
న్యాయం కావాలి
● పెట్రోల్ బాటిల్‌తో సెల్ టవర్ ఎక్కిన ‘రెవెన్యూ’ బాధితుడు ● అన్యాయంగా తన స్థలం వేరొకరి పేరుతో రిజిస్టర్ చేశారని ఆవేదన ● పదేళ్లుగా తిరుగుతున్నా పట్టించుకోలేదని ఆరోపణ ● రెవెన్యూ అధికారుల హామీతో శాంతించిన శంకర్రావు
అచ్యుతాపురం రూరల్: కొంతమంది ప్రభుత్వ అధికారుల స్వార్థం వల్ల ఎన్నో నిండు జీవితాలు రోడ్డున పడుతున్నాయని లంక ధర్మవరం గ్రామానికి చెందిన లంక హరినాగ శంకర్రావు ఆవేదన చెందాడు. తరతరాలుగా అదే ఇంట్లో ఉంటూ.. తమ పొలాల్లో సాగు చేసుకుంటూ జీవనం గడిపే సమయంలో ఒక్కసారిగా.. ఇది మీ భూమి కాదు, మీరు నివసిస్తున్న ఇంట్లో నుంచి వెళ్లిపోవాలి.. అనడంతో తనకు ఏమి చేయాలో దిక్కుతోచని స్థితి నెలకొందని శంకర్రావు వాపోయాడు. తన స్థలం మరొకరి పేరిట రిజిస్టర్ చేశారు, న్యాయం చేయమని పది సంవత్సరాలుగా నాయకులు, అధికారుల వద్దకు తిరిగి అలసి విసుగు చెంది తనకు న్యాయం జరగదని భావించిన శంకర్రావు గురువారం ఉదయం అచ్యుతాపురం తహసీల్దార్ కార్యాలయం ఎదురుగా ఉన్న బీఎస్‌ఎన్‌ఎల్ టవర్ పైకి ఎక్కి నిరసన తెలియజేశాడు. తనతోపాటు పెట్రోల్ బాటిల్, లైటర్ తీసుకువెళ్లి కాల్చుకొని మరణిస్తానని బెదిరించాడు. మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో డిప్యూటీ తహసీల్దార్ శ్యామ్ ఫోన్ చేసి మాట్లాడగా అధికారులు ఇచ్చిన హామీ మేరకు సెల్‌ఫోన్ టవర్ దిగాడు. అనంతరం తహసీల్దార్ లంక ధర్మవరం గ్రామానికి చేరుకుని తగాదాల్లో ఉన్న భూములపై విచారణ చేపట్టారు. భూ రికార్డులు తారుమారు చేసిన అప్పటి తహసీల్దార్‌పై విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని సీపీఎం మండల కన్వీనర్ రొంగలి రాము డిమాండ్ చేశారు. ఇటువంటి అనేక భూ సమస్యలు మండలంలో కోకొల్లలుగా ఉన్నా అధికారులెవరూ పట్టించుకోవట్లేదన్నారు.

న్యాయం కావాలి