్జగించేందుకు పిలిచారా.. లేని పక్షంలో కేంద్ర మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణ త్వరలో ఉంటుందని, ఈ నేపథ్యంలో ఆయనకు సహాయ మంత్రి పదవి ఇచ్చేందుకే ఈ పిలుపని పార్టీలో రెండు రకాల ప్రచారాలు సాగుతున్నాయి. తెలంగాణకు రెండు కేంద్ర మంత్రి పదవులు కేటాయించే అవకాశం ఉందని, ఇందులో ఎస్టీ కోటాలో సోయంకు పదవి దక్కనుందనే ప్రచారం కూడా ఉంది. ఏదేమైనా ఈ పరిణామాలు ఆసక్తి కలిగిస్తున్నాయి.
ప్రచారాలకు ఊతం ఇలా..
కొద్ది రోజుల క్రితం ఎంపీ ల్యాడ్స్ విషయంలో సోయం బాపూరావు వ్యాఖ్యలు సంచలనం కలిగించాయి. ఇప్పటి వరకు ఆ నిధులు పార్టీకి చెందిన స్థానిక ప్రజాప్రతినిధులకు కేటాయించలేకపోయానని, తన కొడుకు పెళ్లి.. ఇంటి నిర్మాణంలో వాటిని వాడుకోవాల్సి వచ్చిందని ఆయన అంటున్నటువంటి వీడియో క్లిప్ వైరల్ అయింది. ఆ తర్వాత సోయం బాపూరావు వైరల్ అయిన వీడియోలోని మాటలను ఖండించారు.
పార్టీలో కొంతమంది కావాలని దుష్ప్రచారం చేస్తున్నారంటూ జిల్లా అధ్యక్షుడు పాయల్ శంకర్, మాజీ ఎంపీ రాథోడ్ రమేశ్‌పై ఆరోపణలు సంధించారు. వీటి తర్వాత ఆయన పార్టీ మారుతున్నారనే ప్రచారం సోషల్ మీడియాలో విస్తృతంగా సాగింది. ఈ నేపథ్యంలో హైకమాండ్ బుజ్జగించేందుకే ఢిల్లీకి పిలిచిందా అనే ప్రచారం సాగుతోంది. మరో వైపు తెలంగాణ నుంచి ఇద్దరికి మంత్రి పదవులు దక్కడం ఖాయమని ప్రచారం సాగుతుండగా బీసీ కోటాలో ఒకరికి, ఎస్టీ కోటాలో సోయంను వరించే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు.
పార్టీ పరిణామాలపై స్తబ్ధత..
పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవికి బండి సంజయ్ రాజీనామా చేయడం, ఆ స్థానంలో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డిని హైకమాండ్ నియమించడంపై జిల్లా పార్టీ వర్గాల్లో బాహాటంగా ఎవరు ఎలాంటి వ్యాఖ్యలు చేయడం లేదు. అయితే ఓ వర్గం ఈ పరిణామాలతో నారాజ్ ఉండగా, మరో వర్గం పార్టీ నిర్ణయాన్ని గౌరవించాల్సిందేనన్న రీతిలో ఉన్నారు. ఇదిలా ఉంటే కొంత మంది ద్వితీయ శ్రేణి నేతలు వాట్సాప్ స్టేటస్‌లో బండి సంజయ్‌తోనే రాష్ట్రంలో బీజేపీ బలోపేతం అయిందని ఆయన తొలగింపు సరికాదనే విధంగా పోస్టులు పెడుతున్నారు. మొత్తంగా రెండు రోజులుగా కమలం పార్టీలో జరుగుతున్న పరిణామాలను అటు సాధారణ జనంతో పాటు ఇటు పార్టీ శ్రేణులు ఆసక్తిగా గమనిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment