నైపుణ్య శిక్షణ ఇస్తే కొత్త డిజైన్ల తయారీ
● కలెక్టర్‌కు విన్నవించిన ఏటికొప్పాక హస్త కళాకారులు ● బొమ్మల తయారీ పరిశీలించిన కలెక్టర్ విజయకృషన్ ● ఉత్పత్తి వ్యయం, ఆదాయంపై ఆరా ● అంకుడుకర్ర డిపో ఏర్పాటు, బొమ్మలకు మార్కెటింగ్ సదుపాయం కోసం హస్తకళాకారుల వినతి
యలమంచిలి రూరల్ : అంతర్జాతీయ ఖ్యాతినార్జించిన ఏటికొప్పాక లక్కబొమ్మల తయారీని జిల్లా కలెక్టర్ విజయ కృష్ణన్ సోమవారం పరిశీలించారు. అంకుడు కర్ర, సహజసిద్ధమైన రంగులతో తయారుచేసే బొమ్మలను కలెక్టర్ ఆసక్తిగా తిలకించారు. రాష్ట్రపతి అవార్డు అందుకున్న హస్త కళాకారుడు శ్రీశైలపు చిన్నయాచారి ఏర్పాటు చేసిన బొమ్మల తయారీ పరిశ్రమ, హస్తకళాకారుల కాలనీలకు వెళ్లి ఆమె బొమ్మల తయారీని పరిశీలించారు. ఆ పరిశ్రమలో సుమారు 200 మంది మహిళలు బొమ్మలు తయారు చేస్తూ ఉపాధి పొందుతున్నారు. హస్తకళాకారుడు చిన్నయాచారి ఆమెకు బొమ్మల తయారీ విధానం, వాడే ముడి పదార్థాలు, ఉపయోగించే రంగుల గురించి విపులంగా వివరించారు. లక్కబొమ్మల తయారీ ద్వారా ఎంత లాభం వస్తుంది? అని కలెక్టర్ అడిగారు. ఉత్పత్తి వ్యయం పోనూ సుమారు 30 నుంచి 35 శాతం లాభం వస్తుందని చిన్నయాచారి తెలిపారు. ఒకే తరహా డిజైన్లు కాకుండా కొత్త డిజైన్లు తయారు చేయగలరా? అని ఆమె అడగ్గా డిజైనర్లతో ప్రత్యేక శిక్షణ ఇప్పిస్తే ప్రస్తుత మార్కెట్ అవసరాలకు తగినట్లుగా బొమ్మలు తయారు చేయగలుగుతామన్నారు. ముఖ్యంగా బొమ్మల తయారీకి అవసరమైన అంకుడు కర్ర కొరత కారణంగా బొమ్మల తయారీ వ్యయం బాగా పెరిగిపోతోందని హస్తకళాకారులు కలెక్టర్‌కు తెలిపారు. అంకుడుకర్ర సాగు పెంచి, అటవీ శాఖ అనుమతితో కళాకారులకు అందుబాటులో డిపో ఏర్పాటు చేస్తే అందరికీ ప్రయోజనం కలుగుతుందన్నారు. బ్యాంకుల నుంచి రుణ సదుపాయం, తాము తయారు చేసిన బొమ్మలకు మార్కెటింగ్ సదుపాయం కల్పించాలని కోరారు. 76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన పరేడ్‌లో లక్కబొమ్మల శకటం మూడో స్థానంలో నిలవడానికి కారణమైన హస్తకళాకారుడు సంతోష్‌ను ఆమె అభినందించారు. కార్యక్రమంలో కలెక్టరు వెంట డీఆర్‌డీఏ పీడీ కె.శచీదేవి, ఎంపీడీవో కొండలరావు, డిప్యూటీ తహసీల్దార్ వినయ్‌కుమార్, ఎంఈవో అరుణ్ కుమార్, మండల ఇంజినీర్ చంద్రశేఖర్, ఏవో ప్రసాదరావు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment