
సూపర్ ఫిప్టీలో నూరుశాతం పాస్
సాక్షి,పాడేరు: పాడేరు ఐటీడీఏ పరిధిలోని వివిధ పాఠశాలల్లో బాగా చదివిన 50 మంది టెన్త్ విద్యార్థులకు రెండు పాఠశాలల్లో సూపర్ ఫిప్టీ పేరిట ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. ఈ శిక్షణ పొందిన విద్యార్థినీవిద్యార్థులు నూరుశాతం ఉత్తీర్ణత సాధించారు. చదువులో ప్రతిభ కనబరిచిన 28 మంది గిరిజన బాలికలకు గుత్తులపుట్టు గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలోను, 22మంది గిరిజన బాలురకు దిగుమోదాపుట్టు ఆశ్రమ పాఠశాలలోను సూపర్ ఫిప్టీ పేరుతో పాడేరు ఐటీడీఏ ప్రత్యేక శిక్షణ ఇచ్చింది. శిక్షణ పొందిన విద్యార్థులు గత ఏడాది వలే ఈసారి కూడా 50మందికి 50మంది ఉత్తీర్ణులయ్యారు.49 మంది ప్రథమ శ్రేణిలోను,ఒక్కరు ద్వితీయ శ్రేణిలోను పాస్ అయ్యారు. బాలికలు ప్రతిభ కనబరిచి మంచి మార్కులు సాధించారు. కొంటా భవానీ 577 మార్కులతో సూపర్ ఫిప్టీలో ప్రథమ స్థానంలో నిలిచింది. చంపా పావని 567, గబ్బాడ ఈశ్వరమ్మ 566, కిల్లో అరుణ 565, జనపరెడ్డి రేవతి 558, ఎస్.త్రినాథ్ 569, జి.మణికంఠ 550, జి.చరణ్ 535 మార్కులు సాధించారు.
కాలేజ్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌కు
34 మంది ఎంపిక
సూపర్ ఫిప్టీలో పాస్ అయిన 50 మంది విద్యార్థుల్లో 34 మంది కాలేజ్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌లో ఇంటర్ చదువుకు ఎంపికయ్యారని జేసీ, ఇన్‌చార్జి ఐటీడీఏ పీవో డాక్టర్ అభిషేక్‌గౌడ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. ప్రవేశ పరీక్షలో అర్హత సాధించిన 19 మంది బాలికలు మారికవలస, విసన్నపేట, 15 మంది బాలురు జోగంపేట కాలేజ్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌లో ప్రవేశాలు పొందుతారని ఆయన తెలిపారు. అలాగే సూపర్ 50లో ఉత్తమ ఫలితాల సాధనకు ఉత్తమ శిక్షణ కార్యక్రమాలు నిర్వహించిన గుత్తులపుట్టు హెచ్‌ఎం సింహాచల, ఇతర ఉపాధ్యాయులకు పీవో అభినందనలు తెలిపారు.