అనంతపురం అగ్రికల్చర్: ‘నైరుతి’ రుతుపవనాలు సోమవారం ఉమ్మడి అనంతపురం జిల్లాను తాకినట్లు భారత వాతావరణ శాఖ (ఐఎండీ) విడుదల చేసిన ఛాయాచిత్రం స్పష్టం చేస్తోంది. ఒకట్రెండు రోజుల్లో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రుతుపవనాలు విస్తరించే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. నైరుతి విస్తరించి ప్రభావం చూపిస్తే మంచి వర్షాలు కురిసే అవకాశం ఉంది. జూన్ నుంచి అక్టోబర్ 15 వరకు నైరుతి ప్రభావంతోనే వర్షాలు కురవనున్నాయి. ఈ ఖరీఫ్‌లో 319.6 మి.మీ సాధారణ వర్షపాతంగా పరిగణించారు.
అనుకున్న ప్రకారం జూన్, జూలైలో వర్షాలు కురిస్తే 4 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో పంటలు సాగులోకి రానున్నట్లు అధికారులు అంచనా వేశారు. ఈ నెల 15 నుంచి జూలై ఆఖరు వరకు పంటల సాగుకు అనుకూలమని శాస్త్రవేత్తలు ఇప్పటికే ప్రకటించారు. కాగా రాగల రెండు రోజులు జిల్లాకు తేలికపాటి వర్షసూచన ఉన్నట్లు రేకులకుంటలోని వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ బి.సహదేవరెడ్డి, సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ కే.అశోక్‌కుమార్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment