బీ కేర్..‘సెల్’!
ఆదిలాబాద్‌టౌన్: చెడిపోయిన ఫోనే కదా.. ఇంట్లో నిరుపయోగంగా ఉండడం కంటే స్క్రాప్‌లో విక్రయిస్తే ఎంతోకొంత డబ్బులు వస్తాయి.. లేదా ఇంట్లో పనికొచ్చే గిన్నెలు, ప్లాస్టిక్ డబ్బాలతో ఏదైనా ఉపయోగం ఉంటుందని జనం అనుకుంటుంటారు. అయితే ఆ పాత ఫోన్లే కొంప ముంచుతున్నాయి. వాటిని విక్రయించిన వారికి సైబర్ నేరగాళ్లు చుక్కలు చూపుతున్నారు. ఆర్థిక లావాదేవీలతో పాటు ఇతర నేరాలకు పాల్పడినప్పుడు ఫోన్ విక్రయించిన వారు కేసుల్లో ఇరుక్కుంటున్నారు. తీరా మోసపోయామని తెలిసి బాధితులు లబోదిబోమంటున్నారు. రోజురోజుకు సైబర్ కేటుగాళ్లు కొత్త పుంతలు తొక్కుతున్నారు. పల్లెల్లో చిక్కు వెంట్రుకలకు గిన్నెలు, డబ్బాలు ఇస్తున్న విషయం తెలిసిందే. ఇదే తరహా వ్యాపారానికి బిహార్‌కు చెందిన ఓ ముఠా తెరలేపింది. గ్రామాల్లో మోటార్‌సైకిల్‌పై డబ్బాలు కట్టుకొని పాత సెల్‌ఫోన్లు కొంటాం.. అంటూ తిరుగుతున్నారు. విషయం తెలియని అమాయకులు వారికి ఎంతో కొంతకు విక్రయిస్తున్నారు. లేదా వస్తువులు తీసుకొని ఇచ్చేస్తున్నారు. అయితే ఇలాంటి వారిపైన అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. జిల్లాలో బిహార్ ముఠా ఏకంగా 2వేలకు పైగా పాత సెల్‌ఫోన్లను కొనుగోలు చేసి ఆ రాష్ట్రానికి తరలించేందుకు సిద్ధంగా ఉండగా, జిల్లా పోలీసులు పసిగట్టి వారి గుట్టురట్టు చేశారు.
సైబర్ కేటుగాళ్ల ప్లాన్ ఇలా..
● బిహార్‌కు చెందిన ముఠా ద్విచక్ర వాహనాలపై పల్లె, పట్టణాల్లో తిరుగుతూ చెడిపోయిన సెల్‌ఫోన్లతో పాటు పనిచేసే వాటిని తీసుకుని ప్లాస్టిక్ డబ్బాలు, గిన్నెలు అందజేస్తారు. ఇలా సేకరించిన వాటిని ఢిల్లీకి చెందిన డీలర్లకు ఒక్కోటి రూ.100 చొప్పున విక్రయిస్తారు. వారు వాటిని కాంబోడియా, ఫిలిప్పైన్స్, లాంగోస్, సౌత్‌ఈస్ట్ ఏసియా దేశాలకు తరలించి సైబర్ నేరాలకు పాల్పడే వారికి విక్రయిస్తారు. అక్కడ వాటికి రిపేర్లు చేసి అందులో ఐఎంఈ నంబర్‌తో సెల్‌ఫోన్ వినియోగదారు సమాచారం సేకరిస్తారు. మరోవైపు మన దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన నిరుద్యోగులకు ఉద్యోగాలిప్పిస్తామని ఆయా దేశాలకు చెందిన సైబర్‌మోసగాళ్లు వల విసురుతారు. ఇక్కడి నుంచి సింగాపూర్‌కు తీసుకెళ్లి వారి వీసాను లాక్కుంటారు. తిరిగి వెళ్లకుండా ఇబ్బందులకు గురిచేస్తారు. గత్యంతరం లేని పరిస్థితుల్లో కొంతమంది సైబర్ మోసగాళ్లు చెప్పే పనులకు బలవుతుంటారు. ఆయా భాషల్లో నైపుణ్యం సాధించేలా వారికి ప్రత్యేక శిక్షణ ఇస్తారు. బ్యా ంకు ఉద్యోగులు, పోలీసు అధికారులుగా, పార్ట్‌టైమ్ జాబ్ కల్పిస్తామని వారితో ఫోన్లు చేయిస్తారు. లింకులు, ఓటీపీల ద్వారా బ్యాంకులో ఉన్న డబ్బును కాజేస్తారు. అమాయకులతో పాటు అన్ని తెలిసిన వారు సైతం వీరి వలలో పడుతున్నారు. రూ.లక్షల్లో మోసపోతున్నారు.
ఇటీవల పెరుగుతున్న కేసులు..
జిల్లాలో రోజురోజుకు సైబర్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. అమాయకులు వారి ఉచ్చులోపడి నష్టపోతున్నారు. గతేడాది దాదాపు 200 వరకు కేసులు నమోదయ్యాయి. ఇందులో ఆర్థిక లావాదేవీలకు సంబంధించి 86 కేసులున్నాయి. బాధితుల నుంచి సైబర్ మోసగాళ్లు రూ.1 కోటి 50లక్షల వరకు దోచుకున్నారు. అయితే కొన్ని డబ్బులను బ్యాంకుల్లో సైబర్ పోలీసులు ఫ్రీజింగ్ చేశారు. గతేడాది మూడు లోక్ అదాలత్‌లలో రూ.17లక్షల 60వేలను బాధితులకు అందజేశారు. ఈ ఏడాది 15 కేసుల వరకు నమోదయ్యాయి. రూ.5లక్షల వరకు సైబర్ మోసగాళ్ల చేతిలో నష్టపోయారు.
ఖాతా మాయమే..
బ్యాంకు ఖాతా మనదే అయినప్పటికీ మనం విక్రయించే ఫోన్లు, ఇతర వివరాలు తెలుపడంతో అందులో ఉన్న డబ్బులను మనకు తెలియకుండగానే కాజేస్తున్నారు. ఫోన్లను హ్యాక్ చేసి ఓటీపీలు పంపి మోసాలకు పాల్పడుతున్నారు. జిల్లాలో సైబర్ నేరాలకు సంబంధించి అవగాహన కల్పిస్తున్నప్పటికీ ఇంకా బాధితులు నేరగాళ్ల చేతిలో మోసపోతూనే ఉన్నారు. మన మెయిల్, ఫేస్‌బుక్‌లను హ్యాక్ చేసి సందేశాలను పంపుతూ కొల్లగొడుతున్నారు. ఇటీవలే క్రెడిట్ కార్డు లిమిట్ పెంచాలా అని, మీ పిల్లలు మత్తు పదార్థాల కేసుల్లో ఇరుక్కుపోయారని, పోలీసులమని బెదిరింపులకు పాల్పడుతూ మోసగాళ్లు బాధితుల ఖాతాల్లో నుంచి డబ్బులు మాయం చేస్తున్నారు.
పాత మొబైల్స్ ఇస్తున్నారా.. తస్మాత్ జాగ్రత్త
మరమ్మతులు చేసి వాటి ద్వారానే సైబర్ మోసాలు
లబోదిబోమంటున్న బాధితులు
అప్రమత్తంగా ఉండాలంటున్న పోలీసులు
‘పాత ఫోన్లకు.. ప్లాస్టిక్ డబ్బాలు ఇస్తాం’ అంటూ వీధుల్లో తిరిగే వారికి పాడైపోయిన మీ సెల్‌ఫోన్లు ఇస్తున్నారా.. ఒక్క క్షణం ఆలోచించండి.. లేకుంటే మీరు కష్టాలు కొని తెచ్చుకున్నట్లే. అందులోని డేటాతో కొందరు కేటుగాళ్లు సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు. జిల్లా పోలీసులు ప్రత్యేక దృష్టి సారించడంతో తాజాగా ఈ ముఠా గుట్టు రట్టయింది.
అప్రమత్తంగా ఉండాలి
సైబర్ మోసాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. కొందరు గ్రామాలకు వచ్చి పాత సెల్‌ఫోన్లను కొనుగోలు చేస్తున్నారు. పని చేయని మొబైల్స్‌ను ఎవరికీ విక్రయించొద్దు. ఎవరికై న ఫోన్లు విక్రయించినా, కొనుగోలు చేసినా తప్పనిసరిగా బిల్లులు తీసుకోవాలి. కొంత మంది అమాయకులతో పాటు అన్ని తెలిసిన వారు కూడా నేరగాళ్ల చేతిలో మోసపోతున్నారు. ఒకవేళ డబ్బులు పోగొట్టుకుంటే వెంటనే టోల్‌ఫ్రీ నం.1930కు సమాచారం అందించాలి. www. cybercrime. comలో ఫిర్యాదు చేయాలి.
– అఖిల్ మహాజన్, ఎస్పీ
బీ కేర్..‘సెల్’!
Comments
Please login to add a commentAdd a comment