సమీకరణాలు మారినట్టే..
● కాంగ్రెస్‌లో పదవుల పందేరం ● తుది దశకు చేరిన వ్యవహారం ● పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి రాకతో మార్పులు జరిగే అవకాశం!
సాక్షి, ఆదిలాబాద్: డీసీసీ అధ్యక్ష పదవికి నాయకుడి ఎంపిక తుది దశకు వచ్చింది. కొద్ది రోజుల్లోనే డీసీసీ పీఠం ఎవరిదనేది తేలిపోనుంది. ఈ దశలో సమీకరణాలు మారనున్నట్లు తెలుస్తోంది. డీసీసీ అధ్యక్షుడి నియామకం ఇక ఆగిపోయినట్టే. మళ్లీ పూర్తిస్థాయి పరిశీలన తర్వాత కొత్త అధ్యక్షుడు ఎవరనేది తేలనుందని పార్టీలో చర్చ సాగుతోంది. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జీగా ఉన్న దీపాదాస్ మున్షిని ఇటీవల అధిష్టానం తొలగించిన విషయం తెలిసిందే. ఆమె స్థానంలో ఆ పార్టీ సీనియర్ నేత మీనాక్షి నటరాజన్‌ను నియమించడం, ఆమె శుక్రవారం రాష్ట్రానికి చేరుకోవడంతో జిల్లా పార్టీలోనూ ఆమె ప్రభావంపై జోరుగా చర్చ సాగుతోంది.
పరిశీలన తర్వాతే నిర్ణయం!
ప్రధానంగా కీలక డీసీసీ అధ్యక్షుడి నియామకంలోనే ఈ చర్చ సాగుతోంది. గత ఇన్‌చార్జి హయాంలో దాదాపు ఈ అంశం కొలిక్కి వచ్చిందని, ఇక నిర్ణయం వెలవడడమే తరువాయి అన్న అభిప్రాయం పార్టీలో వ్యక్తమైంది. తాజాగా మారిన పరిస్థితుల నేపథ్యంలో కొత్త ఇన్‌చార్జి బాధ్యతలో కుదుట పడిన తర్వాత కొద్దిరోజులకు ఈ విషయంలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని చెప్పుకొంటున్నారు. అంతే కాకుండా ఇప్పటివరకు అధ్యక్ష పదవి తమకే దక్కుతుందని అనుకున్న వారికి ఇప్పుడు అదే నిర్ణయం వెలువడుతుందని అనుకో వడం పొరపాటేనని అందరూ అనుకుంటున్నారు. గాంధీ కుటుంబానికి వీరవిధేయురాలిగా ఉన్న మీనాక్షి నటరాజన్ పూర్తిస్థాయిలో పరిశీలన చేసిన తర్వాతే కొత్త అధ్యక్షుడిని నియమించవచ్చని, ఈ నేపథ్యంలో ఇప్పటివరకు తమకే దక్కుతుందని అనుకున్నవారికి నిర్ణయం అంత సుళువుగా ఉండక పోవచ్చని పేర్కొంటున్నారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ..
ప్రధానంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు పోటీ చేసే అభ్యర్థులను ఎంపిక చేసే ప్రక్రియలో డీసీసీ అధ్యక్షుడి భూమిక కీలకమవుతుంది. ఈ నేపథ్యంలో అధికార పార్టీలో డీసీసీ అధ్యక్షుడి హోదా కోసం పలువురు ప్రయత్నాలు చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు మీనాక్షి నటరాజన్ జిల్లాలో పర్యటించి పాదయాత్ర చేపట్టారు. ఈ నేపథ్యంలో జిల్లాలో అప్పుడున్న నాయకులతో ఆమెకు పరిచయాలున్నాయి. కాగా, అసెంబ్లీ ఎన్నికల సమయంలో తిరుగుబాటు చేశారనే కారణం, స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయడం లాంటి కారణాలతో కొందరు ముఖ్య నాయకులను పార్టీ నుంచి తొలగించారు. తాజాగా ఈ అంశాల్లోనూ పార్టీలో చర్చ మొదలైంది. ఉమ్మడి జిల్లాలో ఓ కీలక నేత పాత నాయకులను తిరిగి పార్టీలోకి తీసుకువచ్చే విషయంలో సంప్రదింపులు జరుపుతున్నారనే చర్చ పార్టీలో మొదలైంది. ప్రధానంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో వారి సేవలు కూడా ఉపయోగించుకోవడం ద్వారా పార్టీ గెలుపు కోసం పాటుపడాలనే ఉద్దేశాన్ని తెరపైకి తీసుకొస్తున్నారు. ఇప్పుడు ఈ అంశం ప్రాధాన్యత సంతరించుకుంది. మొత్తంగా కొత్త ఇన్‌చార్జి రాకతో పార్టీలో ఎలాంటి వ్యవహారాలు చోటుచేసుకుంటాయోనని పార్టీ కార్యకర్తలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment