బాలికోన్నత పాఠశాల ముందు పూర్వ విద్యార్థినులు
అనకాపల్లి: ఇది మన బడేనా... ఎంతలా మారిపోయిందో అంటూ స్థానిక జీవీఎంసీ వేల్పులవీధి బాలికోన్నత పాఠశాలను చూసిన పూర్వపు విద్యా ర్థినులు ఆశ్చర్యానికి గురయ్యారు. సంక్రాంతిని పురస్కరించుకుని అత్తవారిళ్ల నుంచి అనకాపల్లి వచ్చిన పలువురు పూర్వ విద్యార్థినులు తమ పాఠశాలను చూసి ఆనందంతో ఉబితబ్బిబయ్యారు. ఇంత అభివృద్ధి కలలోనైనా ఊహించలేదని వారు చెప్పారు. 2006 నుంచి 2013 వరకు బాలికోన్నత హైస్కూల్లో విద్యనభ్యసించిన పూర్వ విద్యార్థినులంతా ఒకచోట కలుసుకోవాలని నిర్ణయించుకున్నారు.
తాము చదువుకున్న స్కూల్‌నే అందుకు వేదికగా ఎంచుకున్నారు. బుధవారం వారంతా స్కూల్‌ను సందర్శించి మురిసిసోయారు. ఆడుకునేందుకు పాఠశాల గ్రౌండ్‌కు వచ్చిన ప్రస్తుత విద్యార్థినులు, వాచ్‌మెన్‌తో కాసేపు ముచ్చటించారు. తాము చదువుకున్నప్పుడు కనీస మౌలిక వసతులు లేకపోవడంతో చాలా ఇబ్బందులకు గురయ్యామని తెలిపారు. ప్రస్తుత సీఎం వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి నాడు–నేడు ద్వారా పాఠశాలలు రూపురేఖలు మార్పు చేస్తూనే విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకురావడం గర్వంగా ఉందన్నారు. క్రీడామైదానంలో ఏర్పాటు చేసిన ఊయలో ఊగుతామంటూ సరదాగా గడిపారు.
నాణ్యమైన విద్యాబోధనతోపాటు, విద్యార్థినులకు కావాల్సిన సదుపాయాలు కల్పించడం సంతోషంగా ఉందంటూ వారి తెలిపారు. తాము నేలమీద కూర్చొని చదువుకునే వారమని, బ్లాక్‌బోర్డుపై రాసేందుకు సుద్ధముక్కలు కూడా సరిగా ఉండేవి కావని తెలిపారు. ఇప్పుడు డిజిటల్ తరగతులతో పాఠ్యాంశాలు ఇట్టే అర్థమయ్యేరీతిలో మార్పులు తీసుకురావడం ఆనందంగా ఉందన్నారు. ప్రతి విద్యార్థినులు బైజూస్ ట్యాబ్‌ల ద్వారా ఇళ్ల వద్ద పాఠ్యాంశాలను మరోసారి నేర్చుకోవడంతో వారు ఉన్నత శిఖరాలను అధిరోహించేందుకు అవకాశం ఏర్పడిందని చెప్పారు. తాము ఏడుగురం ప్రతి ఏటా సంక్రాంతి పండగకి ఒకేరకం చీరలు ధరిస్తుంటామని చెప్పారు.
స్కూల్‌ని చూసి మురిసిపోయా...
తాను చదువుకున్న హైస్కూల్ ఇంత బాగా అభివృద్ధి చెందుతుందని ఊహించేదు. గతంలో ప్రభుత్వ పాఠశాలలంటే ఎవరూ పట్టించుకునేవారు కాదు. ఇప్పుడు అదరహో అన్నట్టు మార్పుచేశారు. తరగతి గదులన్నీ అందంగా తీర్చిదిద్దారు. స్కూల్ గోడలపై మహాత్ముల ముఖచిత్రాలతో కూడిన పెయింటింగ్‌లతో స్కూల్ ఆహ్లాదకరంగా మారింది. చాలా ఆనందంగా ఉంది.
–ఎం.రాణి, రాజమహేంద్రవరం
చాలా మార్పులు జరిగాయి..
స్కూల్ చాలా మారింది. 2006 నుంచి 2013 వరకు ఇదే స్కూల్లో చదువుకున్నాను. అప్పటికీ ఇప్పటికీ చాలా తేడా కనిపిస్తోంది. తాము చదువుకున్న సమయంలో బ్లాక్‌బోర్డులపై పాఠ్యాంశాలు బోధించేవారు. ప్రస్తుతం నిర్వహిస్తున్న డిజిటల్ తరగతుల వల్ల విద్యార్థినులకు పాఠాలు సులభంగా అర్థమవుతున్నాయి.
–సీహెచ్.కుమారి, ఎ.కోటపాడు
Comments
Please login to add a commentAdd a comment