
ముమ్మరంగా పోలీసు తనిఖీలు
పాడేరు : పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఎస్పీ అమిత్‌బర్దర్ ఆదేశాల మేరకు శనివారం జిల్లా కేంద్రమైన పాడేరు పట్టణంలో సీఐ దీనబంధు ఆధ్వర్యంలో పోలీసులు ముమ్మరంగా తనిఖీలు నిర్వహించారు. పోలీసు జాగిలాలతో పట్టణంలోని ఆర్టీసీ కాంప్లెక్స్, పాత బస్టాండ్, సినిమాహాల్ సెంటర్, మోదకొండమ్మ ఆలయం, ఐటీడీఏ కార్యాలయం, ప్రభుత్వ జిల్లా ఆస్పత్రి తదితర ముఖ్య కూడళ్ల వద్ద తనిఖీలు నిర్వహించారు. డాగ్ స్క్వాడ్ సాయంతో ప్రయాణికుల బ్యాగులను క్షుణ్ణంగా పరిశీలించారు. వాహనాలను కూడా తనిఖీచేశారు. సీఐ దీనబంధు మాట్లాడుతూ గ్రామాల్లో ఎవరైనా కొత్త వ్యక్తులు అనుమానాస్పదంగా సంచరిస్తే తమకు సమాచారం ఇవ్వాలని సూచించారు. అనుమానిత వ్యక్తులకు ఆశ్రయం కల్పించవద్దని తెలిపారు.
అరకులోయ టౌన్: అరకులోయని పర్యాట ప్రాంతాల్లో శనివారం అరకు సీఐ హిమగిరి,ఎస్‌ఐ గోపాలరావు ఆధ్వర్యంలో ముమ్మరంగా తనిఖీలు నిర్వహించారు. పద్మాపురం గార్డెన్, ట్రైబల్ మ్యూజియం, కాఫీ మ్యూజియం, అరకు రైల్వే స్టేషన్,బస్ స్టేషన్‌లను బాంబు డిస్పోజల్,డాగ్ స్క్వాడ్‌తో సీఆర్‌పీఎఫ్,స్పెషల్ పార్టీ పోలీసులు క్షుణ్ణంగా తనిఖీలు చేశారు.ప్రయాణికుల వివరాలు సేకరించి, బ్యాగులు, లగేజీలు పరిశీలించారు. అనుమానాస్పదంగా ఎవరు తిరిగినా, బ్యాగులు,లగేజీలు ఉన్నా పోలీసులకు సమాచారం ఇవ్వాలని సీఐ హిమగిరి స్థానికులను కోరారు.
చింతూరు: కేంద్ర హోం మంత్రిత్వశాఖ హెచ్చరికల నేపథ్యంలో చింతూరు సీఐ దుర్గాప్రసాద్ ఆధ్వర్యంలో పోలీసులు శనివారం చింతూరులో విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. ఉగ్రదాడి జరగడంతో ఈ ప్రాంతంలో కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు చేపడుతున్నట్టు సీఐ తెలిపారు. ఈ సందర్భంగా చింతూరు బస్టాండ్‌తో పాటు పలు అనుమానాస్పద ప్రాంతాల్లో మెటల్ డిటెక్టర్లు, డాగ్‌స్క్వాడ్ సాయంతో తనిఖీలు చేపట్టారు.

ముమ్మరంగా పోలీసు తనిఖీలు