హామీల అమలులో కాంగ్రెస్ సర్కారు విఫలం
● ఎమ్మెల్యే పాయల్ శంకర్
ఆదిలాబాద్: ఎన్నికల హామీలు నిలబెట్టుకోవడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. జిల్లా కేంద్రంలోని తన క్యాంపు కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 15 నెలలు గడుస్తున్నా ఆరు గ్యారెంటీలు పూర్తిస్థాయిలో అమలు కాలేదని విమర్శించారు. 100 రోజుల్లోనే అన్నింటిని అమలు చేస్తామని శాసనసభలో ప్రకటించిన ప్రభుత్వం వాటికి నిధుల కేటాయింపులో సైతం సరైన ప్రాధాన్యత ఇవ్వలేదని మండిపడ్డారు. బుధవారం నుంచి జరిగే శాసనసభ సమావేశాల్లో హామీల అమలు విషయంలో ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకు వస్తామని తెలిపారు. అలాగే మాజీ ఎమ్మెల్యే జోగు రామన్న చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ నాలుగు సార్లు ఎమ్మెల్యేగా ఉండి కూడా ఆదిలాబాద్ నియోజకవర్గ అభివృద్ధికి ఆయన చేసింది ఏమీ లేదని విమర్శించారు. విమానాశ్రయం విషయంలో కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించిన ఎన్‌ఓసీ ఇవ్వడానికి నాటి రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రాలేదన్నారు. మరోవైపు సీసీఐ విషయంలో సైతం అనవసర రాద్ధాంతం చేస్తున్నారని, జిల్లా కేంద్రంలో రైల్వే వంతెనల విషయంలో తాను ప్రజాప్రతినిధిగా లేకపోయినా ఎంతగానో కృషి చేశానన్నారు. ఇవన్నీ మర్చిపోయి వ్యక్తిగతంగా విమర్శలకు దిగడం సబబు కాదన్నారు. తన తీరును మార్చుకోవాలని హితవు పలికారు. ఆయన వెంట నాయకులు లాలా మున్నా, ఆకుల ప్రవీణ్, జోగు రవి, ఇంద్రసేనారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment