సాక్షి, అనకాపల్లి: పరిపాలనా దక్షతకు గుర్తింపు వచ్చింది. అంకిత భావానికి కితాబు లభించింది. సేవాతత్పరతకు అరుదైన గౌరవం దక్కింది. పెట్రోలియం అండ్ ఎనర్జీ యూనివర్సిటీ తొలి గౌరవ డాక్టరేట్‌ను అనకాపల్లి కలెక్టర్ రవి పట్టాన్‌శెట్టికి ప్రదానం చేసింది. శనివారం విశాఖలో జరిగిన ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీ (ఐఐపీఈ) మూడో స్నాతకోత్సవంలో ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ జియోమాగ్నెటిజం ఇండియన్ నేషనల్ సైన్స్ అకాడమీ గౌరవ శాస్త్రవేత్త, ప్రొఫెసర్ అర్చన భట్టాచార్య డాక్టరేట్‌ను అందించారు.
ఐటీడీఏ పీఓగా, జేసీగా, కలెక్టర్‌గా గిరిజనులకు అందించిన సేవలు, ఆయన హయాంలో గిరిజన ప్రాంతాల అభివృద్ధి, పరిపాలన దక్షతకు గుర్తింపుగా ఆయనకు ఈ గౌరవం దక్కింది. రవి పట్టాన్‌శెట్టి ఇటీవల ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా ‘స్వస్థ భారత్’లో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ విభాగంలో అనకాపల్లి జిల్లా నుంచి అందుకున్న అవార్డును కూడా పరిగణనలోకి తీసుకున్నారు.
ఇనిస్టిట్యూట్ భూ వివాదంపరిష్కారంలో కీలక పాత్ర
పెట్రో యూనివర్సిటీ పున:ప్రారంభంలో కలెక్టర్ రవి పట్టాన్‌శెట్టి కీలక పాత్ర పోషించారు. తాత్కాలిక క్యాంపస్ ఏయూ ఇంజనీరింగ్ కళాశాలలో ఉండగా.. సబ్బవరం వంగలి గ్రామంలో వర్సిటీని నిర్మించేందుకు రూ.855 కోట్లు మంజూరయ్యాయి. దీనికోసం 201.08 ఎకరాల వరకు ల్యాండ్ పూలింగ్ చేశారు. మధ్యలో సుమారు 20 ఎకరాల వరకు రైతులు తమకు అన్యాయం జరిగిందని హైకోర్టును ఆశ్రయించారు.
దీంతో నిర్మాణ పనులకు ఆటంకం కలిగింది. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలతో అనకాపల్లి కలెక్టర్ రవిపట్టాన్ శెట్టి నిర్వాసితులతో మాట్లాడి సమస్యను పరిష్కరించారు. దీంతో హైకోర్టు వర్సిటీ నిర్మాణానికి అనుకూలంగా తీర్పు ఇవ్వడం, పెట్రో యూనివర్సిటీకి అవరోధాలు తొలగిపోవడం జరిగింది. 2022 డిసెంబర్ 23న పనులు పున:ప్రారంభించారు. ప్రస్తుతం కాంపౌండ్ వాల్ నిర్మాణం చేశారు. పనులు కూడా జరుగుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment