
‘రెవెన్యూ’పై అనాసక్తి!
● ‘జీపీవో’కు ముగిసిన ఆప్షన్ గడువు ● పూర్వ వీఆర్‌వో, వీఆర్‌ఏల వెనుకడుగు ● 292 మందికి 86 మంది మాత్రమే సానుకూలం
కైలాస్‌నగర్: గ్రామాల్లో రెవెన్యూ అధికారుల పా లనను మళ్లీ అందుబాటులోకి తీసుకురావాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలి సిందే. గతంలో కొనసాగిన వీఆర్‌వో, వీఆర్‌ఏ పోస్టులకు బదులు గ్రామ పాలన అధికారి (జీపీవో) పేరిట ప్రతి రెవెన్యూ గ్రామానికో పోస్టు భర్తీ చేయాలని నిర్ణయించింది. ఈ లెక్కన జిల్లాలో 508 పోస్టులు భర్తీకి అవకాశముంది. అయితే గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఇతర శాఖల్లో సర్దుబాటు చేసిన పూర్వ వీఆర్‌వో, వీఆర్‌ఏలకు తిరిగి మాతృశాఖకు వచ్చే అవకాశాన్ని ప్రస్తుత ప్రభుత్వం కల్పించింది. ఆసక్తి కలిగిన వారు వెబ్ ఆప్షన్లు ఇవ్వాలని ఇప్పటికే ఓ మారు పేర్కొంది. తాజాగా మరోసారి ఇచ్చిన గడువు బుధవారంతో ముగిసింది. అయితే జిల్లాలో వెబ్ ఆప్షన్ ఇచ్చిన వారి సంఖ్యను పరిశీలిస్తే రెవెన్యూశాఖకు వచ్చేందుకు మెజార్టీ పూర్వ వీఆర్‌వో, వీఆర్‌ఏలు ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది.
● గతంలో 105 మంది వీఆర్‌వోలు ఇతర శాఖ ల్లో సర్దుబాటు కాగా వారిలో 88 మంది రెవెన్యూకు వచ్చేలా తొలుత ఆప్షన్ ఇచ్చారు. రెండోసారి మాత్రం ఇందులో కేవలం 41 మంది మాత్రమే సానుకూలత వ్యక్తం చేశారు.
● వీఆర్‌ఏలు 187మంది ఇతర శాఖల్లో సర్దుబా టు కాగా అందులో గతంలో 120 మంది ఆప్ష న్ ఇచ్చారు. ప్రస్తుతం 45 మంది మాత్రమే రెవెన్యూకు వచ్చేందుకు ఆసక్తి చూపారు.
అయితే జీపీవోగా చేరే వీఆర్వో, వీఆర్‌ఏలకు పాత సర్వీస్‌ను పరిగణలోకి తీసుకోకపోవడమే వారు వెనుకడుగుకు ప్రధాన కారణంగా తెలు స్తోంది. చాలామంది ఏళ్లుగా పనిచేస్తున్న వారు కొత్త పోస్టులోకి వెళితే సర్వీస్ కోల్పోయి పదోన్నతుల పరంగా నష్టపోయే అవకాశముందనే భావనతో వారు రెవెన్యూకు తిరిగి వచ్చేందుకు ఆసక్తి చూపడం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతుంది.