సాక్షి ప్రతినిధి, అనంతపురం: ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలుగుదేశం పార్టీలో గందరగోళం నెలకొంది. ప్రస్తుతం నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లుగా ఉన్న నాయకులపై కార్యకర్తలు తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు. వీళ్లకు టికెట్లిస్తే వచ్చే ఎన్నికల్లో మునిగిపోతాం అంటూ బహిరంగంగానే చెబుతున్నారు. నాయకుల కంటే వర్గాలు ఎక్కువయ్యాయని, ఈ నాయకుల కొట్లాటలతో పిచ్చెక్కిపోతోందని వాపోతున్నారు.
మరోవైపు టీడీపీ నాయకులు ఇప్పటి వరకూ ఏం చేశామో చెప్పలేక.. భవిష్యత్‌లో ఏం చేయగలమో తెలియక ప్రజల్లోకి వెళ్లడం మానేశారు. అధికార పక్షమే ప్రతిపక్ష పార్టీ పాత్ర పోషిస్తోంది. కనీవినీ ఎరుగని రీతిలో దేశ చరిత్రలో తొలిసారి ప్రతి గడపకూ వెళుతున్న పార్టీగా వైఎస్సార్‌సీపీ రికార్డు సృష్టించింది. కుల, మత, వర్గాలకతీతంగా 86 శాతం మందికి పైగా ఉమ్మడి అనంతపురం జిల్లాలో సంక్షేమ ఫలాలు అందించిన ఘనతను సాధించింది.
వాళ్లను ప్రోత్సహిస్తే పుట్టి మునుగుతుంది
వాహనాలకు నకిలీ పత్రాలు సృష్టించి అమ్మి ఈడీ కేసులో ఇరుక్కోవడంతో పాటు తాడిపత్రిలో నిత్యం వివాదాలు సృష్టిస్తున్న జేసీ సోదరుల (దివాకర్‌రెడ్డి– ప్రభాకర్‌రెడ్డి)ను ప్రోత్సహించవద్దని జిల్లానుంచి పలువురు టీడీపీ అధిష్టానానికి ఫిర్యాదులు చేస్తూనే ఉన్నారు. వారిని ప్రోత్సహిస్తే పార్టీకి నష్టం కలుగుతుందని టీడీపీ నాయకులే చెబుతున్నారు. జేసీ సోదరుల చౌకబారు ఎత్తుగడలకు పార్టీ అథఃపాతాళానికి దిగజారిందని వాపోతున్నారు.
► పరిటాల రవి కుటుంబం పైనా అనేక ఆరోపణలు ఉన్నాయి. పరిటాల రవి హయాంలో ఆర్‌ఓసీ పేరిట జరిగిన దమనకాండ చెరగని మచ్చ అని..పైగా పరిటాల సునీత నాడు మంత్రిగా ఉండి చేసిందేమీ లేదని, ఈ కుటుంబానికి రెండు టికెట్లు కాదు ఒక్కరికి టికెట్ ఇచ్చినా మునిగిపోవడం ఖాయమని పలువురు అంటున్నారు.
వీళ్లేమి జిల్లా అధ్యక్షులు బాబూ..!
జిల్లాల పునర్విభజన తర్వాత అనంతపురానికి కాలవ శ్రీనివాసులు, శ్రీసత్యసాయికి బీకే పార్థసారథి టీడీపీ జిల్లా అధ్యక్షులుగా అయ్యారు. వీళ్లపై రోజురోజుకూ వ్యతిరేకత పెరుగుతోంది. జిల్లాలో కాలువ శ్రీనివాసులు ఎవరినీ కలుపుకుపోవడం లేదని, పైగా రాయదుర్గంలో ఆయన గెలవలేని పరిస్థితి ఉందని కొంతమంది కార్యకర్తలు అంటున్నారు. ఇటీవల చంద్రబాబు అనంతపురం వచ్చినప్పుడు బాగా గుర్తింపు ఉన్న ఓ కార్యకర్తను ‘చస్తే చావు’ అంటూ అన్న మాటలు అక్కడున్న వారిని తీవ్ర మనస్తాపానికి గురిచేశాయి. పైగా మూడేళ్లు మంత్రిగా ఉండి ఏమీ చేయలేదని ఆరోపణలున్నాయి.
దీంతో పాటు బీకే పార్థసారథి ఇంట గెలవ లేక రచ్చ రచ్చ చేస్తున్నారని, ఆయనకు జిల్లా మొత్తం ఎలా అప్పగిస్తారని ప్రశ్నిస్తున్నారు. ప్రతి రోజూ బీసీ సామాజికవర్గానికి చెందిన సవితమ్మతో పోరు కొనసాగిస్తూ పెనుకొండ నియోజకవర్గానికే పరిమితమయ్యారన్న చెడ్డపేరు ఉంది. జిల్లా అధ్యక్షులుగానే కాదు నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లుగానూ వీరు పనికి రారన్న విమర్శలు గుప్పిస్తున్నారు.
అవినీతి ఆరోపణలతో ఉక్కిరిబిక్కిరి
కదిరిలో ఇప్పటికే కందికుంట వెంకట ప్రసాద్ కుటుంబానికి టీడీపీ టికెట్ ఇవ్వవద్దని మరో వర్గం పోరాడుతోంది. పుట్టపర్తిలో మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డిపై అవినీతి ఆరోపణలున్నాయని, ఆయనకు గనుక టికెట్ కేటాయిస్తే ఓటమి తథ్యమని కొందరు కుండ బద్దలుకొడుతున్నారు. గుంతకల్లులో టీడీపీకి అభ్యర్థి ఉన్నారనే విషయమే ఎవరికీ తెలియదని, కళ్యాణదుర్గంలో రెండు వర్గాలు కొట్టుకుంటూ ఉంటే పరువు బజారున పడుతోందని, అసలు అనంతపురం జిల్లావైపు అధిష్టానం ఎప్పుడైనా చూస్తోందా అంటూ కిందిస్థాయి కేడర్ మండిపడుతోంది.
దళిత నేతలకు గుర్తింపు ఏదీ?
ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఉన్న రెండు ఎస్సీ నియోజకవర్గాల్లో టీడీపీ దళిత నేతలకు ప్రాధాన్యం ఇవ్వడం లేదు. రెండు నియోజవర్గాల్లోనూ ఆధిపత్య కులాల నాయకులదే పెత్తనం. శింగనమలలో బండారు శ్రావణిని పట్టించుకునే దిక్కు లేదు. స్వయానా ఆమె తండ్రిపై టీడీపీ వారే దాడి చేస్తే లోకేష్ (పాదయాత్ర సమయంలో) జిల్లాలో ఉండికూడా పరామర్శించలేదు. ఇక మడకశిరలో టీడీపీ అభ్యర్థి ఎవరో ఇప్పటికీ తెలియదు. మైనింగ్ అవినీతిలో కూరుకుపోయిన గుండుమల తిప్పేస్వామి కనుసన్నల్లో ఆ నియోజకవర్గం ఉంది. దీంతో జిల్లాలో రోజురోజుకూ పార్టీ పరిస్థితి దిగజారిపోతోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment