సాక్షి ప్రతినిధి, అనంతపురం: తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు కుంభకోణాల్లో ఇరుక్కుని జైలుపాలయ్యారు. జిల్లాలో ఆ పార్టీ పరిస్థితి ఊబిలో కూరుకుపోయినట్టయ్యింది. తాను అరెస్టు అవ్వగానే ఉవ్వెత్తున ఆగ్రహజ్వాలలు వస్తాయని ఆశించిన అధినేతకు, టీడీపీ నాయకులకు నిరాశ ఎదురైంది. 2019కి ముందు తెలుగుదేశం పార్టీకి పట్టు ఉన్న ఈ జిల్లాలోనే పార్టీ పరిస్థితి ఇలా ఉందంటూ శ్రేణుల్లో నిట్టూర్పు మొదలైంది. కొంతమంది ద్వితీయ శ్రేణి నాయకులు.. ‘మీరు అవినీతిలో కూరుకుపోయి ఇప్పుడు మమ్మల్ని రోడ్డెక్కమంటారా’ అంటూ ఆక్రోశం వెళ్లగక్కు తున్నారు. ముఖ్య నేతలు ఆందోళనలకు పిలిపిస్తే జిల్లాలో పట్టుమని పదిమంది కార్యకర్తలు కూడా స్పందించి రోడ్డుపైకి రాలేదు.
నాయకుడెవరో తెలియని స్థితిలో..
చంద్రబాబు నాయుడు జైలుకు వెళ్లిన నేపథ్యంలో తెలుగుదేశం పార్టీని నడిపించేదెవరన్న గందర గోళంలో కార్యకర్తలు తలోదారి పట్టారు. లోకేష్ నాయకత్వాన్ని ఇక్కడ ఎవరూ ఒప్పుకునే పరిస్థితి కనిపించలేదు. మరోవైపు టీడీపీ అనుకూల మీడియా మాత్రం బ్రాహ్మణి ముందుకు రావాలని, భువనేశ్వరి బస్సు యాత్ర చేయాలని, పవన్ కళ్యాణ్ అండగా ఉన్నాడని ఇలా రకరకాలుగా చెబుతుండడంతో అనంతపురం జిల్లాలో పార్టీ పరిస్థితి ఏమిటన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. అసలే జిల్లాలో నాయకుల మధ్య సఖ్యత లేక పార్టీ పరిస్థితి పూర్తిగా దిగజారింది. అధికారంలో ఉన్నప్పుడు పదవులు అనుభవించి, ఎవరినీ పట్టించుకున్న పాపాన పోలేదని, ఇప్పుడేమో అధినేత జైలుకెళ్లగానే రోడ్డు మీదకు రండి అంటూ ఆర్తనాదాలు చేస్తున్నారని కార్యకర్తలు బాహాటంగా విమర్శిస్తున్నారు. జిల్లాలో ప్రతి నియోజకవర్గంలోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది.
కార్యకర్తల్లో ఊసే లేదు..
ములాఖత్ అనంతరం మిలాఖత్ అంటూ పొత్తుగురించి పవన్‌కళ్యాణ్ చెప్పినా అనంతపురం జిల్లాలో పొత్తులు పనిచేయలేదు. దీనిపై ఎక్కడా ఊసే లేదు. జనసేన–టీడీపీ కార్యకర్తలు ఉమ్మడిగా నిర్వహించే కార్యక్రమాలు దివిటీ పెట్టి చూసినా కనిపించలేదు. నిర్వహించకపోగా రెండు పార్టీల మధ్య విభేదాలు భగ్గుమంటున్నాయి. సీట్లు, ఓట్లు మేము లేకపోతే మీకెక్కడివి అంటూ ఒకరినొకరు విమర్శించుకోవడం కనిపిస్తోంది. ఈ పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ చుక్కాని లేని నావలా ఉందని కార్యకర్తలు వాపోతున్నారు. చంద్రబాబు జైలు నుంచి ఇప్పుడే బయటకు వచ్చే పరిస్థితులు కనిపించడం లేదు. అధికారంలో ఉన్న పార్టీ అర్హులైన వారందరికీ పార్టీలు, కులాలు, మతాలు చూడకుండా సంక్షేమ ఫలాలు ఇవ్వడంతో తెలుగుదేశం పార్టీని ప్రజలు మర్చిపోతున్నట్టు నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
విహారయాత్రలో టీడీపీ కౌన్సిలర్లు
తాడిపత్రి అర్బన్: టీడీపీ చంద్రబాబు ‘స్కిల్’ స్కాంలో రిమాండ్ ఖైదీగా జైలుకెళ్లారు. అరెస్టును వ్యతిరేకిస్తూ గాంధీ జయంతి రోజున ‘సత్యమేవ జయతే’ పేరిట రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపట్టాలని టీడీపీ అధిష్టానం పిలుపునిచ్చింది. అయితే టీడీపీ కార్యకర్తల నుంచి కానీ, ప్రజల నుంచి కానీ ఎటువంటి స్పందనా కనిపించలేదు. తాడిపత్రిలో ఈ విషయం ప్రస్ఫుటమైంది. ప్రజాధనం దుర్వినియోగం కేసులో ఇరుక్కున్న వారికి మద్దతుగా ఆందోళనలు చేస్తే ప్రజల్లో మనం కూడా మరింత చులకన అవుతామని టీడీపీ నాయకులు భావించినట్టు ఉన్నారు. మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్‌రెడ్డి సహచర కౌన్సిలర్లను విహారయాత్ర కోసం కేరళకు పంపించారు. వారు కుటుంబ సభ్యులతో సంతోషంగా విహారయాత్రను ఆస్వాదిస్తుండటం గమనార్హం. ప్రభాకర్‌రెడ్డి మాత్రం అనుచరులతో కలిసి కాసేపు దీక్ష చేపట్టి ‘మమ’ అనిపించారు.
తెలుగుదేశం పార్టీ బలోపేతానికి, అధికారంలోకి రావడానికి అహర్నిశలూ శ్రమించాం. ఏళ్లతరబడి జెండా మోసినా మమ్మల్ని పట్టించుకోలేదు. మా నాయకుడు మంత్రిగా పనిచేసినా మాకు పైసా లబ్ధి లేదు. వైఎస్సార్‌సీపీ హయాంలోనే మాకు ప్రభుత్వ ఫలాలు దక్కాయి.
– రాయదుర్గానికి చెందిన ఓ టీడీపీ కార్యకర్త మనోగతం
నేను ఇరవై ఏళ్లుగా టీడీపీకి ఓటేస్తున్నా. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు మాకు ఎటువంటి లబ్ధీ జరగలేదు. పార్టీలో పదవులు లేవు. కుటుంబానికి ప్రభుత్వ పథకాలు దక్కలేదు. ఇప్పుడు అధినేతలకు ఆపద వచ్చిందని పిలుపునిస్తే మనసు చంపుకుని వెళ్లలేకపోతున్నాం.
– గుంతకల్లుకు చెందిన ఓ దళిత మహిళ నిట్టూర్పు
Comments
Please login to add a commentAdd a comment