పక్కా ఉపాధికి పాలిటెక్నిక్‌ | - | Sakshi
Sakshi News home page

పక్కా ఉపాధికి పాలిటెక్నిక్‌

Published Wed, Apr 16 2025 11:02 AM | Last Updated on Wed, Apr 16 2025 11:02 AM

పక్కా

పక్కా ఉపాధికి పాలిటెక్నిక్‌

‘పది’తోనే ఇంజినీరింగ్‌ కోర్సుల్లో ప్రవేశం

ఉమ్మడి విశాఖలో 8 ప్రభుత్వ కళాశాలలు

17వ తేదీ వరకు దరఖాస్తు గడువు పొడిగింపు

మురళీనగర్‌(విశాఖ): పదో తరగతి పూర్తి చేసిన విద్యార్థులు ఇంజినీరింగ్‌ కోర్సుల్లో ప్రవేశించడానికి పాలిటెక్నిక్‌ ఒక ముఖ్యమైన మార్గం. విద్యార్థులు మూడు లేదా మూడున్నరేళ్లలో డిప్లమో స్థాయి కోర్సులను పూర్తి చేసి, వివిధ ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు, కంపెనీల్లో సూపర్‌వైజర్‌ స్థాయి ఉద్యోగాలు పొందవచ్చు. అంతే కాకుండా ఇంజినీరింగ్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ (ఈసెట్‌) ద్వారా నేరుగా బీటెక్‌ సెకండియర్‌లో ప్రవేశించవచ్చు. డిప్లమో స్థాయిలో పొందిన ప్రాక్టికల్‌ నైపుణ్యాలతో సొంతంగా ఒక పరిశ్రమను స్థాపించి, 10 మందికి ఉపాధి కల్పించవచ్చు. విశాఖ ఉమ్మడి జిల్లాలో మొత్తం 8 ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలలు ఉన్నాయి. కంచరపాలెంలో ప్రభుత్వ కెమికల్‌ ఇంజినీరింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌ (గైస్‌), ప్రభుత్వ పాలిటెక్నిక్‌, పెందుర్తిలో ప్రభుత్వ పాలిటెక్నిక్‌, భీమిలిలో మహిళా పాలిటెక్నిక్‌, నర్సీపట్నం, అనకాపల్లి, చోడవరంలో పాలిటెక్నిక్‌ కళాశాలలు, పాడేరులో ప్రభుత్వ మోడల్‌ రెసిడెన్షియల్‌ పాలిటెక్నిక్‌ కళాశాలలు ఉన్నాయి. వీటితో పాటు 19 ప్రైవేట్‌ పాలిటెక్నిక్‌ కళాశాలలు ఉన్నాయి.

అందుబాటులో ఉన్న బ్రాంచ్‌లు

పాలిటెక్నిక్‌లో 36 కంటే ఎక్కువ బ్రాంచ్‌లు ఉన్నాయి. వాటిలో కెమికల్‌ ఇంజినీరింగ్‌, సివిల్‌, మెకానికల్‌, ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌ ఇంజినీరింగ్‌, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ ఇంజినీరింగ్‌, కంప్యూటర్‌ సైన్స్‌, మెటలర్జీ వంటివి ముఖ్యమైన బ్రాంచ్‌లుగా చెప్పవచ్చు. ప్రతి బ్రాంచ్‌లో 60 సీట్లు ఉన్నాయి. ఇవన్నీ మంచి డిమాండ్‌ ఉన్న కోర్సులే. కంచరపాలెం ప్రభుత్వ పాలిటెక్నిక్‌లో మెకానికల్‌ మూడు సెక్షన్లు, ఈఈఈ రెండు సెక్షన్లు, సివిల్‌ రెండు సెక్షన్లు, మెటలర్జీ ఒక సెక్షన్‌ ఉన్నాయి. మెటలర్జీ కోర్సు కంచరపాలెం, విజయనగరం, విజయవాడ ప్రభుత్వ కళాశాలల్లో అందుబాటులో ఉంది. నర్సీపట్నంలో మైనింగ్‌ కోర్సు ఉంది. కంచరపాలెం పాలిటెక్నిక్‌, కెమికల్‌ ఇంజినీరింగ్‌, అనకాపల్లి కళాశాలలు ఎన్‌బీఏ గుర్తింపు పొందాయి.

17 వరకు దరఖాస్తు గడువు పొడిగింపు

పాలిసెట్‌ దరఖాస్తు గడువును పొడిగిస్తూ రాష్ట్ర సాంకేతిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. వాస్తవానికి పాలిసెట్‌ దరఖాస్తుకు మంగళవారంతో గడువు ముగిసింది. తల్లిదండ్రులు, విద్యార్థుల వినతి మేరకు ఈ నెల 17వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తుకు గడువు పొడిగించారు. కాగా.. ఈ నెల 30న ఉదయం 11 నుంచి 1 గంట వరకు ప్రవేశ పరీక్ష జరగనుంది.

కెమికల్‌ ఇంజినీరింగ్‌లో విస్తృత అవకాశాలు

రాష్ట్రంలో నాలుగు కెమికల్‌ ఇంజినీరింగ్‌ బ్రాంచ్‌లు ఉన్న ఏకై క కాలేజీ మాదే. ఇక్కడ చదువుతున్న విద్యార్థులు శతశాతం ఉద్యోగాలు పొందుతున్నారు. 2024–25లో 171 మందికి ఉద్యోగాలు లభించాయి. వీరికి ఇటీవల జాబ్‌ అచీవర్స్‌ డే నిర్వహించి నియామక పత్రాలు అందించాం. బాలికలు అత్యధిక వార్షిక ప్యాకేజీతో ఉద్యోగాలు సాధిస్తున్నారు. బాలికలకు కాలేజీ ప్రాంగణంలోనే అన్ని సదుపాయాలతో వసతి గృహం నిర్వహిస్తున్నాం.

– డాక్టర్‌ కె.వెంకటరమణ, ప్రిన్సిపాల్‌, గైస్‌,

కంచరపాలెం

ఉజ్వల భవిష్యత్‌

పాలిటెక్నిక్‌తో ఉజ్వల భవిష్యత్‌ ఉంటుంది. ఈ కోర్సులు చదివిన విద్యార్థులకు ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తక్షణం ఉపాధి పొంది జీవితంలో స్థిరపడవచ్చు. 2024–25 సంవత్సరానికి 500 మందికి పైగా మంచి వార్షిక ప్యాకేజీతో ఉద్యోగాలు పొందారు. ముగ్గురు ఎలక్ట్రికల్‌ విభాగం విద్యార్థులు రూ.9.02 లక్షల అత్యధిక వార్షిక ప్యాకేజీతో ఉద్యోగాలు సాధించి రికార్డు సృష్టించారు. హాస్టల్‌ సదుపాయం ఉంది. మంచి ర్యాంకులు సాధిస్తే ప్రభుత్వ కాలేజీల్లో సీట్లు పొందవచ్చు. పాలిసెట్‌కు ఉచిత కోచింగ్‌ ఇస్తున్నాం.

– డాక్టర్‌ కె.నారాయణరావు, ప్రిన్సిపాల్‌,

కంచరపాలెం పాలిటెక్నిక్‌

పారిశ్రామిక శిక్షణ

డిప్లమో విద్యలో భాగంగా క్షేత్ర పరిశీలన, ప్రయోగాత్మక అనుభవం కోసం ఆరు నెలల పాటు పారిశ్రామిక శిక్షణ ఉంటుంది. ఈ శిక్షణ సమయంలో కంపెనీలు నెలకు రూ. 3 వేల నుంచి రూ. 5 వేల వరకు స్టైఫండ్‌ను అందిస్తాయి. కెమికల్‌ ఇంజినీరింగ్‌, మెటలర్జీ వంటి శాండ్‌విచ్‌ కోర్సులు (మూడున్నరేళ్ల కాలవ్యవధి) అభ్యసిస్తున్న విద్యార్థులకు ఏడాది పాటు రెండు విడతలుగా పారిశ్రామిక శిక్షణ ఉంటుంది. వీరికి బోర్డ్‌ ఆఫ్‌ అప్రెంటిస్‌షిప్‌ అండ్‌ ట్రైనింగ్‌ నెలకు రూ.7వేలు ఉపకార వేతనం అందిస్తుంది.

పక్కా ఉపాధికి పాలిటెక్నిక్‌ 1
1/5

పక్కా ఉపాధికి పాలిటెక్నిక్‌

పక్కా ఉపాధికి పాలిటెక్నిక్‌ 2
2/5

పక్కా ఉపాధికి పాలిటెక్నిక్‌

పక్కా ఉపాధికి పాలిటెక్నిక్‌ 3
3/5

పక్కా ఉపాధికి పాలిటెక్నిక్‌

పక్కా ఉపాధికి పాలిటెక్నిక్‌ 4
4/5

పక్కా ఉపాధికి పాలిటెక్నిక్‌

పక్కా ఉపాధికి పాలిటెక్నిక్‌ 5
5/5

పక్కా ఉపాధికి పాలిటెక్నిక్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement