మేడం మీనాక్షి.. ఏం చెబుతారో
● కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్కంఠ ● నేడు పార్టీ ఆదిలాబాద్ పార్లమెంటరీ సమావేశం ● గాంధీభవన్‌లో రాష్ట్ర ఇన్‌చార్జి ఆధ్వర్యంలో.. ● పార్టీ పరిస్థితిపై ఇప్పటికే నివేదిక ● తదనుగుణంగా ముందుకెళ్తారనే చర్చ
సాక్షి,ఆదిలాబాద్: మేడం మీనాక్షి.. ఇప్పుడు కాంగ్రెస్ సామాన్య కార్యకర్తల నోటిలో నానుతున్న పేరు. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జిగా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన విషయం విదితమే. తాజాగా ఆమె గాంధీ భవన్‌లో మాట్లాడుతూ.. పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పదేళ్లు జెండా మోసిన కార్యకర్తలకు పూర్తి న్యాయం చేయడమే తన ధర్మమని ప్రకటించడం గమనార్హం. ఈ క్రమంలో పార్టీ ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ముఖ్య నేతలతో గాంధీ భవన్‌లో బుధవారం ఆమె సమావేశం కానున్నారు. కరీంనగర్, పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ నేతల సమావేశాలు కూడా ఇదే రోజు ఉండడంతో ఉమ్మడి జిల్లా ఇన్‌చార్జి మంత్రి సీతక్క, ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎంపీ, అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్‌చార్జీలు, ముఖ్య నేతలు ఇందులో పాల్గొననుండటం ప్రాధాన్యత సంతరించుకుంది.
పార్టీ సంస్థాగత నిర్మాణంపై దృష్టి
కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జిగా ఇటీవల మీనాక్షి నటరాజన్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత పార్టీ సంస్థాగత నిర్మాణంపై ఆమె దృష్టి సారించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రధానంగా జిల్లా స్థాయిలో అనేక నామినేటెడ్ పదవులు, జిల్లా అధ్యక్షుల నియామకం చేపట్టాల్సి ఉండగా, రాష్ట్ర ఇన్‌చార్జి నిశితంగా అన్ని పార్లమెంట్ నియోజకవర్గాలపై దృష్టి సారించడంతో కార్యకర్తల్లో హర్షం వ్యక్తమవుతుంది. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత బీఆర్‌ఎస్ నుంచి ముఖ్యమైన, ద్వితీయశ్రేణి నేతలు, నాయకులు కూడా హస్తం పార్టీలో చేరారు. దీంతో క్షేత్రస్థాయిలో పాత, కొత్త నాయకుల మధ్య కొంత వైరం కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో మీనాక్షి నటరాజన్ మాటలు ప్రధానంగా పాత నాయకుల్లో ఉత్తేజం కలిగిస్తుంది. పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తమకు సరైన ప్రాధాన్యత దక్కడం లేదన్న నిరుత్సాహం వారిలో కనిపిస్తుండగా, రాష్ట్ర ఇన్‌చార్జి ఈ పరిస్థితులను పూర్తిస్థాయిలో చక్కదిద్ది తమకు న్యాయం చేస్తారన్న ఆశాభావం వారిలో కనిపిస్తుంది. ఇదిలా ఉంటే ఇప్పటికే క్షేత్రస్థాయి నుంచి పార్టీ పరిస్థితులపై ఆమె సొంత సర్వే ద్వారా నివేదికలు తెప్పించుకున్నట్లు తెలుస్తోంది. దాని ఆధారంగానే పార్టీ పార్లమెంట్ నియోజకవర్గ సమావేశాలు నిర్వహిస్తున్నట్లు నాయకులు చెబుతుండటం ప్రాధాన్యత కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో పాత, కొత్త నాయకుల మధ్య సమన్వయం చేసేందుకు రాష్ట్ర ఇన్‌చార్జి ఉమ్మడి జిల్లా నేతలతో ఎలాంటి సూచనలు చెబుతారనేది ఆసక్తికరంగా మారింది.
స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో..
రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ నుంచి జెడ్పీటీసీ, ఎంపీటీసీ, కౌన్సిలర్లుగా పోటీ చేయాలని పలువురు ఆసక్తి కనబర్చుతున్నారు. అయితే పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పలువురు బీఆర్‌ఎస్, ఇతర పార్టీల నుంచి హస్తం పార్టీలకు రావడంతో క్షేత్రస్థాయిలో పాత నాయకులు ఉన్నచోట వారికి కొత్త నాయకులతో టికెట్ పరంగా పోటీ ఉంది. ఈ నేపథ్యంలో పార్టీ నిర్ణయం ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది. ఎన్నో ఏళ్లుగా పార్టీ జెండా మోసిన తమకు న్యాయం చేయాలని పాత నాయకులు గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. అంతే కాకుండా కొత్త నాయకులు రావడంతో పార్టీలో తమ ప్రభావం పూర్తిగా తగ్గిందన్న అభద్రతాభావం కూడా వారిలో కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో మీనాక్షి నటరాజన్ ఉద్దీపన ఎలా ఉంటుందనేది ఆసక్తికరం. మొత్తంగా నేడు జరిగే పార్లమెంట్ స్థాయి నియోజకవర్గ సమావేశంలో రాష్ట్ర ఇన్‌చార్జి ఎలాంటి దిశానిర్దేశం చేస్తారనేది చూడాల్సిందే.
కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్
మేడం మీనాక్షి.. ఏం చెబుతారో
Comments
Please login to add a commentAdd a comment