
ప్రతి ఇంటి నుంచి చెత్తను సేకరించాలి
● రంపచోడవరం డివిజనల్ పంచాయతీ అధికారి నరసింగరావు
అడ్డతీగల: ప్రతి ఇంటి నుంచి చెత్తను సేకరించి సంపద కేంద్రానికి తరలించాలని రంపచోడవరం డివిజనల్ పంచాయతీ అధికారి నరసింగరావు అన్నారు. స్థానిక డొక్కపాలెం జంక్షన్‌లోని సంపద కేంద్రం వద్ద సోమవారం శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఇళ్లు,వీధుల్లో సేకరించిన తడి,పొడి చెత్తను వేరుచేసి సంపద కేంద్రానికి తరలించాలని ఆదేశించారు.ప్రతి పంచాయతీలో ఉన్న సంపద కేంద్రాన్ని వినియోగంలోకి తీసుకురావాలన్నారు. పంచాయతీ కార్యదర్శులు, సర్పంచ్‌లు ఈ కార్యక్రమాలను నిత్యం పర్యవేక్షించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో అడ్డతీగల, వై.రామవరం, రాజవొమ్మంగి మండలాల్లోని పంచాయతీ కార్యదర్శులు,హరిత రాయబారులు పాల్గొన్నారు.