కేయూక్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ పరిధిలో ఉమ్మడి వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాల్లోని డిగ్రీ కోర్సుల మొదటి, మూడవ, ఐదవ సెమిస్టర్ల పరీక్ష ఫలితాలను ఈ నెల 4న రాత్రి విడుదల చేసిన విషయం తెలిసిందే. కానీ డీన్ అకాడమిక్‌కు ఫీజులు చెల్లించని 121 ప్రైవేటు డిగ్రీ కళాశాలల ఫలితాలను నిలిపి వేశారు. ఇప్పటికే ఫీజులు చెల్లించాల్సి ఉండగా.. అప్పట్లో ప్రైవేటు డిగ్రీ కళాశాలల యాజమాన్యాల అసోసియేషన్ బాధ్యులు కేయూ వీసీ ప్రతాప్‌రెడ్డిని, అప్పటి రిజిస్ట్రార్ మల్లారెడ్డిని కలిశారు. ప్రభుత్వం మూడేళ్లుగా ఫీజు రీయింబర్స్‌మెంటు ఇవ్వడం లేదని, కొంత సమయం ఇవ్వాలని అభ్యర్థించారు. 15 నుంచి 20 రోజుల వరకు సమయం ఇచ్చారు. పరీక్షలు పూర్తయ్యాక యూనివర్సిటీ అకాడమిక్ డీన్ ఆయా కళాశాలలకు ఫీజులు చెల్లించాలని నోటీస్‌లు పంపారు. బుధవారం వరకు 121 ప్రైవేటు కళాశాలలు ఫీజులు చెల్లించలేదు. ఫీజులు చెల్లించిన కళాశాలల ఫలితాలు వెబ్‌సైట్‌లో ఉంచి చెల్లించని వారివి నిలిపివేశారు. తమ ఫలితాలు చూసుకునే వీలులేకపోవడంతో ఆయా కళాశాలల విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. ఫీజులు చెల్లించినట్లు క్లియరెన్స్ వస్తేనే ఫలితాలు వెల్లడిస్తామని పరీక్షల నియంత్రణాధికారి ప్రొఫెసర్ రాజేందర్ స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment