
సీబీఐ, ఈడీలు బీజేపీ జేబు సంస్థలా?
డాబాగార్డెన్స్: దేశ రాజధాని ఢిల్లీ నడిబొడ్డున ఓ జడ్జి ఇంట్లో రూ.500 కోట్ల నల్లధనం దొరికితే చిన్న కేసు కూడా పెట్టలేని ప్రధాని మోదీ, అమిత్‌షా ఏం చేస్తున్నారని మాజీ కేంద్ర మంత్రి చింతా మోహన్ ప్రశ్నించారు. విశాఖలో గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో చింతా మాట్లాడుతూ మాజీ సీఎం ఇంట్లో రూ.5 లక్షలు కనిపిస్తే పట్టుకుని, జడ్జి ఇంట్లో రూ.500 కోట్లు కనిపిస్తే ఈ రోజు దాకా కేసు ఎందుకు కట్టలేదని ప్రశ్నించారు. సీబీఐ, ఈడీలు బీజేపీ జేబు సంస్థల్లా వ్యవహరిస్తున్నాయని ఆరోపించారు. ఓ జడ్జిని కలిసేందుకు ఎవరు వెళ్లినా.. వాటర్ బాటిల్‌ను కూడా స్క్రీనింగ్ చేస్తారని.. అలాంటిది అంత డబ్బు జడ్జి ఇంట్లోకి ఎలా చేరిందన్నారు. దేశంలో ప్రజాస్వామ్యం, పత్రికా స్వేచ్ఛ కనుమరుగవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టులో వక్ఫ్ బోర్డు ఆస్తులపై వాదనలు విన్న తర్వాత, భారత రాజ్యాంగం అంటే ఏంటో కేంద్ర ప్రభుత్వానికి తెలియదనిపించిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే తిరిగి మామూలు వక్ఫ్ బోర్డు చట్టాన్ని తీసుకొస్తామన్నారు.
రాష్ట్రంలో వర్గీకరణ విషయానికొస్తే మాల, మాదిగల గూర్చి చంద్రబాబు చాలా బాధతో ఉపన్యాసం ఇచ్చారని, మైన్స్‌లో, ప్రభుత్వ కాంట్రాక్టుల్లో, పబ్లిక్ ప్రాసిక్యూటర్, అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పోస్టుల్లో కూడా వర్గీకరణ జరగాలని డిమాండ్ చేశారు. రాహుల్ గాంధీ, సోనియా గాంధీలపై ఈడీ కేసులు దారుణమని, దాన్ని ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు.
మీడియాతో మాజీ కేంద్ర మంత్రి చింతా మోహన్