
బస్‌షెల్టర్ నిర్మాణానికి చర్యలు
రాజవొమ్మంగి: మండల కేంద్రంలోని బస్‌షెల్టర్ నిర్మాణానికి గ్రామస్తులు ముందుకొచ్చారు. బస్‌షెల్టర్ లేక ప్రయాణికులు పడుతున్న ఇబ్బందులపై ‘సాక్షి’లో ‘ప్రయాణికులకు తప్పని పాట్లు’ శీర్షికతో వార్త ప్రచురితమైంది. దీనిపై స్పందించిన అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, అఖిలపక్ష నాయకులు యుద్ద ప్రాతిపదికన బస్ షెల్టర్ నిర్మాణం కోసం, టాయ్‌లెట్లు ఏర్పాటుకు చేయి చేయి కలిపారు. స్థానిక సీఐ సన్యాసినాయుడు అధ్యక్షతన శుక్రవారం అత్యవసర సమావేశం జరిగింది. సమావేశంలో పోలీసుస్టేషన్ ఎదురుగా అభయాంజనేయ స్వామి ఆలయ పునర్నిర్మాణం, బస్‌షెల్టర్ ఏర్పాటుపై చర్చించారు. జాతీయ రహదారి కాంట్రాక్టర్, స్థానిక వ్యాపారులు, నాయకుల సహాయ సహకారాలతో వీటిని వెంటనే నిర్మించేందుకు ముందుకు వచ్చారు. జాతీయ రహదారి నిర్మాణపనుల్లో భాగంగా ఆంజనేయస్వామి ఆలయాన్ని సగానికి పైగా తొలగించిన సంగతి తెలిసిందే. దీంతో ఈ ఆలయాన్ని పునర్నిర్మాణానికి భక్తులు ముందుకు వచ్చారు. ఈ ఆలయప్రాంగణంలోనే బస్‌షెల్టర్ కూడా నిర్మిస్తున్నట్టు ప్రకచించారు. ఇప్పటికే ఆలయానికి దాదాపు రూ. 1.30 లక్షల విరాళం సమకూరిందని, ఈ సొమ్ముతో పాటు వ్యాపారులు చందాలు వేసి ఆలయాన్ని నిర్మించేందుకు కంకణం కట్టుకొన్నారు. అదే విధంగా రహదారికి పక్కన ఉన్న ఖాళీ స్థలంలో టాయ్‌లెట్లు నిర్మించేందుకు స్థానిక వైఎస్సార్‌సీపీ నాయుకుడు చింతలపూడి వెంకట రమణ ముందుకు రావడంతో సర్వత్రా హర్షం వ్యక్తం చేశారు. విరాళం అందజేస్తున్న వెంకటరమణను సీఐ సహ అందరు శాలువా కప్పి ఘనంగా సత్కరించారు. ఈ నేపథ్యంలో టాయ్‌లెట్ల నిర్మాణాన్ని వెంటనే ప్రారంభిస్తానని వెంకటరమణ ప్రకటించారు. రాజవొమ్మంగిలో ప్రయాణికుల కష్టాలు త్వరలోనే తీరనున్నాయని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. సీఐ సన్యాసినాయుడు, ఎస్‌ఐ నరసింహామూర్తి, స్షెషల్ బ్రాంచ్ హెచ్‌సీ దుర్గారావు, సర్పంచ్ రమణి, ఎంపీటీసీ సభ్యుడు గొల్లపూడి పెద్దిరాజు, వ్యాపారులు, మీడియా సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

బస్‌షెల్టర్ నిర్మాణానికి చర్యలు