
గిరిజన దర్బార్ ఏర్పాటు చేయాలని బైక్ ర్యాలీ
రావికమతం: గిరిజన సమస్యలపై నర్సీపట్నం కేంద్రంగా ప్రత్యేక గిరిజన దర్బార్ ఏర్పాటు చేయాలని కోరుతూ రావికమతం మండలం గిరిజనులు జెడ్.బెన్నవరం నుంచి అజేయపురం వరకు ఆదివారం బైక్ ర్యాలీ నిర్వహించారు. ముందుగా కల్యాణపులోవ గ్రామంలో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. భారత రాజ్యాంగంలో గిరిజనుల రక్షణకు అనేక చట్టాలు రూపొందించారన్నారు. వీటిని నాన్ షెడ్యూల్ గిరిజన గ్రామాలకు పాలకులు వర్తింపజేయడం లేదని విమర్శించారు. ప్రభుత్వం భూ సమస్యపై ప్రత్యేక గిరిజన దర్బార్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో 5వ షెడ్యూల్ సాధన కమిటీ జిల్లా గౌరవాధ్యక్షుడు కే గోవిందరావు, పీవీటీజీ గిరిజన సంఘం నాయకులు గేమిల వాసు, గేమిల రాజు తదితరులు పాల్గొన్నారు.