
ఇంటిపన్ను @ 90.43%
● 243 పంచాయతీల్లో శతశాతం ● సమస్యల పరిష్కారానికి దోహదం
కైలాస్‌నగర్: ఏడాది క్రితమే గ్రామపంచాయతీ పాలకవర్గాల పదవీకాలం ముగియగా నిధుల లేమితో గ్రామాలు కొట్టుమిట్టాడుతున్నాయి. అ భివృద్ధి కుంటుపడింది. కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన 15వ ఆర్థికసంఘం నిధులు పూర్తిగా నిలిచిపోయాయి. రాష్ట్ర ప్రభుత్వం నుంచి అరకొరగానే అందుతున్నాయి. దీంతో పంచాయతీల్లోని సమస్యలు పరిష్కరించుకోవడం కార్యదర్శులకు తలకు మించిన భారంగా మారింది. ఈ నేపథ్యంలో ఆస్తిపన్ను వసూళ్లపై ప్రత్యేక దృష్టి సారించారు. ఆశించినస్థాయిలోనే వసూలు చేయగలిగారు. ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాల్లో తీరి కలేకుండా ఉన్నప్పటికీ ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగి 90శాతం పన్ను వసూలు చేశారు. జిల్లాలో 473 గ్రామపంచాయతీలుండగా 243 పంచాయతీల్లో శతశాతం పన్ను వసూలు చేసి ఆదర్శంగా నిలిచారు. నిధుల లేమితో సతమతమవుతున్న పంచాయతీలకు ఇంటిపన్ను రూపంలో సమకూరిన ఆదాయం చిన్నపాటి సమస్యలు పరిష్కరించుకునేందుకు ఉపయోగపడనుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఆదర్శంగా జైనథ్..
ఇంటిపన్ను వసూళ్లలో జైనథ్ మండలం ఆదర్శంగా నిలిచింది. ఈ మండలంలో 17 గ్రామపంచా యతీలుండగా 16 పంచాయతీలు వందశాతం పన్నులు వసూలు చేశాయి. పంచాయతీ సిబ్బంది సమన్వయంతో ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగిన కార్యదర్శులు లక్ష్యాన్ని సాధించి మిగతా పంచాయతీలకు ఆదర్శంగా నిలిచారు.
చిన్న సమస్యల పరిష్కారానికి..
పంచాయతీ ఖజానా ఖాళీగా ఉండటంతో పల్లెపాలన కార్యదర్శులకు పెనుభారంగా మారుతోంది. తాగునీరు, పారిశుధ్యం, విద్యుత్ తదితర కనీస మౌలిక వసతులు కల్పించాల్సిన బాధ్యత పంచాయతీలపై ఉంది. ఏడాదిగా పాలకవర్గాలు లేకపోవడం, ప్రత్యేకాధికారులు రాకపోవడంతో కార్యదర్శులే అన్ని వ్యవహారాలు చూసుకోవాల్సి వస్తోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి నిధులు రాకపోవడంతో వారు తీవ్ర ఇబ్బందులు ప డుతున్నారు. ప్రస్తుతం ఎండలు దంచికొడుతుండటం, భూగర్భజలాలు అడుగంటిపోవడంతో నీటి ఎద్దడి వారికి చాలెంజ్‌గా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో ఇంటిపన్ను రూపంలో సమకూరిన ఆదాయంతో ఇలాంటి చిన్నపాటి సమస్యలు పరిష్కరించుకునేందుకు తోడ్పడిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
అట్టడుగున ఉట్నూర్..
అత్యధిక గ్రామపంచాయతీలు కలిగిన ఉ ట్నూర్ మండలం ఇంటిపన్ను వసూళ్లలో వె నుకబడి అట్టడుగుస్థానంలో ఉంది. ఈ మండలంలో 38 గ్రామపంచాయతీలుండగా 12 పంచాయతీలు మాత్రమే వందశా తం పన్నులు వసూలు చేశాయి. మరో 26 పంచాయతీలు పన్నుల వసూళ్లలో వెనుకబడ్డాయి. అదే ఏజెన్సీ ప్రాంతమైన నార్నూ ర్ మండలం కూడా భేష్ అనిపించుకుంది. ఈ మండలంలో 23 పంచాయతీలుండగా ఇందులో 20 పంచాయతీలు వందశాతం పన్నులు వసూలు చేశాయి. పక్కనే ఉన్న ఏజెన్సీ మండలమైన ఉట్నూర్ పూర్తిగా వెనుకబడిపోగా నార్నూర్ ఆశించిన స్థాయి కంటే అధికంగా వసూలు చేసి జిల్లాలో లక్ష్యసాధనలో రెండో స్థానంలో నిలవడం గమనార్హం. తలమడుగు మండల పరిస్థితి మరి అధ్వానంగా ఉంది. జిల్లా కేంద్రానికి ఆనుకుని ఉండే ఈ మండలం పన్నుల వసూలుపై అంతగా దృష్టి సారించలేదు. 29 పంచాయతీలకు ఏడు పంచాయతీలు మాత్ర మే వందశాతం పన్నులు వసూలు చేయడం అక్కడి కార్యదర్శుల పనితీరుకు అద్దం పడుతోంది. 22 గ్రామపంచాయతీలు వెనుకబడిపోవడం గమనార్హం. మిగతా మండలాల్లోనూ ఇదే పరిస్థితి ఉంది.
జిల్లాలో ఇంటి పన్ను వివరాలు
మొత్తం పంచాయతీలు : 473
పన్నుల డిమాండ్ : రూ.6,73,94,906
వసూలు చేసింది : రూ.6,09,48,138
శాతం : 90.43
ఇంకా మిగిలింది : రూ.66,46,768
మండలం పంచాయతీలు వందశాతం
వసూలు
చేసినవి
ఆదిలాబాద్ 31 15
బజార్‌హత్నూర్ 31 17
బేల 31 14
భీంపూర్ 26 18
బోథ్ 21 7
భోరజ్ 17 9
గుడిహత్నూర్ 26 19
ఇచ్చోడ 33 12
జైనథ్ 17 16
మావల 3 1
నేరడిగొండ 32 11
సాత్నాల 17 11
సిరికొండ 18 7
సొనాల 12 3
తలమడుగు 29 7
తాంసి 14 8
గాదిగూడ 25 20
ఇంద్రవెల్లి 29 16
నార్నూర్ 23 20
ఉట్నూర్ 38 12