హిందూపురం అర్బన్ : కాచిగూడ–యశ్వంతపూర్ మధ్య ‘వందే భారత్’ఎక్స్‌ప్రెస్ రైలు ఆదివారం నుంచి పరుగులు తీయనుంది. దేశవ్యాప్తంగా 9 వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌లను ప్రధాని మోదీ ఈ నెల 24వ తేదీ వర్చువల్‌గా ప్రారంభించనున్నారు. అందులో కాచిగూడ–యశ్వంతపూర్ మధ్య నడిచే ‘వందే భారత్’కూడా ఒకటి. వారంలో బుధవారం మినహా మిగిలిన అన్ని రోజులు నడిచే వందేభారత్ రైలు కేవలం 8.30 గంటల్లోనే కాచిగూడ నుంచి యశ్వంతపూర్ చేరేలా రైల్వే అధికారులు ప్రణాళిక సిద్ధం చేశారు.
ఉదయం 5.30 గంటలకు కాచిగూడ నుంచి బయలుదేరే వందేభారత్ (20703) మహబూబ్‌నగర్, కర్నూలు మీదుగా ఉదయం 10.55 గంటలకు అనంతపురానికి, 11.30 గంటలకు ధర్మవరం చేరుకుంటుంది. మధ్యాహ్నం 2.30 గంటలకు యశ్వంతపూర్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో 2.45 గంటలకు బయలుదేరనున్న వందేభారత్ (20704) సాయంత్రం 5.20 గంటలకు ధర్మవరం, 5.41 గంటలకు అనంతపురం, రాత్రి 11.15 గంటలకు తిరిగి కాచిగూడకు చేరుకుంటుంది.
కాచిగూడ – యశ్వంతపూర్ మధ్య 609.81 కిలో మీటర్లు దూరం ఉండగా, అందులో సింగిల్ ట్రాక్ 213.31 కి.మీ కాగా, డబుల్ ట్రాక్ 396 .50 కి,మీ ఉంది. వందేభారత్ సగటున 71.74 కి.మీ వేగంతో దూసుకువెళ్లనుంది. భోజన సదుపాయంతో కలిపి ఎగ్జిక్యూటివ్ చైర్ కార్ టికెట్ ధర రూ. 2,425 కాగా, ఏసీ చైర్ టికెట్ రూ. 1,545గా నిర్ణయించారు.
Comments
Please login to add a commentAdd a comment