● 9 నెలలకే కూటమి ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత ● ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలే నిదర్శనం ● మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యే ప్రచారం చేసినా తప్పని పరాజయం ● మాజీ డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు విమర్శ
దేవరాపల్లి : ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా పీఆర్‌టీయూ అభ్యర్థి గాదె శ్రీనివాసులు నాయుడు విజయం సాధించడం కూటమి ప్రభుత్వానికి చెంప పెట్టు లాంటిదని మాజీ డిప్యూటీ సీఎం, వైఎస్సార్‌సీపీ అనకాపల్లి జిల్లా అధ్యక్షుడు బూడి ముత్యాలనాయుడు విమర్శించారు. ఈ మేరకు తారువలో సోమవారం ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను గెలిపించేందుకు రాష్ట్ర మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్యేలు, నాయకులంతా శత విధాలుగా ప్రలోభాలకు తెరతీసినా ఘోర పరాజయం తప్పలేదని ఎద్దేవా చేశారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 9 నెలలకే కూటమి ప్రభుత్వం తీవ్ర వ్యతిరేకత మూటకట్టుకుందని, గతంలో ఏ ప్రభుత్వానికి ఇంతటి చేదు అనుభవం ఎదురుకాలేదన్నారు. కూటమిపై ఉపాధ్యాయులు తిరుగుబావుటా ఎగురు వేసి, ఓటమి రుచి చూపించారన్నారు. పీఆర్‌టీయూ అభ్యర్థి గాదె శ్రీనివాసులు నాయుడు చేతిలో కూటమి అభ్యర్థి పాకలపాటి రఘువర్మ ఘోర పరాజయం మోసపూరిత వాగ్దానాలతో దగా చేసిన ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకతకు నిదర్శనమన్నారు. ఎన్నికల్లో గెలిచాక కనీసం ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు ఒక్క డీఏ, ఐఆర్, పీఆర్‌సీ ఊసెత్తకుండా మోసగించడంతో కూటమికి ఓటు ద్వారా తగిన గుణపాఠం చెప్పారని మాజీ డిప్యూటీ సిఎం బూడి ముత్యాలనాయుడు విమర్శించారు. ఇప్పటికై నా కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నిష్పక్షపాతంగా అమలు చేయాలని, లేకుంటే రాష్ట్రంలో ఏ ఎన్నికలు జరిగినా ప్రజా తీర్పు మాత్రం ఇదే మాదిరిగా ఉంటుందని స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment