
నిర్వాసితులందరికీ న్యాయం చేస్తాం
ఐటీడీఏ పీవో అపూర్వభరత్
కూనవరం: పోలవరం నిర్వాసితులకు న్యాయం జరుగుతుందని చింతూరు ఐటీడీఏ పీవో అపూర్వభరత్ అన్నారు. మండల కేంద్రం కూనవరంలో నిర్వహించిన ఆర్‌అండ్‌ఆర్ గ్రామ సభను శనివారం ఆయన పర్యవేక్షించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ ప్రతి ఒక్క నిర్వాసితుడికి న్యాయం చేసేందుకు కృషి చేస్తున్నామన్నారు. కూనవరంలో మొత్తం 1,362 మంది పీడీఎఫ్‌లు ఉన్నారని వారిలో 1,183 మంది పీడీఎఫ్‌లను అర్హులుగా గుర్తించామని తెలిపారు. 179 మందిని అనర్హులుగా గుర్తించినట్టు చెప్పారు. అనర్హులు ఆధారాలతో దరఖాస్తులు చేసుకుంటే, వాటిని పరిశీలించి రెండవ గ్రామ సభనాటికి అర్హులుగా గుర్తించి వారికి న్యాయం చేస్తామని తెలిపారు. నిర్వాసితులు ఎవరూ మధ్యవర్తులను నమ్మి పోవద్దని సూచించారు. అభ్యంతరాలపై 15 రోజుల్లోగా దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఈసభలో 151 మంది దరఖాస్తు చేసుకున్నట్టు తహసీల్దార్ తెలిపారు. ఈకార్యక్రమంలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ వై.వెంకటేశ్వర్లు, ఎంపీపీ పాయం రంగమ్మ, జెడ్పీటీసీ గుజ్జా విజయ, సర్పంచ్ హేమంత్ గాంధీ, ఎంపీటీసీ కొమ్మాని అనంతలక్ష్మి, తహసీల్దారు కె.శ్రీనివాసరావు, ఎంపీడీవో రామాంజనేయ ప్రసాద్, కార్యదర్శి సురేష్ తదితరులు పాల్గొన్నారు.
వి.ఆర్.పురం: వడ్డుగూడెం చోప్పల్లి గ్రామంలో పోలవరం నిర్వాసితుల ఆర్‌అండ్‌ఆర్ గ్రామసభను శనివారం నిర్వహించారు. గ్రామ సభలో అర్హులు అనర్హులు జాబితాను అధికారులు చదివి వినిపించారు. అభ్యంతారాలు ఉన్న వారు జాబితాలో పేర్లు లేనివారు 15 రోజుల్లో పరిధిలో ఎస్‌డీసీ వారికి దరఖాస్తులు సమర్పించవచ్చన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న ఐటీడీఏ పీవో అపూర్వ భరత్ మాట్లాడుతూ ప్రతి ఒక్క నిర్వాసితునికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకొంటామన్నారు. ఈ గ్రామసభలో అనర్హులుగా ఉన్న వారి నుంచి దరఖాస్తులు తీసుకొని రెండో గ్రామ సభలో వాటిని పరిశీలిస్తామన్నారు. స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు, తహసీల్దార్లు, ఎంపీడీవోలు, రెవెన్యూ, పంచాయతీ రాజ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.