సాక్షి, అనంతపురం డెస్క్: క్రికెట్‌లో ఉన్నత స్థాయికి ఎదగడమంటే ఆషామాషీ కాదు. ఎంతో నైపుణ్యంతో పాటు నిలకడగా రాణించాలి. అప్పుడు మాత్రమే అవకాశాలు అందివస్తాయి. మరీ ముఖ్యంగా మహిళలు ఈ క్రీడలో రాణించాలంటే ఎన్నో సవాళ్లను అధిగమించాలి. అయితే..అన్నింటినీ అధిగమించి అంతర్జాతీయ క్రికెటర్‌గా సత్తా చాటుతోంది బారెడ్డి అనూష. ప్రస్తుతం చైనాలో జరుగుతున్న ఆసియా క్రీడల్లో స్వర్ణపతకం సాఽధించిన భారత మహిళా క్రికెట్ జట్టులో అనూష కూడా సభ్యురాలు కావడం విశేషం.
పల్లెటూరి నుంచి...
అనూష స్వగ్రామం నార్పల మండలం బండ్లపల్లి. తల్లిదండ్రులు లక్ష్మిదేవి, మల్లిరెడ్డి. వీరిది సాధారణ రైతు కుటుంబం. రెక్కల కష్టాన్నే నమ్ముకున్న వారు. అయినప్పటికీ కుమార్తె ఆకాంక్షను కాదనలేదు. సాధారణంగా ఆడపిల్లలు క్రికెట్ ఆడతామంటే తల్లిదండ్రులు అంగీకరించరు. అది కూడా గ్రామాల్లో అయితే ‘మగపిల్లల్లా ఏమిటీ ఆటలు’ అంటూ అభ్యంతరం చెబుతారు. కానీ అనూష తల్లిదండ్రులు వెన్నుతట్టి ప్రోత్సహించారు. తల్లిదండ్రులు ఇచ్చిన ప్రోత్సాహంతో ఆమె కూడా పట్టుదలతో రాణించి ఉన్నతస్థాయికి చేరింది.
మలుపు తిప్పిన ‘స్పిన్’
అనూష కెరీర్ ప్రారంభంలో ఎడమ చేతి మీడియం పేస్ బౌలింగ్ చేసేది. బంతిని కూడా బాగా స్వింగ్ చేసేది. కానీ పేస్‌బౌలర్‌గా రాణించాలంటే మంచి ఎత్తు అవసరం. అనూషకు అందుకు తగ్గ ఎత్తు లేకపోవడంతో 2018–19 సీజన్‌లో ఆమె బౌలింగ్ శైలిని మార్చేందుకు కోచ్ నిర్ణయం తీసుకున్నాడు. ఎడమచేతి వాటం స్పిన్నర్‌గా మార్పు చేశాడు. ఆ సమయంలో ఆంధ్ర ప్రదేశ్ జట్టుకు కూడా ఎడమచేతి వాటం స్పిన్నర్ అవసరం ఉండడం, అందుకు తగ్గట్టుగానే అనూష రాణించడంతో ఆమె కెరీర్‌నే మలుపు తిప్పింది. అనూష మంచి స్పిన్నర్ మాత్రమే కాదు..అద్భుతమైన ఫీల్డర్. అలాగే డెత్ ఓవర్లలో ధాటిగా బ్యాటింగ్ చేయగలదు. ఆల్‌రౌండ్ నైపుణ్యాలు ఉండడం టీమిండియాలో చోటు దక్కడానికి దోహదపడ్డాయి.
ఉమ్మడి జిల్లాలో తొలి ప్లేయర్
ఉమ్మడి అనంతపురం జిల్లా నుంచి క్రికెట్ (పురుషులు/మహిళలు)లో ఇదివరకు ఎవరూ అంతర్జాతీయస్థాయికి ఎదగలేదు. రాష్ట్ర, జోనల్ స్థాయికే పరిమితమయ్యారు. కానీ అనూష టీమిండియాలో చోటు సంపాదించి..జిల్లాలో తొలి అంతర్జాతీయ క్రికెటర్‌గా గుర్తింపు తెచ్చుకుంది. అలాగే రాయలసీమలో అంజలి శర్వాణి (ఆదోని, కర్నూలు జిల్లా) తర్వాత ఆ ఘనత సాధించిన రెండో ప్లేయర్ అనూష కావడం గమనార్హం.
ఆర్డీటీ సహకారం
ఉమ్మడి అనంతపురం జిల్లాలో అనేకమంది క్రీడాకారులకు రూరల్ డెవలప్‌మెంటు ట్రస్టు (ఆర్డీటీ) అండగా నిలుస్తోంది. ఈ కోవలోనే అనూషకు కూడా అన్నివిధాలా సహాయ సహకారాలు అందించింది. క్రికెట్‌లో అనూష నైపుణ్యాన్ని గుర్తించిన ఆర్డీటీ తన అకాడమీలో చేర్చుకుని ప్రత్యేక శిక్షణ ఇప్పించింది. ఆంధ్ర క్రికెట్ జట్టు మొదలుకుని టీమిండియాలో చోటు సంపాదించే వరకు..ప్రతి దశలోనూ అండగా నిలిచింది.
అంతర్జాతీయ క్రికెట్ ఆడతానని అనుకోలేదు
అంతర్జాతీయ స్థాయిలో క్రికెట్ ఆడతానని ఎన్నడూ ఊహించలేదు. అంకితభావం, నిరంతర కృషితో అవకాశాలు దక్కాయి. అమ్మానాన్న వ్యవసాయంతో పాటు కూలి పనులకు వెళ్తూ నన్ను ఉన్నత స్థానంలో చూడాలని ఆశించారు. వారి ఆకాంక్షను నెరవేర్చడం ఎంతో సంతోషంగా ఉంది. ఆర్డీటీ, అనంతపురం, ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్లు, మా పీఈటీ సార్.. ఇలా ఎందరో ప్రోత్సాహం, సహకారం వల్ల ఈ స్థాయికి రాగలిగాను. అందరికీ కృతజ్ఞతలు. ఆసియా క్రీడల్లో స్వర్ణపతకం సాధించిన టీమిండియాలో నేనూ ఉండడం అదృష్టంగా భావిస్తున్నాను. మరింతగా రాణించి దేశానికి, జిల్లాకు మంచి పేరు తెస్తాను.
–బి. అనూష, భారత క్రికెటర్
Comments
Please login to add a commentAdd a comment