
ఇసుక డంప్ స్వాధీనం
ఆదిలాబాద్‌టౌన్(జైనథ్): జిల్లా అధికారుల ఆదేశాలతో జైనథ్ మండలంలోని పెన్‌గంగా పరీవాహక గ్రామాలపై మండల స్థాయి అధికారులు అప్రమత్తమై ఇసుక అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపుతున్నారు. ఇందులో భాగంగానే తమకు అందిన సమాచారం మేరకు శనివారం ఎస్సై పురుషోత్తం, తహసీల్దార్ నారాయణ, ఆర్‌ఐ ఉల్లాస్ సాంగ్వి, కౌట గ్రామాల మధ్య ఉన్న ఇసుక డంప్‌ను సీజ్ చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ సుమారు 10 ట్రాక్టర్ల ఇసుకను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. ఇసుక విలువ రూ.20వేల వరకు ఉంటుందన్నారు. ఈ విషయాన్ని ఉన్నత స్థాయి అధికారుల దృష్టికి తీసుకెళ్లి చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు.