కోలుకున్న నాగబిందు
అనంతపురం మెడికల్: ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఓ నిండు చూలాలికి ప్రభుత్వ సర్వజనాస్పత్రి వైద్యులు సకాలంలో కార్పొరేట్ స్థాయి వైద్యం అందించి ఊపిరి పోశారు. వివరాలు.. శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండకు చెందిన వెంకటేష్, నాగబిందు దంపతులు. రెండో సారి గర్భం దాల్చిన నాగబిందును కాన్పు కోసం ఈ నెల 16న ఉదయం 7.30 గంటలకు జీజీహెచ్‌లో కుటుంబసభ్యులు చేర్పించారు. ఆ సమయంలో నిండు గర్భిణి తీవ్రమైన ఆయాసంతో ఊపిరి తీసుకునేందుకు సైతం ఇబ్బంది పడుతుండడం గమనించిన గైనిక్ హెచ్‌ఓడీ డాక్టర్ షంషాద్‌బేగం, డాక్టర్ సుచిత్ర, డాక్టర్ పార్వతి, డాక్టర్ పూజిత తదితరులు వెనువెంటనే వైద్య పరీక్షలు నిర్వహించారు.
పల్మనరీ ఎడిమా (ఊపిరితిత్తుల్లో నెమ్ము చేరడం)తో బాధపడుతున్నట్లు గుర్తించి ఏఎంసీలో వెంటిలేటర్‌పై ఉంచారు. ఆ సమయంలో ఆక్సిజన్ శాతం 52, గుండె పని శాతం 30 మాత్రమే ఉంది. ఆమె పరిస్థితిని ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కేఎస్‌ఎస్ వెంకటేశ్వర రావు దృష్టికి తీసుకెళ్లి, ఆయన ఆదేశాలతో డాక్టర్ షంషాద్‌బేగం, అనస్తీషియా హెచ్‌ఓడీ డాక్టర్ నవీన్‌కుమార్, మెడిసిన్ హెచ్‌ఓడీ డాక్టర్ బీమసేనాచార్ పర్యవేక్షణలో అడ్మిట్ అయిన రోజే ఉదయం 9.30 గంటలకు సిజేరియన్ చేసి 2.5 కిలోల బరువున్న మగబిడ్డను వెలికి తీశారు.
సిజేరియన్ సమయంలో టాప్ లాక్ అనే నూతన విధానాన్ని అనస్తీషియా వైద్యులు అవలంబించారు. శస్త్రచికిత్స అనంతరం కూడా 24 గంటల పాటు నాగబిందును వెంటిలేటర్ పైనే ఉంచి వైద్యం అందించారు. అనంతరం సీ ప్యాప్ ద్వారా మూడ్రోజులపాటు ఆక్సిజన్ అందించారు. ఈ నెల 21న బాలింత ఆరోగ్య పరిస్థితి మెరుగుపడడంతో లేబర్ వార్డులోని హై డిపెండెన్సీనిట్(ఐసీయూ)కు తరలించారు. ప్రస్తుతం బాలింత నాగబిందు, ఆమె బిడ్డ ఆరోగ్యంగా ఉన్నారు.
తల్లీబిడ్డకు ప్రాణం పోసిన గైనిక్, మెడిసిన్, అనస్తీషియా, చిన్నపిల్లల విభాగం వైద్యులను బుధవారం సూపరింటెండెంట్ డాక్టర్ కేఎస్‌ఎస్ వెంకటేశ్వరరావు అభినందించారు. సాధారణంగా ఈ తరహా కేసులకు ప్రైవేట్ ఆస్పత్రిలో రూ.లక్షల్లో వసూలు చేస్తారని, ప్రభుత్వ సర్వజనాస్పత్రిలో ఉచితంగా అందించే ఈ చికిత్సపై ప్రజల్లో చైతన్యం తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉందని అభిప్రాయపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment