రాప్తాడురూరల్: జిల్లా విద్యాశాఖ అధికారి (డీఈఓ) ఎం.సాయిరామ్ శనివారం గుండెపోటుకు గురయ్యారు. ఉదయం నుంచి వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయన మధ్యాహ్నం 3.30 గంటలకు ఇంటికి చేరుకున్నారు. తనకు కడుపు నొప్పిగా ఉందని భార్య ఉమాకు చెప్పి బెడ్‌రూమ్‌లో విశ్రాంతి తీసుకున్నారు. సాయంత్రం 5.30 గంటల సమయంలో భార్య పిలిచినా డీఈఓ నుంచి స్పందన లేదు. అప్పటికే ఆయన కోమాలోకి వెళ్లారు.
గట్టిగా కేకలు వేయడంతో ఇంటివద్దే ఉన్న ఏపీఓ నారాయణస్వామి, కంప్యూటర్ ఆపరేటర్ హరికృష్ణ, డ్రైవరు హుటాహుటిన కారులో తీసుకొచ్చి నగరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. సమాచారం అందుకున్న కలెక్టర్ గౌతమి, జెడ్పీ చైర్‌పర్సన్ గిరిజమ్మ తదితరులు ఆస్పత్రికి వచ్చి డీఈఓ ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులతో అడిగి తెలుసుకున్నారు. రోదిస్తున్న భార్య ఉమాను ఓదార్చారు.
గుండెకు రక్తం సరఫరా అయ్యే వాల్వ్ బ్లాక్ కావడం, ఊపిరిత్తుల్లోకి ఆహారం చేరుకోవడంతో కోమాలోకి వెళ్లినట్లు వైద్యులు ప్రాథమికంగా నిర్ధారించారు. మెరుగైన చికిత్స అందించాలని కలెక్టర్, జెడ్పీ చైర్‌పర్సన్ వైద్యులకు సూచించారు. డీఈఓ అస్వస్థతకు గురయ్యారనే సమాచారంతో డీఈఓ, సమగ్ర శిక్ష కార్యాలయాల సిబ్బంది, ఉపాధ్యాయ సంఘాల నాయకులు, ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు, ఉపాధ్యాయులు, ఎంఈఓలు, హెచ్‌ఎంలు ఆస్పత్రికి తరలివచ్చారు.
ఉదయమంతా సరదాగా గడిపిన డీఈఓ..
ఉదయం నుంచి డీఈఓ సాయిరామ్ సరదాగా గడిపారు. నగర శివారులోని టీటీడీసీలో జరుగుతున్న రీజనల్‌స్థాయి ప్రధానోపాధ్యాయుల శిక్షణ ముగింపు కార్యక్రమానికి హాజరయ్యారు. గాయకుడైన డీఈఓ ఈ సందర్భంగా ‘ఇదే కదా ఇదే కదా నీకథ...ముగింపు లేనిదై సదా సాగదా’ అంటూ మహర్షి సినిమాలో పాట పాడి అందరినీ ఆకర్షించారు. అక్కడి నుంచి సమగ్ర శిక్ష కార్యాలయానికి చేరుకుని ఎంఈఓల సమావేశంలో పాల్గొన్నారు.
అందరితో హుషారుగా గడిపారు. ఇక్కడి నుంచి 3 గంటల సమయంలో ఇంటికి బయల్దేరారు. కాగా... డీఈఓ గతంలోనే గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. ఇప్పటికే స్టంట్‌కూడా వేయించుకున్నారు. డీఈఓ త్వరగా కోలుకోవాలని విద్యాశాఖ ఉద్యోగ, ఉపాధ్యాయులు ఆకాంక్షిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment