
‘వికసిత అల్లూరి జిల్లా’ లక్ష్యంతో పనిచేయాలి
సాక్షి, పాడేరు: వికసిత అల్లూరి సీతారామరాజు జిల్లా లక్ష్యంతో అధికారులు పనిచేయాలని 20 సూత్రాల కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్ లంకా దినకర్ తెలిపారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా శుక్రవారం పాడేరు చేరుకుని కలెక్టరేట్‌లో పలుశాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలుచేస్తున్న సంక్షేమ పథకాలపై అరకు ఎంపీ డాక్టర్ గుమ్మా తనూజరాణి, జేసీఅభిషే క్‌గౌడ సమక్షంలో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధి హామీ పథకం కాంపోనెంట్ నిధులు, జల్‌జీవన్ మిషన్, గ్రామీణ సడక్ యోజన, లాక్‌పతి దీదీ, గరీబ్ కల్యాణ్ యోజన, పీఎం సూర్యఘర్, పీఎం ఆవాస్ యోజన, పీఎం విశ్వకర్మ యోజన, పీఎం జన్‌మన్, పీఎం స్వనిధి తదితర కేంద్ర ప్రాయోజిత పథకాలను సమర్థంగా అమలుజేయాలన్నారు. ఉపాధిహామీ వేతనం సగటున రూ.263 ఉందని, రూ.300కు పెంచేలా చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. 105 అమృత సరోవర్ పనులు సకాలంలో జరగడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. గ్రామీణ సడక్ యోజనలో రూ.180.86 కోట్ల అంచనా వ్యయంతో జిల్లాలో చేపడుతున్న పనులు త్వరితగతిన పూర్తిచేయాలని తెలిపారు. పీఎం ఆవాస్ యోజ నలో 17,111 గృహాలు, పీఎం జన్‌మన్‌లో 34,236 గృహాల నిర్మాణాలను వేగవంతం చేయాలని సూచించారు. స్వదేశి దర్శన్‌లో బొర్రాగుహలలో మౌలిక సదు పాయాల కల్పన, అభివృద్ధి పనులకు రూ.29.30 కోట్లు మంజూరయ్యాయని, అరకు–లంబసింగి టూరి జం అభివృద్ధికి రూ.50 కోట్లతో కేంద్రానికి ప్రతిపాదనలు పంపామని చెప్పారు. అరకు ఎంపీ డాక్టర్ తనూజరాణి మాట్లాడుతూ పెదబయలు మండలంలోని తారాబు జలపాతం అభివృద్ధికి రూ.4 కోట్ల ఎంపీలాడ్ నిధులు మంజూరైనట్టు తెలిపారు. ఈ సమావేశంలో అన్ని ప్రభుత్వశాఖల అధికారులు పాల్గొన్నారు.
బొర్రా గుహల అభివృద్ధికి
రూ.29.30 కోట్లు మంజూరు
అరకు–లంబసింగి టూరిజం అభివృద్ధికి రూ.50 కోట్లతో ప్రతిపాదనలు
20 సూత్రాల కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్ లంకా దినకర్