కౌలు రైతుకు కొండంత అండ | - | Sakshi
Sakshi News home page

కౌలు రైతుకు కొండంత అండ

Published Sun, Aug 27 2023 1:46 AM | Last Updated on Sun, Aug 27 2023 11:48 AM

- - Sakshi

రైతులకు అందించే అన్ని సంక్షేమ పథకాల ఫలాలను కౌలు రైతులకు కూడా వర్తింపజేయాలని ప్రభుత్వం సంకల్పించింది. ‘పంట సాగుదారు హక్కు చట్టం–2019’ ద్వారా రైతులతో సమానంగా సంక్షేమ పథకాలు, రాయితీలు అందిస్తోంది. ఈ ఏడాది రెట్టింపు స్థాయిలో కౌలు రైతులకు పంట సాగుదారు హక్కు పత్రాలను జారీ చేసి రికార్డు సృష్టించింది.

దేవరాపల్లి : రాష్ట్ర చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా రైతు సంక్షేమానికి పెద్దపీట వేస్తున్న వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం కౌలు రైతులకు సైతం కొండంత అండగా నిలుస్తోంది. రైతులకు అందించే అన్ని సంక్షేమ పథకాల ఫలాలను కౌలు రైతులకు కూడా అందించాలని ప్రభుత్వం సంకల్పించింది. ఈ నేపథ్యంలో భూమి యాజమాన్య హక్కులకు భంగం కలగకుండా కౌలుదారునికి నిర్ణీత కాల వ్యవధిలో పండిన పంటలపై మాత్రమే హక్కు కల్పిస్తూ ‘పంట సాగుదారు హక్కు చట్టం–2019’ను తీసుకువచ్చింది. ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి తీసుకువచ్చిన ఈ చట్టం కౌలు రైతుల పాలిట వరంగా మారింది.

చట్టం కల్పించిన భరోసాతో భూ యజమానులు కౌలుకు ఇచ్చేందుకు ధైర్యంగా ముందుకు వస్తున్నారు. గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో కౌలు రైతుల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించింది. కంటి తుడుపుగా గ్రామంలో తమ అనుయాయులకు ఒకరిద్దరికి కౌలుకార్డులు మంజూరు చేసి మమ అనిపించేది. కానీ వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వచ్చాక కౌలు రైతుల దశ మారింది. భూమి లేని సన్న చిన్నకారు నిరుపేద రైతులకు, దేవదాయ భూములు సాగు చేసుకునే రైతులకు సైతం పంట సాగుదారు హక్కు పత్రాలు జారీ చేసి వెన్నుదన్నుగా నిలుస్తోంది.

ఈ మేరకు రైతు భరోసా కేంద్రాల్లో కౌలు రైతు గుర్తింపు గ్రామ సభలను నిర్వహించి మరీ దరఖాస్తులు స్వీకరించింది. రాజకీయ పార్టీలకు అతీతంగా అర్హులైన కౌలుదారులకు పంట సాగుదారు హక్కు పత్రాన్ని అందజేశారు. దీంతో జిల్లాలో ఈ ఏడాది అత్యధికంగా 4240 మంది కౌలు రైతులకు పంట సాగుదారు హక్కు పత్రాలను జారీ చేసి సరికొత్త రికార్డు సృష్టించింది. గత ఏడాది 2786 మందికి అందించారు.

పంట సాగుదారు పత్రంతో ఇవీ ప్రయోజనాలు
పంట సాగుదారు పత్రం పొందిన కౌలు రైతులకు వైఎస్సార్‌ రైతు భరోసా పథకం కింద పెట్టుబడిగా సాయంగా రూ. 13,500 ప్రభుత్వం అందిస్తుంది. పంట నష్ట పరిహారం, ఉచిత పంటల బీమా పథకం, సున్నా వడ్డీ పథకం వర్తిస్తుంది. ఈ పత్రం ద్వారా బ్యాంక్‌ల్లో పంట రుణం పొందవచ్చు. పంట కొనుగోళ్లలో ప్రభుత్వం చెల్లించే కనీస మద్దతు ధర పొందవచ్చు. వ్యవసాయ శాఖ ద్వారా అందించే అన్ని రకాల విత్తనాలు, ఎరువులు, వ్యవసాయ పనిముట్లు రాయితీపై పొందేందుకు అర్హులు.

కౌలురైతులకు వరంలా సీసీఆర్‌సీ కార్డులు
జిల్లాలో ఈ ఏడాది అత్యధికంగా 4240 మంది కౌలు రైతులకు పంట సాగుదారు హక్కు పత్రాలను (సీసీఆర్‌సీ కార్డులు) అందించాం. భూమి యాజమాన్య హక్కులకు భంగం కలగకుండా కౌలుదారునికి నిర్ణీత కాల వ్యవధిలో పండిన పంటలపై మాత్రమే హక్కు కల్పిస్తూ ప్రభుత్వం తీసుకువచ్చిన ‘పంట సాగుదారు హక్కు చట్టం–2019’తో భూ యజమానులు కౌలుకు ఇచ్చేందుకు ధైర్యంగా ముందుకువస్తున్నారు. రైతులతో సమానంగా అన్ని సంక్షేమ పథకాలు, రాయితీలు వర్తింపజేస్తున్నాం. ఈ కార్డు ఆధారంగా బ్యాంకుల్లో పంట రుణాలు సైతం మంజూరు చేస్తున్నారు. కౌలు రైతులకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంది.
–బి. మోహన్‌రావు, జిల్లా వ్యవసాయ అధికారి, అనకాపల్లి

ప్రభుత్వానికి రుణపడి ఉంటాం
రెండేళ్లుగా ఎకరం భూమిని కౌలుకు తీసుకొని వరి పంట సాగు చేస్తున్నాను. ప్రభుత్వం రెండేళ్లుగా పంట సాగుదారు హక్కు పత్రం మంజూరు చేస్తున్నారు. దీంతో గత ఏడాది రైతు భరోసా పథకం కింద రూ. 13,500 చొప్పున నగదు జమ అయ్యింది. ఈ ఏడాది కూడా రైతు భరోసా సొమ్ము కోసం అప్‌లోడ్‌ చేశామని అధికారులు చెప్పారు. రైతులతో సమానంగా ప్రభుత్వం అన్ని సంక్షేమ పథకాలతో పాటు రాయితీలు, విత్తనాలు, ఎరువులు అందించడం ఆనందంగా ఉంది. ప్రభుత్వానికి రుణపడి ఉంటాం.

–సోమిరెడ్డి అమ్మతల్లి నాయుడు, కౌలు రైతు, పెదనందిపల్లి

No comments yet. Be the first to comment!
Add a comment
ప్రభుత్వం జారీ చేసిన పంట సాగుదారు హక్కు పత్రం 1
1/4

ప్రభుత్వం జారీ చేసిన పంట సాగుదారు హక్కు పత్రం

2
2/4

3
3/4

4
4/4

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement