
ఎండింది.. మళ్లీ నిండింది!
● ఫలించిన భగీరథ యత్నం ● పూడికతీతకు బల్దియా శ్రీకారం ● ఉబికి వస్తున్న ‘లాండసాంగ్వి’ ● ‘ఇంటెక్’లో పెరిగిన సామర్థ్యం ● పట్టణానికి తప్పిన నీటి ఎద్దడి ముప్పు
కై లాస్‌నగర్: ఆదిలాబాద్ పట్టణానికి నీటిని సరఫరా చేసే లాండసాంగ్వి పంప్‌హౌస్ వద్ద బల్దియా అధికారులు చేపట్టిన భగీరథ యత్నం ఫలించింది. అక్కడ నీటి నిల్వ పెంచేందుకు మూడు రోజులుగా చేపట్టిన చర్యలు సఫలీకృతమయ్యాయి. పూడిక తొలగించడం, కాల్వలను తవ్వడంతో పట్టణానికి నీటి సరఫరా చేసే ఇంటెక్‌వెల్స్ వద్ద భూగర్భజలం ఉబికి వస్తోంది. దీంతో ఈ వేసవిలో పట్టణానికి నీటి ఎద్దడి ముప్పు తప్పింది. ఈనెల 30నుంచి పంప్‌హౌస్ ద్వారా పట్టణంలోని పలు వార్డులకు యథావిధిగా నీటి సరఫరా చేపట్టనున్నారు.
19 వార్డులకు ఇక్కడి నుంచే..
ఆదిలాబాద్ మున్సిపల్ పరిధిలోని 19 వార్డులకు ఆదిలాబాద్‌రూరల్ మండలంలోని లాండసాంగ్వి వాగు వద్ద గల పంప్‌హౌస్ నుంచే నీటి సరఫరా జరుగుతోంది. నాలుగు దశాబ్దాల నుంచి ప్రజల కు ఇక్కడి నుంచే నీటిని అందిస్తున్నారు. అయితే గతంలో ఎన్నడులేని విధంగా లాండసాంగ్వి వా గు పూర్తిగా ఎండిపోయింది. దీంతో పట్టణానికి నీ టి సరఫరా నిలిచిపోయింది. మిషన్ భగీరథ నీటిపైనే ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే మే మొదటి వారం వరకు ‘భగీరథ’ నీరు సైతం వచ్చే పరిస్థితి లేకపోవడంతో పట్టణంలో ఈ వేసవిలో తీవ్ర నీటి ఎద్దడి తప్పదనే అభిప్రాయం వ్యక్తమైంది. ఈ పరిస్థితిని దూరం చేయాలనే ఉద్దేశంతో బల్దియా అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. కలెక్టర్ రాజర్షిషా, ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఆదేశాల మేరకు పట్టణానికి నీటిని అందించే దిశగా చర్యలకు ఉపక్రమించారు. పంప్‌హౌస్ వద్ద గల రెండు పురాతన ఇంటెక్‌వెల్స్‌లో భారీగా పూడిక పేరుకుపోయింది. ఏళ్ల తరబడి వాటిని శుభ్రం చేయకపోవడంతో పైపులకు నీరు వచ్చే అవకాశం లేకుండా పోయింది. దీన్ని గుర్తించిన బల్దియా అధికారులు వాటిలో పూడికతీతకు నిర్ణయించారు. ఆంధ్ర ప్రదేశ్‌లోని కడపకు చెందిన పలువురు నిపుణులను రప్పించి వారం పాటు ఇంటెక్‌వెల్స్‌ను పూర్తిగా తెరిచి అందులోని పూడిక, ఇసుక మేటలను తొలగింపజేశారు.
యంత్రాంగం ప్రత్యేక దృష్టి
పట్టణానికి నీటిని అందించే కీలక వనరు కావడంతో దీనిపై జిల్లా యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించింది. వేసవి నీటి ఎద్దడి కార్యాచరణలో భాగంగా రూ.40లక్షలను కలెక్టర్ మంజూరు చేశారు. ఈ నిధుల ద్వారా లాండసాంగ్వి వాగులోని ఇంటెక్‌వెల్స్ వద్ద బల్దియా అధికారులు భూగర్భజలాలు పెంపొందించే చర్యలు చేపట్టారు. రెండు బావులకు ఇరువైపులా 15 అడుగుల లోతు, 132 మీటర్ల వెడల్పుతో భారీ కెనాల్స్ తవ్వారు. ఈ ప్రయత్నం ఫలించింది. భూగర్భ జలాలు ఉబికివచ్చి వర్షాకాలంలో ఎలాగైతే వాగులో నీరు నిల్వ ఉంటుందో అదే స్థాయిలోకి చేరాయి. నాలుగు రోజులుగా ఈ తవ్వకాలు చేపడుతున్నారు. ఈనెల 29 వరకు ఈ పనులను చేపట్టనున్నారు. పెరిగిన నీటి సామర్థ్యం ఆధారంగా లాండసాంగ్వి పంప్‌హౌస్‌లోని రెండు మోటార్లు 24గంటల పాటు పనిచేసినా నీరు అడుగంటదని బల్దియా ఇంజినీర్ పేరి రాజు తెలిపారు. దీంతో పట్టణంలోని 19 వార్డులకు పంప్‌హౌస్ ద్వారా యథావిధిగా నీటి సరఫరాను ఈనెల 30 నుంచి ప్రారంభిస్తామన్నారు. ప్రస్తుతం పెరిగిన భూగర్భ జలాల ప్రకారం జూలై వరకు పట్టణానికి తాగునీటికి ఎలాంటి ఇబ్బంది ఉండదని ఆయన పేర్కొన్నారు. బల్దియా అధికారులు చేపట్టిన చర్యలతో పట్టణంలోని సగం వార్డులకు నీటి సమస్య దూరమైంది. దీంతో ఆయా కాలనీవాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఎండింది.. మళ్లీ నిండింది!