సెక్షన్లు మారినయ్‌.. మావల పీఎస్‌లో తొలి కేసు..! | - | Sakshi
Sakshi News home page

సెక్షన్లు మారినయ్‌.. మావల పీఎస్‌లో తొలి కేసు..!

Published Tue, Jul 2 2024 12:08 AM | Last Updated on Tue, Jul 2 2024 11:22 AM

-

సెక్షన్లు మారినయ్‌

మావల పీఎస్‌లో తొలి కేసు

నూతన నేర చట్టాలపై సిబ్బందికి శిక్షణ

ఠాణాల వారీగా ప్రజలకు అవగాహన

పాత వాటి స్థానంలో కొత్త చట్టాలు..

పాత చట్టం కొత్త చట్టం

భారత శిక్షా స్మృతి (ఐపీసీ) భారత న్యాయ సంహిత (బీఎన్‌ఎస్‌)

భారత సాక్ష్యాధారాల చట్టం భారతీయ సాక్ష్య అధినీయమ్‌ (బీఎస్‌ఏ)

భారత నేర శిక్షా స్మృతి (సీఆర్‌పీసీ) భారతీయ నాగరిక్‌ సురక్ష సంహిత (బీఎన్‌ఎస్‌ఎస్‌)

సాక్షి, ఆదిలాబాద్‌: బ్రిటీష్‌ కాలం నాటి నేర న్యాయ వ్యవస్థను ప్రక్షాళన చేసేలా కొత్తగా రూపొందించిన మూడు నేర న్యాయ చట్టాలు జూలై 1 నుంచి అమల్లోకి వచ్చేశాయి. జల్లాలోని మావల పీఎస్‌లో తొలి కేసు నమోదైంది. జిల్లాలోని పోలీస్‌ సిబ్బందికి వీటి పై శిక్షణ దాదాపు పూర్తి చేసినట్లు ఆ శాఖ ఉన్నతాధికారులు పేర్కొంటున్నారు. నూతన చట్టాలతో సత్వర న్యాయం అందే అవకాశముంటుందని చెబుతున్నారు.

మావలో తొలి కేసు..
మావల పోలీసు స్టేషన్‌ పరిధిలోని పాలిటెక్నిక్‌ కాలే జ్‌ గ్రౌండ్‌ సమీపంలో సోమవారం క్రాంతినగర్‌కు చెందిన ప్రైవేట్‌ టీచర్‌ ఎల్మావార్‌ నకుల్‌ రెడ్డి(36) పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. అతని తండ్రి భూమారెడ్డి పోలీసులకు ఫిర్యాదు చే శాడు. మృతుడి భార్య 15 రోజుల క్రితం పుట్టింటికి వెళ్లి తిరిగి రాలేదు. దీంతో మనస్తాపం చెందాడు. అప్పటికే మద్యానికి అలవాటుపడ్డ అతను దీని నుంచి తేరుకోలేక పురుగుల మందుతాగి ఆత్మహ త్య చేసుకున్నాడు.

దీనికి సంబంధించి పాత చట్టాల పరంగా సీఆర్‌పీసీ 174 సెక్షన్‌ కింద కేసు నమోదు చేసేవారు. కొత్త చట్టాలు అమల్లోకి రావడంతో బీఎన్‌ఎస్‌ఎస్‌ 194 సెక్షన్‌ కింద మావల పోలీసు స్టేషన్‌లో సోమవారం రాత్రి కేసు నమోదైంది. ఇక అసహజ మరణాలకు సంబంధించి బీఎన్‌ఎస్‌ఎస్‌ కింద నమోదు చేస్తారు. ఇతర కేసుల్లో ఇది వరకు ఐపీసీ సెక్షన్ల కింద కేసులు నమోదయ్యేవి. తాజాగా బీఎన్‌ఎస్‌ సెక్షన్ల కింద నమోదు షురూ అయింది.

అమల్లోకి..
భారత న్యాయ సంహిత (బీఎన్‌ఎస్‌), భారతీయ సాక్ష అధినీయమ్‌ (బీఎస్‌ఏ), భారతీయ నాగరిక్‌ సురక్ష సంహిత (బీఎన్‌ఎస్‌ఎస్‌) కొత్త చట్టాలను కేంద్ర ప్రభుత్వం రూపొందించి జూలై 1నుంచి అమల్లోకి తెచ్చింది. ఇకపై జరిగే నేరాలకు సంబంధించి వీటిలోని సెక్షన్ల ఆధారంగానే కేసులు నమోదు కా నున్నాయి. కొత్త చట్టాల రాకతో భారత శిక్షా స్మృతి (ఐపీసీ), భారత సాక్షాధారాల చట్టం, భారత నేర శిక్షా స్మృతి (సీఆర్‌పీసీ) కనుమరుగు కానున్నాయి.

అయితే జూలై 1వ తేది కంటే ముందు ఏవైనా కేసులు జరిగినట్టు రిపోర్టులు వస్తే పాత సెక్షన్‌లోనే కేసు నమోదు చేస్తారు. నేరడిగొండ పీఎస్‌ పరిధిలో సోమవారం ఓ మిస్సింగ్‌ కేసు పోలీసుల దృష్టికి వచ్చింది. అయితే ఆదివారం నుంచి మిస్సింగ్‌ ఉండడంతో అది పాత సెక్షన్లలోనే నమోదు చేశారు.

కొత్త చట్టాల్లోని ప్రధాన అంశాలు..
కొత్త చట్టాలపై ప్రజలకు ఇంకా పూర్తిగా అవగాహన రావాల్సి ఉంది. ఇదిలా ఉంటే కొన్ని అంశాలు పరిశీలిస్తే.. బాధితుడు ఇకపై నేరుగా పోలీసు స్టేషన్‌కు వెళ్లకుండానే జరిగిన సంఘటనపై ఎలక్ట్రానిక్‌ కమ్యూనికేషన్‌ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు. పోలీసు స్టేషన్‌ పరిధితో సంబంధం లేకుండా ఎవరైనా, ఎక్కడైనా ఫిర్యాదు చేసిన పక్షంలో జీరో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేస్తారు. హేయమైన నేరాల్లో వీడియోగ్రఫీ తప్పనిసరి చేయనున్నారు.

దీంతో దర్యాప్తులో నాణ్యత పెరిగే అవకాశం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. మహిళలు, చిన్నారులపై జరిగే నేరాల్లో దర్యాప్తు నిర్ధేశిత గడువులోపు పూర్తి కావాలి. బాధిత మహిళలు, చిన్నారులకు ఉచితంగా ప్రాథమిక చికిత్స, వైద్య చికిత్స అందించాల్సి ఉంటుంది. సమన్లు ఇకపై నేరుగా వెళ్లి ఇవ్వాల్సిన పని లేదు. ఆన్‌లైన్‌లో పంపించవచ్చు. అత్యాచార కేసుల్లో బాధితురాలి వాంగ్ములాన్ని ఆడియో, వీడియో ద్వారా పోలీసులు నమోదు చేయాలి.

95 శాతం పోలీసులకు శిక్షణ..
కొత్త చట్టాలపై 95 శాతం పోలీసు సిబ్బందికి ఇప్పటికే శిక్షణ పూర్తి చేసినట్లు జిల్లా పోలీసు అధికారి చెబుతున్నారు. 11 బ్యాచుల్లో 535 మందికి ఈ శిక్షణ ఇచ్చారు. సీఐడీ తెలంగాణ నుంచి కూడా వచ్చినవారు ఎస్‌వోపీ స్టాండింగ్‌ అంశాల్లో ఎలా వ్యవహరించాలనే దానిపై అవగాహన కలిగించారు. మొత్తంగా పోలీసు శాఖ నూతన చట్టాల పరంగా ముందుకు కదిలింది.

ఠాణా వారీగా అవగాహన
కొత్త చట్టాలకు సంబంధించి పోలీసు స్టేషన్‌ వారీగా ప్రజలకు అవగాహన కల్పించనున్నాం. ఇదివరకు చట్టాలు పనిష్మెంట్‌ లాగా ఉండేవి. కొత్త చట్టాలు న్యాయం చేకూరుస్తాయి. సిబ్బందికి శిక్షణ దాదాపుగా పూర్తయ్యింది. – గౌస్‌ ఆలం, ఎస్పీ

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement