అథ్లెటిక్స్‌లో మెరిశారు..
● ప్రతిభ కనబర్చిన ఉమ్మడి జిల్లా క్రీడాకారులు ● పతకాలతో సత్తాచాటుతూ.. ● అంతర్జాతీయ పోటీలకు ప్రాతినిధ్యం
వారందరిది నిరుపేద కుటుంబ నేపథ్యం. అయినప్పటికీ భవిష్యత్‌లో ఉన్నతంగా ఎదగాలని చదువును కొనసాగిస్తూనే క్రీడారంగాన్ని ఎంచుకున్నారు. అథ్లెటిక్స్‌లో నిరంతరం సాధన చేసి ప్రతిభ కనబరుస్తున్నారు. జిల్లా, రాష్ట్ర, జాతీయస్థాయి పోటీల్లో ఉమ్మడి జిల్లా క్రీడాకారులు సత్తా చాటి పతకాలు సాధిస్తున్నారు. అంతర్జాతీయ పోటీలకు దేశం తరుఫున ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గత నెల 18, 19వ తేదీల్లో హైదరాబాద్‌లోని ఉస్మానియా యూనివర్సిటీలో 11వ తెలంగాణ రాష్ట్ర యూత్ అథ్లెటిక్స్ చాంపియన్ షిప్ పోటీల్లోనూ ప్రతిభ కనబర్చారు. ఉమ్మడి జిల్లా క్రీడాకారులపై ప్రత్యేక కథనం. – ఆదిలాబాద్
శిక్షకుల ప్రోత్సాహంతోనే..
బేల మండలం సిర్సన్నకు చెందిన ఎస్కే ఫిరోజ్– షరీఫా దంపతుల కుమార్తె ముస్కాన్. అథ్లెటిక్స్ పోటీల్లో విజేతగా నిలుస్తోంది. ప్రస్తుతం ఉస్మానియా యూనివర్సిటీలో డీ.పెడ్ కోర్సు చేస్తున్న ఆమె హ్యామర్‌త్రో ఈవెంట్‌లో మూడు పతకాలు సాధించింది. హైదరాబాద్, హన్మకొండలో జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో స్వర్ణం, రజతం, ఉస్మానియా యూనివర్సిటీ స్థాయిలో కాంస్య పతకాలతో మెరిసింది. శిక్షకులు రేణుక, వీజీఎస్ రాకేశ్ ప్రోత్సాహంతో రాగలిగింది. జాతీయ అథ్లెటిక్స్ శిక్షకురాలిగా ఎదగాలన్నదే తన లక్ష్యమని చెబుతోంది.
– ముస్కాన్
అంతర్జాతీయ స్థాయిలో మెరిశాడు
ఇచ్చోడ మండలం దేవుల్ నాయక్ తండాకు చెందిన రమేశ్ రాథోడ్–లక్ష్మీబాయి దంపతులకు కుమారుడు రాథోడ్ వంశీ. గతేడాది జూలైలో నేపాల్‌లో జరిగిన టార్గెట్ బాల్‌పోటీల్లో దేశం తరఫున ప్రాతినిధ్యం వహించాడు. ఇందులో భారత్ రెండో స్థానంలో నిలువగా, వెండి పతకం నిలబెట్టుకున్నాడు. రాష్ట్రస్థాయి పోటీల్లో హామర్ త్రో ఈవెంట్లో రెండుసార్లు రజత పతకాలు సాధించగా, ఓసారి కాంస్య పతకంతో విజేతగా నిలిచాడు. కాకతీయ విశ్వవిద్యాలయ యూనివర్సిటీ స్థాయి పోటీల్లో బ్యాడ్మింటన్ క్రీడలో ప్రాతినిధ్యం వహించి రాణించాడు. వ్యాయామ ఉపాధ్యాయుడిగా కావడమే లక్ష్యంగా ప్రతీరోజు నాలుగు గంటలు మైదానంలో శ్రమిస్తున్నాడు.
– వంశీ
గ్రూప్–1 ఆఫీసర్ కావడమే లక్ష్యం..
ఆదిలాబాద్‌కు చెందిన ప్రవీణ్–గీత దంపతుల కుమారుడు డి.చంద్రసిద్ధార్థ.. ప్రైవేట్ కళాశాలలో ఇంటర్ సెకండియర్ చదువుతున్నాడు. ఐదో తరగతి నుంచే ఆటలపై మక్కువ పెంచుకుని, రాష్ట్ర, జాతీయ స్థాయి క్రీడా పోటీల్లో రాణిస్తున్నాడు. అథ్లెటిక్స్‌లో రేస్‌వాక్ ఈవెంట్లో ఇటీవల జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో కాంస్య పతకం గెలుపొందాడు. 2022లో జాతీయస్థాయి పోటీలకు ప్రాతినిధ్యం వహించాడు. గతేడాది డిసెంబర్‌లో జరిగిన ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీలో ఉత్తీర్ణత సాధించాడు. సైనికుడిగా విధులు నిర్వర్తిస్తూనే, తన చిన్ననాటి కల అయిన గ్రూప్–1 ఆఫీసర్ కావడమే లక్ష్యంగా సన్నద్ధమవుతున్నాడు.
– డి.చంద్రసిద్ధార్థ
ఎన్‌ఐఎస్ శిక్షకుడినవుతా
బజార్‌హత్నూర్ మండలం మంజారం తండాకు చెందిన గురుదయాల్ సింగ్–శారదబాయి దంపతుల కుమారుడు అజాడే అనిల్. ఆదిలా బాద్ ప్రభుత్వ సైన్స్ డిగ్రీ కళాశాలలో డిగ్రీ సెకండియర్ చదువుతున్నాడు. ఈయన అథ్లెటిక్స్‌లో హేమర్ త్రో, స్టీపుల్ చేజ్, ట్రిపుల్ జంప్ పోటీల్లో పాల్గొని పతకాలు సాధిస్తున్నాడు. 2019 పూణెలో జరిగిన స్విమ్మింగ్ జాతీయస్థాయి పోటీల్లో ప్రతిభ కనబర్చాడు. ఇటీవల రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో ఒక వెండి, కాంస్య పతకాలు కై వసం చేసుకున్నాడు. అంతర్జాతీయ పోటీల్లో విజేతగా నిలవడమే కాకుండా నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ స్పోర్ట్స్ కోచ్‌గా వ్యవహరించడమే తన లక్ష్యమని, ఇందుకోసం శిక్షకులు వీజీఎస్ రాకేశ్, వీజీఎస్ జోల పర్యవేక్షణలో శిక్షణ పొందుతున్నా. – అజాడే అనిల్
అథ్లెటిక్స్‌లో మెరిశారు..
అథ్లెటిక్స్‌లో మెరిశారు..
అథ్లెటిక్స్‌లో మెరిశారు..
అథ్లెటిక్స్‌లో మెరిశారు..
Comments
Please login to add a commentAdd a comment