
పాడేరు ఘాట్‌రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారంతా కోలుకుంటున్నారు. సకాలంలో స్పందించిన అధికార యంత్రాంగం క్షతగాత్రులకు సత్వర వైద్య సేవలందించి ప్రాణనష్టానికి అడ్డుకట్ట వేయగలిగింది. సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాలతో మంత్రులు, ప్రజాప్రతినిధులు సహాయక చర్యలను నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.
సాక్షి, పాడేరు: పాడేరు ఘాట్ లోయలోకి దూసుకుపోయిన ఆర్టీసీ బస్సు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన కిల్లో బోడిరాజు, బొట్ట చిన్నమ్మలతోపాటు మరో ముగ్గురికి ప్రాణాపాయం లేదని వైద్యులు సోమవారం మధ్యాహ్నం తెలిపారు. వీరికి విశాఖలోని మెడికవర్ ఆస్పత్రిలో మెరుగైన వైద్య సేవలందిస్తున్నామన్నారు. మరోవైపు ఇదే ప్రమాదంలో గాయపడి పాడేరు జిల్లా ఆస్పత్రిలో చేరిన వారిలో ఐదుగురు కోలుకుని ఇళ్లకు క్షేమంగా వెళ్లిపోయారు. ప్రస్తుతం 21 మంది ఆస్పత్రిలో వైద్య సేవలు పొందుతున్నారు. వారికి ఉన్నత వైద్య సేవలతోపాటు మూడు పూటల పౌష్టికాహారాన్ని పంపిణీ చేస్తున్నారు.
వీరిని ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కృష్ణారావుతోపాటు ఇతర వైద్య బృందమంతా నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. ఏపీ మెడికల్ కౌన్సిల్ సభ్యుడు, జిల్లా ఆస్పత్రిలోని గైనిక్ వైద్యుడు తమర్భ నరసింగరావు సైతం మహిళలకు, చిన్నారులకు వైద్య సేవలు అందిస్తున్నారు. బాధిత ప్రయాణికులంతా పూర్తిగా కోలుకున్న తర్వాతే ఇళ్లకు పంపాలని, వైద్య బృందాలు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ సుమిత్‌కుమార్‌తోపాటు వైద్య ఆరోగ్యశాఖ, వైద్యవిధాన పరిషత్ అఽధికారులు తగిన ఆదేశాలిచ్చారు.
బస్సు ప్రమాదంపై ఆర్టీసీ జోనల్ చైర్‌పర్సన్ విచారం
ఘాట్ లోయ సంఘటనపై ఆర్టీసీ విజయనగరం జోనల్ చైర్‌పర్సన్ గదల బంగారమ్మ విచారం వ్యక్తం చేశారు. సోమవారం ఉదయాన్నే ఆమె పాడేరు ఘాట్‌లోని సంఘటన స్థలానికి చేరుకున్నారు. లోయలోకి దూసుకుపోయిన బస్సును పరిశీలించారు. అనంతరం పాడేరు జిల్లా ఆస్పత్రిలో కోలుకుంటున్న బాధిత ప్రయాణికులను పరామర్శించారు. వారికి మెరుగైన వైద్యసేవలు అందించాలని వైద్య బృందాలను ఆదేశించారు. ఈ ప్రమాదంలో నారాయణమ్మ, సీసా కొండన్న మృతిచెందడంపై ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తరపున మృతుల కుటుంబాలతోపాటు, గాయపడిన ప్రయాణికులను అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఆమె వెంట విశాఖ ఆర్టీసీ డిప్యూటీ చీఫ్ మెకానికల్ ఇంజినీర్ కణితి వెంకటరావు, పాడేరు ఆర్టీసీ డీఎం శ్రీనివాసరావు, ఇతర సిబ్బంది ఉన్నారు.
మాజీ మంత్రి బాలరాజు,డాక్టర్ వెంకటలక్ష్మి పరామర్శ
విశాఖలోని మెడికవర్ ఆస్పత్రిలో ఉన్నత వైద్య సేవలు పొందుతున్న ఆర్టీసీ బస్సు ప్రమాద ప్రయాణికులను మాజీ మంత్రి పసుపులేటి బాలరాజు సోమవారం ఉదయం పరామర్శించారు. వారికి అందిస్తున్న వైద్య సేవలపై వైద్యులతో సమీక్షించారు. అదేవిధంగా పాడేరు జిల్లా ఆస్పత్రిలో ఆర్టీసీ బస్సు ప్రమాద బాధితులను వైఎస్సార్‌సీపీ ఎస్టీ సెల్ రాష్ట్ర అధ్యక్షురాాలు డాక్టర్ మత్స్యరాస వెంకటలక్ష్మి పరామర్శించారు. వారికి అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. పాడేరు ఎంపీపీ ఎస్.రత్నకుమారి, మాజీ ఎంపీపీలు ఎస్.వి.రమణమూర్తి, మత్స్యరాస వెంకటగంగరాజు పాల్గొన్నారు.
ఎమ్మెల్సీ, జెడ్పీ చైర్‌పర్సన్ పరామర్శ
ఎంవీపీకాలనీ: పాడేరు ఘాట్‌రోడ్డులో గాయాలపాలై మెడికవర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పలువురు రాజకీయ నాయకులు పరామర్శించారు. ఇక్కడ చికిత్స పొందుతున్న కిల్లో బోడిరాజు (39), బుట్ట చిన్నమ్ములు (48), బుట్ట దుర్గాభవానీ (14), బుట్ట రామన్న (14)తోపాటు సామర్ల బాబూరావు (50)లను సోమవారం మధ్యాహ్నం ఎమ్మెల్సీ కుంభ రవిబాబు పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్న ఆయన అనంతరం వైద్యులతో మాట్లాడారు. మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. జెడ్పీ చైర్‌పర్సన్ జల్లిపల్లి సుభద్ర, విశాఖ తూర్పు నియోజకవర్గ నాయకుడు అక్కరమాని వెంకటరావు తదితరులు క్షతగాత్రులను పరామర్శించారు.
వెలికితీతకు వర్షంతో ఆటంకం
సాక్షి,పాడేరు: ఘాట్ లోయలోకి దూసుకుపోయిన ఆర్టీసీ బస్సును బయటకు తీసే పనులకు వర్షం ఆటంకంగా మారింది. విజయనగరం నుంచి రోప్‌లు, చోడవరం దరి గోవాడకు చెందిన పెద్ద సంఖ్యలో కూలీలను ఆర్టీసీ అధికారులు అందుబాటులో ఉంచారు. పాడేరుకు చెందిన రెండు ఎస్కాట్ యంత్రాలను తీసుకువచ్చారు. ఈ క్రమంలో సోమవారం కుండపోత వానతో లోయలోకి కూలీలు దిగడానికి వీలుకాలేదు.
కొంతమంది ఆర్టీసీ సిబ్బంది లోయలోకి దిగి బస్సుకు రోప్ కట్టారు. ఇంతలో మరలా వర్షం కురవడంతో పనులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ఆర్‌అండ్‌బీ ఈఈ బాలసుందరబాబుతోపాటు ఆర్టీసీ అధికారులు, పోలీసులు సంఘటన ప్రాంతంలోనే నిరీక్షించారు. చీకటి పడినా వర్షం తగ్గక పోవడంతో వారంతా పాడేరుకు తరలివచ్చారు. మంగళవారం ఉదయం నుంచి బస్సు వెలికితీత పనులు చేస్తామని చెబుతున్నారు. ఘాట్‌లో ఆర్టీసీ బస్సు ప్రమాదానికి కారణమైన చెట్టు కొమ్మలను పూర్తిగా తొలగించారు. వాహనాల రాకపోకలకు ఇబ్బంది లేకుండా వీటిని నరికివేశారు.
Comments
Please login to add a commentAdd a comment