కళ్యాణదుర్గం: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన సచివాలయ వ్యవస్థ ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తోంది. దాదాపు 35 శాఖలకు సంబంధించి 500 సేవలు అందుబాటులోకి తీసుకువచ్చారు. పింఛన్ కావాలన్నా..రేషన్ కార్డు కావాలన్నా.. ఇంటి పట్టాలు కావాలన్నా.. తాగునీటి సరఫరా సమస్య ఉన్నా.. సివిల్ పనులకు సంబంధించిన పనులు ఉన్నా.. వైద్యం కానీ.. ఆరోగ్యం కానీ.. రెవెన్యూ కానీ.. భూముల సర్వేకానీ.. శిశు సంక్షేమం కానీ.. డెయిరీ కానీ, పౌల్ట్రీ రంగాల సేవలు కానీ.. తదితర సేవలకు సంబంధించి సచివాలయాల్లో అర్జీ పెట్టుకున్న గంటల వ్యవధిలోనే ఉద్యోగులు పరిష్కరిస్తున్నారు. ఈ క్రమంలో పురిటి నొప్పులతో బాధపడుతున్న గర్భిణికి సకాలంలో సచివాలయ ఏఎన్‌ఎం కాన్పు చేసి తల్లీబిడ్డ ప్రాణాలు కాపాడారు.
ఆపదలో మేమున్నమంటూ.. : కళ్యాణదుర్గం మండలం తిమ్మసముద్రం గ్రామ సచివాలయంలో ఏఎన్‌ఎంగా పనిచేస్తున్న కవిత అందరి చేత శభాష్ అనిపించుకున్నారు. మంగళవారం ఉదయం కంబదూరు మండలం తిప్పేపల్లికి చెందిన గర్భిణి వినీతకు పురిటి నొప్పులు మొదలయ్యాయి. దీంతో కుటుంబసభ్యుల నుంచి సమాచారం అందుకున్న 108 అంబులెన్స్ సిబ్బంది అక్కడకు చేరుకుని గర్భిణిని కళ్యాణదుర్గం సీహెచ్‌సీకి తరలించేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలో నూతిమడుగు వద్దకు చేరుకోగానే గర్భిణికి నొప్పులు తీవ్రమయ్యాయి.
దీంతో వాహనాన్ని పైలెట్ జనార్ధన్ రోడ్డు పక్కన ఆపేశాడు. అదే సమయంలో తిమ్మసముద్రం సచివాలయానికి విధులకు హాజరయ్యేందుకు వెళ్తున్న ఏఎన్‌ఎం కవిత అక్కడకు చేరుకున్నారు. ప్రసవ వేదనతో బాధపడుతున్న గర్భిణిని చూసి స్పందించిన ఆమె ఈఎంటీ బ్రహ్మయ్య సాయంతో వినీతకు ప్రసవం చేశారు. పండంటి ఆడబిడ్డకు వినీత జన్మనిచ్చింది. అనంతరం తల్లీబిడ్డను కళ్యాణదుర్గం సీహెచ్‌సీలో చేర్పించారు. పరీక్షించిన వైద్యులు సకాలంలో కాన్పు చేసి తల్లీబిడ్డ ప్రాణాలు కాపాడిన ఏఎన్‌ఎం కవితను అభినందించారు. ఏఎన్‌ఎం చూపిన చొరవపై కుటుంబసభ్యులు హర్షం వ్యక్తం చేశారు. సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసి, సత్వర సేవలు అందించేలా చర్యలు తీసుకున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి ఈ సందర్భంగా వారు కృతజ్ఞతలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment