గొర్రెల్లో నీలినాలుక వ్యాధి లక్షణాలు
అనంతపురం అగ్రికల్చర్: ఏ వ్యాధి ప్రబలినా తొలుత ఒక గొర్రెతోనే మొదలవుతుందని, సకాలంలో దానిని గుర్తించి పశు వైద్యున్ని సంప్రదించడం ద్వారా తగిన జాగ్రత్తలతో వ్యాధి విస్తరించకుండా జీవాలను కాపాడుకోవచ్చని పశుసంవర్ధకశాఖ జేడీ డాక్టర్ వై.సుబ్రహ్మణ్యం, పశువ్యాధి నిర్ధారణ కేంద్రం (ఏడీడీఎల్) ఏడీ డాక్టర్ ఎన్.రామచంద్ర అన్నారు. ఇటీవల కురిసిన తేలికపాటి వర్షాలు, పెరిగిన గాలులు, మారిన వాతావరణ పరిస్థితులకు జీవాల్లో ప్రమాదకరమైన నీలినాలుక వ్యాధి (బ్లూటంగ్), మూతిపుండ్లవ్యాధి, కాలిపుండ్లవ్యాధి (ఫుట్‌రాట్) సోకే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నారు. వీటి నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించారు.
► నీలి నాలుక (బ్లూటంగ్), మూతి పుండ్ల వ్యాధి సోకితే జ్వరం, మూతి వాపు, పెదవులు దద్దరించడం, నోటి లోపల పుండ్లు, ముక్కులో చీమిడి, కాళ్లు కుంటు, ఒంట్లో నీరు చేరి పారుకోవడం, మేత మేయకపోవడం, ఈసుకుపోవడం (అబార్షన్)తో పాటు 30 శాతం వరకూ మరణాలు సంభవిస్తాయి. ఈ లక్షణాలు కనిపించిన వెంటనే వ్యాధి సోకిన గొర్రెను వేరు చేసి పశువైద్యున్ని సంప్రదించి సరైన చికిత్స చేయించాలి. సాయంత్రం పూట గొర్రెల మందలో వేపాకు పొగ వేయడం, అపుడప్పుడు బ్లూట్యాక్స్ లేదా టెక్కిల్ మందుతో పిచికారీ చేస్తుండాలి. పొడి ప్రాంతాల్లోనే మేపునకు తీసుకెళ్లాలి. ఈ ఏడాది ఇప్పటి వరకూ బ్లూటంగ్‌కు సంబంధించి 15.18 లక్షల డోసుల వ్యాక్సినేషన్ పూర్తయింది.
► కాలిగిట్టల మధ్య చీము చేరడం, చెడు వాసన రావడం లాంటి లక్షణాలు కనిపిస్తే కాలిపుండ్లవ్యాధిగా గుర్తించాలి. బురద ప్రాంతాల్లో జీవాలను మేపకూడదు. నట్టల నివారణ మందులు తాగించాలి.
కాపర్లూ ఈ సూచనలు పాటించండి..
వ్యాధి వల్ల చనిపోయిన జీవాల కళేబరాలను అమ్మకూడదు, తినకూడదు. ఊరికి దూరంగా గుంత తవ్వి సున్నం చల్లి పాతిపెట్టాలి. కొన్ని జీవాలు చనిపోయే వరకూ ఆరోగ్యంగా ఉన్నట్లుగానే మొండిగా మేత మేస్తూ ఉంటూ ఉన్నఫలంగా మరణిస్తాయి. పై లక్షణాలు కనిపించిన వాటిని ఎట్టి పరిస్థితుల్లోనూ తినకూడదు, అమ్మకూడదు. జీవాలకు ఎప్పుడూ పారే నీళ్లు, బోరు నీళ్లు తాగించాలి. నిల్వ ఉన్న నీటిని ఎలాంటి పరిస్థితుల్లోనూ తాపరాదు. జబ్బు బారిన పడిన ఒక గొర్రెను సకాలంలో గుర్తించకపోతే మిగిలిన గొర్రెలకూ విస్తరించే ప్రమాదముంది. జబ్బు బారిన పడి మృతిచెందిన గొర్రె లేదా దాని పేడ, ఇతర అవయవాలు సేకరించి వెంటనే పశువైద్యున్ని సంప్రదించాలి.
Comments
Please login to add a commentAdd a comment