
పెళ్లి నుంచి వస్తూ తిరిగిరాని లోకాలకు..
జన్నారం: బంధువుల పెళ్లికి వెళ్లి తిరిగి వస్తున్న ఫిజియో థెరఫిస్టును రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు కబలించింది. ఎస్సై రాజవర్దన్ గురువారం తెలిపిన వివరాల ప్రకారం గుడిహత్నూర్‌కు చెందిన ఉరిమెత జంగుబాబు (30) జన్నారం మండల కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ఫిజియో థెరఫిస్టుగా పని చేస్తున్నాడు. గురువారం బంధువుల పెళ్లికి కలమడుగుకు వెళ్లాడు. సాయంత్రం తిరిగి వస్తున్న క్రమంలో కొమ్ముగూడెం వద్ద ఎదురుగా వస్తున్న స్కూటీని ఢీకొట్టి ఎగిరిపడ్డాడు. జంగుబాబు అక్కడికక్కడే మృతి చెందగా స్కూటిపై ఉన్న ఇందన్‌పల్లి గ్రామానికి చెందిన వంశీ తీవ్ర గాయాలపాలయ్యాడు. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వగా ఎస్సై అక్కడకు చేరుకు ని వంశీని జన్నారం ఆసుపత్రికి తరలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం లక్షేట్టిపేటకు తరలించినట్లు ఎస్సై తెలిపారు.