
పిచ్చికుక్కల స్వైర విహారం
దేవరాపల్లి/మునగపాక: పిచ్చికుక్కల దాడిలో దేవరాపల్లి, మునగపాక మండలాల్లో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. దేవరాపల్లిలో ఒక కుక్క శుక్రవారం రాత్రి నుంచి శనివారం ఉదయం 8 గంటల వరకు 12 గంటల వ్యవధిలో 15 మందిపై విచక్షణ రహితంగా దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది. శనివారం బండారు వీధిలో కుళాయి నీరు పడుతున్న పదో తరగతి విద్యార్థి బండారు దీపికపై దాడి చేసి ఎడమ కాలిపై నుంచి కింద వరకు అనేక చోట్ల తీవ్రంగా గాయపర్చింది. మరిడిమాంబ కాలనీలో అప్పడే నిద్ర లేచి బయటకు వచ్చిన ఆరేళ్ల బాలుడు జాగరపు ఉదయ్‌కుమార్‌పై దాడి చేసి పొట్ట, కాలు, చెవులపై తీవ్ర గాయాలు చేసింది. శుంభువానిపాలెంలో ఉపాధి పనులకు వెళ్తున్న ఉగ్గిన గాంధీని, ఇంటి వద్ద మంచంపై కూర్చున్న ఇర్రా దేముడిని, వడ్రంగి పనికి వెళ్తున్న బల్లంకి వెంకటరావుపై కుక్క దాడి చేయడంతో తీవ్రంగా గాయపడ్డారు. ఇలా మొత్తం 15మందిని తీవ్రంగా గాయపరిచింది. కుక్క కాటుకు గురైన వారందరికీ ఇమ్యునోగ్లోబిన్ ఇంజక్షన్లు చేసి వైద్య సేవలందించామని పీహెచ్‌సీ వైద్యాధికారి ఇ.పూజ్యమేఘన తెలిపారు. మునగపాక మండలం ఒంపోలులో పిచ్చికుక్క శనివారం పలువురిని కరవడంతో గాయాలపాలయ్యారు. సమీపంలోని అనకాపల్లిలో పలు ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్సపొందుతున్నారు. గ్రామానికి చెందిన మంత్రి నూకరాజు, గొర్లి శేషులమ్మ,బండి సత్యనారాయణతో పాటు మరో ముగ్గురు వ్యక్తులను కుక్క పలుచోట్ల గాయపరచింది.
● దేవరాపల్లి, మునగపాక మండలాల్లో పలువురికి తీవ్ర గాయాలు

పిచ్చికుక్కల స్వైర విహారం

పిచ్చికుక్కల స్వైర విహారం