‘గ్రాండ్’తో గందరగోళం..!
● నేటి నుంచి టెన్త్ విద్యార్థులకు గ్రాండ్ టెస్ట్‌లు
● ఈ నెల 17 నుంచి వార్షిక పరీక్షలు
విశాఖ విద్య: పదో తరగతి వార్షిక పరీక్షలకు ముందు గ్రాండ్ టెస్ట్‌ల పేరుతో పాఠశాలల్లో చేస్తోన్న హడావుడి విద్యార్థులను గందరగోళానికి గురిచేస్తోంది. సోమవారం నుంచి ఈ నెల 13 వరకు టెన్త్ విద్యార్థులకు గ్రాండ్ టెస్ట్‌లు నిర్వహించేలా పాఠశాల విద్యాశాఖ ఉన్నతాధికారులు షెడ్యూల్ జారీ చేశారు. ఈ నెల 17 నుంచి వార్షిక పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఇటీవలనే ప్రీ ఫైనల్ పరీక్షలు ముగిశాయి. అందులో విద్యార్థుల ప్రోగ్రస్‌పై స్కూళ్లలో ఎటువంటి సమీక్ష లేదు. ఇంతలోనే గ్రాండ్ టెస్ట్‌లు పెట్టాలని ఉన్నతాధికారులు ఆదేశాలివ్వటం విద్యార్థులను టెన్షన్‌కు గురిచేసినట్లేనని ఉపాధ్యాయులు అంటున్నారు.
ప్రిపరేషన్‌కు సమయమేదీ?
సమ్మెటివ్–1, సమ్మెటివ్–2లో సాధించిన మార్కులను ప్రాతిపకదికగా తీసుకుని ఏ సబ్జెక్టులో విద్యార్థులు వెనుకబడ్డారనేది గుర్తించి, అందుకనుగుణంగా వారిని వార్షిక పరీక్షలకు సన్నద్ధం చేయాల్సి ఉంది. కానీ సోమవారం నుంచి రోజుకో సబ్జెక్టు చొప్పున ఈ నెల 13 వరకు గ్రాండ్ టెస్ట్‌లను విద్యార్థులు రాయాల్సి ఉంది. దీంతో వెనుకబడిన సబ్జెక్టు ప్రిపరేషన్‌కు సమయం లేకుండా పోతుందని, ఇది విద్యార్థుల వార్షిక పరీక్షలపై ప్రభావం చూపే అవకాశం ఉందని టీచర్లు ఆక్షేపిస్తున్నారు.
టెన్షన్లో విద్యార్థులు
వార్షిక పరీక్షల మాదిరే, ప్రశ్నా పత్రాలను కట్టుదిట్టమైన భద్రత నడుమ ఏ రోజుకారోజు వాటిని విద్యార్థులకు అందించి, గ్రాండ్ టెస్ట్‌లను నిర్వహించాలని అధికారులు సూచించారు. ఇందుకోసం మండల స్థాయిలో త్రీమెన్ కమిటీలను ఏర్పాటు చేశారు. గ్రాండ్ టెస్ట్ షెడ్యూల్‌లో భాగంగా ఈ నెల 13న సోషల్ స్టడీస్ పరీక్ష రాయాల్సి ఉంది. దానికి హాజరైన విద్యార్థి మూడు రోజుల వ్యవధిలో(17న) వార్షిక పరీక్షలకు సిద్ధం కావాలి. వార్షిక పరీక్షల ముందు టెన్త్ విద్యార్థులను టెన్షన్‌కు గురిచేసేలా కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment