
నిర్వాసితులందరికీ ఆర్‌అండ్‌ఆర్ పరిహారం
కలెక్టర్ దినేష్‌కుమార్
చింతూరు: అర్హులైన ప్రతి ఒక్కరికీ ఆర్‌అండ్‌ఆర్ పరిహారం అందేలా చర్యలు చేపడుతున్నామని కలెక్టర్ దినేష్‌కుమార్ తెలిపారు. బుధవారం ఆయన చింతూరులో విలేకరులతో మాట్లాడుతూ పోలవరం ముంపులో భాగంగా ఫేజ్–1బిలో చేర్చిన 32 గ్రామాలకు సంబంధించి ఇప్పటివరకు 24 గ్రామాల్లో గ్రామసభలు పూర్తయ్యాయని మరో ఎనిమిది గ్రామాల్లో ఈ నెలాఖరుకల్లా గ్రామసభలు నిర్వహిస్తామని ఆయన తెలిపారు. డ్రాఫ్ట్ అవార్డు పూర్తయిన తరువాత 32 గ్రామాలకు చెందిన 13,790 కుటుంబాలకు పరిహారం అందించడంతో పాటు పునరావాస కేంద్రాలకు తరలిస్తామని ఆయన చెప్పారు. గ్రామాల్లో స్థానికత కలిగి ఉన్న వ్యాపారాలు, కూలిపనులు, విద్య నిమిత్తం ఇతర ప్రాంతాల్లో ఉంటున్నవారు అన్ని ధ్రువీకరణ పత్రాలు కలిగి ఉంటే వారికి కూడా పరిహారం అందచేస్తామని తెలిపారు. ఇతర ప్రాంతాల నుంచి కటాఫ్ తేదీకంటే ముందుగా వచ్చి స్థిరపడిన వారికి, ఉపాధి కోల్పోతున్న కుటుంబాలకు కూడా పరిహారం అందేలా చర్యలు చేపడుతున్నట్టు కలెక్టర్ తెలిపారు. మరో మూడు నెలల్లో నిర్వాసితులకు పునరావాసం కల్పించేలా ప్రణాళిక సిద్ధం చేస్తున్నామని, ముంపు గ్రామాల అర్హుల జాబితాలను ఎప్పటికప్పుడు ఆయా గ్రామ సచివాలయాల నోటీసుబోర్డుల్లో ఉంచుతామని ఆయన తెలిపారు. చింతూరులో ఇళ్ల పరిహారం విషయంపై వచ్చిన ఫిర్యాదులకు సంబంధించి సమగ్రమైన విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు. నిర్వాసితులకు రూ.10 లక్షలు ఇచ్చే విషయంపై గత ప్రభుత్వం జీవో జారీచేసిన విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లగా ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళతానన్నారు. ఈ కార్యక్రమంలో పోలవరం ప్రాజెక్ట్ అడ్మినిస్ట్రేటివ్ అధికారి అభిషేక్, ఐటీడీఏ పీవో అపూర్వభరత్ పాల్గొన్నారు.