● ఏసీబీకి చిక్కిన మాస్‌మీడియా అధికారి ● రూ.30వేలు లంచం తీసుకుంటుండగా పట్టివేత ● జిల్లాలో పెరిగిన లంచావతారులు ● ఈ ఏడాది ఇప్పటి వరకు ముగ్గురు ట్రాప్‌ | - | Sakshi
Sakshi News home page

● ఏసీబీకి చిక్కిన మాస్‌మీడియా అధికారి ● రూ.30వేలు లంచం తీసుకుంటుండగా పట్టివేత ● జిల్లాలో పెరిగిన లంచావతారులు ● ఈ ఏడాది ఇప్పటి వరకు ముగ్గురు ట్రాప్‌

Published Sat, Mar 29 2025 12:17 AM | Last Updated on Sat, Mar 29 2025 12:16 AM

ఆదిలాబాద్‌టౌన్‌: ప్రభుత్వ కార్యాలయాల్లో కొంత మంది ఉద్యోగులు, అధికారులు లంచావతారం ఎత్తుతున్నారు. చెయ్యి తడపనిదే ఏ పని చేయడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. జిల్లాలో ఈ ఏడాది ఇప్పటి వరకు ముగ్గురు ఏసీబీకి చిక్కారు. సర్కారు కొలువులో ఉండి వచ్చే జీతం సరిపోదన్నట్టుగా అక్రమ మార్గంలో లంచం తీసుకుంటూ బాధితులను వేధిస్తున్నారు. కొంతమంది అవినీతి నిరోధక శాఖకు పట్టుబడుతుండగా, చాలామంది గుట్టుగా తమ పని కానిచ్చేసుకుంటున్నారు. బాధితులు పలువురు ఏసీబీని ఆశ్రయించి వారి భరతం పట్టేలా చూస్తుండగా, చాలా మంది అవగాహన లేమి తో చేసేది లేక లంచం అందించి తమ పనులు చేయించుకుంటున్నారు. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటివరకు మూడు కేసులు నమోదయ్యాయి. ఉట్నూర్‌లో వెటర్నరి అధికారి రమేశ్‌ రాథోడ్‌, ఆ దిలాబాద్‌ జిల్లా కేంద్రంలో ఈడబ్ల్యూఐడీసీ డీఈఈ జిన్నవార్‌ శంకర్‌ ఇటీవల పట్టుబడిన విషయం తెలిసిందే. తాజాగా శుక్రవారం వైద్యారోగ్య శాఖలో పనిచేస్తున్న మాస్‌ మీడియా అధికారి రవిశంకర్‌ రూ.30వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి రెడ్‌హ్యాండెడ్‌గా చిక్కాడు.

అసలేమి జరిగిందంటే..

గుడిహత్నూర్‌ మండలంలోని మన్నూర్‌ గ్రామంలో ఓ ఆర్‌ఎంపీ ఓ మహిళకు గర్భస్రావం కోసం మాత్రలు ఇవ్వడంతో ఆమెకు అబార్షన్‌ అయ్యింది. చనిపోయిన శిశువును సదరు మహిళ వాగు సమీపంలో పడేసింది. ఈ విషయం గ్రామస్తులకు తెలియడంతో వారు పోలీసులకు సమాచారం అందించారు. వి చారణ జరిపిన పోలీసులు ఆర్‌ఎంపీపై కేసు నమో దు చేసి అరెస్టు చేశారు. అయితే ఇటీవల వైద్యారోగ్య శాఖ జిల్లా మాస్‌ మీడియా అధికారితో పాటు మరికొంత మంది అధికారులు ఆర్‌ఎంపీ నిర్వహిస్తున్న క్లినిక్‌ను సీజ్‌ చేశారు. ఈ క్రమంలో సదరు అధికారి పక్కనే మెడికల్‌ షాపు నిర్వహిస్తున్న మన్నూర్‌ గ్రామానికి చెందిన షాపు యజమానిని భయభ్రాంతులకు గురిచేశాడు. మెడికల్‌ షాపు నుంచే మాత్ర ఇచ్చావని, నీ పేరు చేర్చితే కేసు నమోదవుతుందని పేర్కొన్నాడు. విచారణలో పేరు రాయకుండా ఉండాలంటే రూ.30వేలు ఇవ్వాలని డిమాండ్‌ చేశాడు. రెండుమూడు సార్లు ఫోన్‌ కూడా చేసిన ట్లు బాధితుడు పేర్కొన్నాడు. ఈ క్రమంలో ఆయన ఏసీబీ అధికారులను గురువారం ఆశ్రయించాడు. 24 గంటల్లోపే అధికారులు అవినీతి అధికారి భరతం పట్టారు. శుక్రవారం ఉదయం 11గంటల సమయంలో మెడికల్‌ షాపు యజమాని డబ్బులు ఇస్తానని చెప్పడంతో జిల్లా కేంద్రంలోని వైద్యారోగ్య శాఖ కార్యాలయం నుంచి ఆవరణలోకి వచ్చాడు. చెట్టు కింద రూ.30వేలు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. కాగా సినీ ఫక్కీలో ఏసీబీ డీఎస్పీ లుంగీ కట్టుకొని గుర్తుపట్టకుండా కార్యాలయానికి వచ్చా రు. ఆయనతో పాటు మరో ఇద్దరు సీఐలు కిరణ్‌ రెడ్డి, స్వామిలు దాడి జరిపారు. నోట్లపై రసాయ నం చల్లిన వాటిని పరీక్షలు చేయగా, పాజిటివ్‌ వచ్చిందని ఏసీబీ అధికారులు వెల్లడించారు. పట్టుబడిన అధికారిపై కేసు నమోదు చేసినట్లు వివరించారు. కరీంనగర్‌ ఏసీబీ కోర్టులో హాజరుపర్చనున్నట్లు తెలిపారు. కాగా మాస్‌ మీడియా అధికారి ఏసీబీకి చిక్కడంతో కార్యాలయంలోని ఆ శాఖలో పనిచేసే ఉద్యోగులు మధ్యాహ్న భోజన విరామ సమయానికి ముందుగానే గదులకు తాళం వేసి ఇంటిముఖం పట్టారు. అధికారులెవరూ కనిపించలేదు.

తనిఖీ చేసిన మరుసటి రోజే..

బోథ్‌: బోథ్‌, సొనాల మండలాల్లోని పలు ప్రైవేట్‌ ఆసుపత్రులు, డయాగ్నోస్టిక్‌ కేంద్రాలను వైద్యారోగ్య శాఖలో మాస్‌ మీడియా అధికారిగా విధులు నిర్వహిస్తున్న రవిశంకర్‌ ఈ నెల 27న తనిఖీ చే శారు. నిబంధనలు పాటించకుండా నిర్వహిస్తున్న బోథ్‌లో ఓ క్లినిక్‌, సొనాలలో మరో క్లినిక్‌ను సీజ్‌ చే శారు. ఈ క్రమంలో మరుసటి రోజే అదిలాబాద్‌లో లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కడం గమనార్హం.

లంచం అడిగితే ఏసీబీని ఆశ్రయించండి..

ప్రభుత్వ కార్యాలయాల్లో ఉద్యోగులు, అధికారులు లంచం అడిగితే టోల్‌ఫ్రీ నంబర్‌ 1064కు, డీఎస్పీ నంబర్‌ 91543 88963, సీఐలను 91543 88964, 91543 88965 నంబర్లపై సంప్రదించవచ్చు. ఏసీబీ కార్యాలయంలో ఫిర్యాదు చేసినా అక్రమార్కుల భరతం పడతారు. బాధితుల వివరాలు గోప్యంగా ఉంచుతారు. సమాచారం అందించిన 24 గంటల్లోనే దాడులు నిర్వహిస్తామని ఏసీబీ అధికారులు పేర్కొంటున్నా రు. అయితే ఆ శాఖ ఉద్యోగిని పట్టిస్తే తమ పని నిలిచిపోతుంద ని భయపడాల్సిన అవసరం లేదు. ఆ తర్వాత ఇ న్‌చార్జి అధికారి ద్వారా ఏసీబీ అధికారులు త్వరగా బాధితుల పనిని దగ్గరుండి చేయిస్తారు. వేధింపులు రాకుండా చూస్తారు. అవినీతి అధికారుల ను పట్టించే సమయంలో ఇచ్చిన డబ్బులను ప్రభుత్వం రెండు నెలల్లో చెక్‌ రూపంలో తిరిగి అందజేస్తుంది. పట్టుబడ్డ ఉద్యోగులు 40 నుంచి 50 రోజుల పాటు జైలు జీవితం గడపాల్సి ఉంటుంది. రెండేళ్ల వరకు ఉద్యోగంలో చేరే అవకాశం ఉండదు. 8 నుంచి పదేళ్లలో కేసు ట్రయల్‌కు వస్తుంది. దాదాపు 90శాతం కేసులు రుజువవుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement