తహసీల్దార్ కార్యాలయంలో సర్వే అసిస్టెంట్‌తో రిటైర్డ్ వీఆర్వో సూర్యనారాయణ
అనకాపల్లి: తహసీల్దార్ కార్యాలయంలో రాత్రి సమయంలో రిటైర్డ్ వీఆర్వో కనిపించడం మండలంలో చర్చనీయాంశంగా మారింది. రాత్రి వేళలో ఆయనకు ఏం పనంటూ పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మండలంలోని బయ్యవరం గ్రామానికి చెందిన లాలం సూర్యనారాయణ గతంలో వీఆర్వోగా పనిచేసి రిటైరయ్యారు. ఈయన శనివారం రాత్రి 10 గంటల అనంతరం గిడుతూరు సచివాలయ సర్వే అసిస్టెంట్ శ్రీనుతో కలిసి తహసీల్దార్ కార్యాలయంలో కనిపించారు. రెవెన్యూ రికార్డులకు సంబంధించిన విషయాలపై మాట్లాడుతుంగా తీసిన ఫొటోలు, వీడియో ఆదివారం సోషల్ మీడియాతోపాటు వివిధ వాట్సప్ గ్రూపుల్లో వైరల్ అయ్యాయి.
దీంతో శనివారం మొహర్రం సందర్భంగా కార్యాలయానికి సెలవు కావడం, పైగా రాత్రివేళ కార్యాలయంలో కనిపించడంపై పలు విమర్శలు వినిపిస్తున్నాయి. గిడుతూరు సచివాలయం పరిధిలోని బయ్యవరానికి సంబంధించి రికార్డులు తారుమారు చేసేందుకే ఆ సమయంలో రిటైర్డ్ వీఆర్వోను రెవెన్యూ అధికారులు రప్పించారా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఏదేమైనప్పటికీ రెవెన్యూ అధికారులు ఆ సమయంలో ఆయన్ను కార్యాలయంలోకి అనుమతించడం ఏమిటన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఈ విషయంపై ఉన్నతాధికారులు విచారణ చేపట్టాలన్న డిమాండ్ వ్యక్తమవుతోంది.
ఆరోపణల్లో వాస్తవం లేదు..
రెవెన్యూ కార్యాలయంలో సెలవు రోజు రాత్రి రిటైర్డ్ వీఆర్వోతో కలిసి రికార్డులు తారుమారు చేస్తున్నట్టు వచ్చిన ఆరోపణల్లో వాస్తవం లేదని తహసీల్దార్ ప్రసాద్ వివరణ ఇచ్చారు. బయ్యవరం గ్రామానికి సంబంధించి రీసర్వేపై డీఎల్‌ఆర్(డ్రాఫ్ట్ ల్యాండ్ రిజిస్టర్) నమోదు చేస్తున్నామని, సూర్యనారాయణకు ఉన్న భూమికి సంబంధించిన వివరాలపై సర్వే అసిస్టెంట్ పిలవడంతోనే ఆయన వచ్చాడని తహసీల్దార్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment