
గుడివాడలో ఘనంగా బడ్డు సంబరం
సాక్షి, పాడేరు: పట్టణంలోని గుడివాడ గిరిజనులు కూడా పూర్వ సంప్రదాయ బడ్డుతాడు సంబరానికి శ్రీకారం చుట్టారు. ఇటుకల పండగలో భాగంగా ఆదివారం గుడివాడ శంకులమ్మతల్లి ఆలయం ఆవరణలో బడ్డుతాడు సంబరం వైభవంగా జరిగింది. ముందుగా గొడుగుల ఊరేగింపును పాడేరు పుర వీధుల్లో నిర్వహించారు. అనంతరం శంకులమ్మతల్లి ఆలయం వద్ద ఏర్పాటు చేసిన బడ్డుతాడుకు గ్రామ పెద్దలంతా పూజలు చేశారు. ఈ సందర్భంగా గిరిజన మహిళల థింసా నృత్యాలు, డప్పు వాయిద్యాలు హోరెత్తాయి. గుడివాడకు చెందిన ఆడపిల్లలు, బయట నుంచి వచ్చిన వదిన, మరదళ్లు పోటాపోటీగా బడ్డుతాడును లాగారు. ఈ పోటీలో ఊరి ఆడపిల్లలే తాడును లాగుకుపోయి విజయం సాధించారు. వదిన, మరదళ్లు వంటి మహిళలు ఓడిపోయారు. గ్రామంలో పశుసంపదతో పాటు అందరూ సంతోషంగా జీవించాలని, పంటలు బాగా పండాలని కాంక్షిస్తూ ఇటుకల పండగలో భాగంగా ఈ బడ్డుతాడు సంబరంను గిరిజనులు నిర్వహించడం ఆనవాయితీ. పాత పాడేరు, గుడివాడ గ్రామాల్లో మాత్రమే పూర్వం నుంచి బడ్డుతాడు సంబరం జరుగుతుంది. మధ్యలో కొన్నేళ్లు గుడివాడలో ఈ సంబరం జరగనప్పటికీ శంకులమ్మతల్లి ఆలయం నిర్మాణం తరువాత అన్ని కుటుంబాల గిరిజనులు బడ్డుతాడు సంబరాన్ని కొనసాగిస్తున్నాయి.

గుడివాడలో ఘనంగా బడ్డు సంబరం