అనంతపురం క్రైం: క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ నేపథ్యంలో వచ్చిన ‘దృశ్యం’ సినిమాను తలపిస్తూ ఓ హత్య జరిగింది. పోలీసుల అండర్ కవర్ ఆపరేషన్‌లో ఓ నిందితుడు పట్టుబడగా మరి కొందరి కోసం వేట కొనసాగుతున్నట్లుగా విశ్వసనీయ సమాచారం. ఈ క్రమంలో పట్టుబడిన నిందితుడు తెలిపిన అంశాలు ఒక్కసారిగా పోలీసు అధికారులనే ఆశ్చర్యానికి గురి చేశాయి. ఆ వివరణపై మరింత లోతైన దర్యాప్తు చేపట్టినట్లు తెలుస్తోంది. వివరాలు..
అనంతపురంలోని మున్నానగర్‌కు చెందిన మహమ్మద్ ఆలీ, చంద్రబాబు నాయుడు కాలనీకి చెందిన రఫీ మిత్రులు. ఇద్దరూ కలసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవారు. ఈ క్రమంలో రఫీకి ఇవ్వాల్సిన వాటా దాదాపు రూ.15 లక్షలను ఆలీ ఎగ్గొట్టాడు. దీంతో ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తి విడిపోయారు. గత నెల 30న మహమ్మద్ ఆలీ అదృశ్యం కావడంతో కుటుంబసభ్యులు అనంతపురం వన్‌టౌన్ పోలీసులను ఆశ్రయించారు. దీనిపై విచారణ అనంతరం ఈ నెల 1న మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు పక్కా ఆధారాలతో ఓ అనుమానితుడిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. తనను మోసం చేసిన ఆలీని ఎలాగైన మట్టుబెట్టాలని భావించిన రఫీ పక్కాప్లాన్‌తో పావులు కదిపినట్లుగా గుర్తించారు.
రూ.50 వేలకి కిరాయి
తన పథకంలో భాగంగా రఫీ ముందుగా ఆలీ స్నేహితుల్లోని ఓ యువకుడిని చేరదీశాడు. అనంతరం ఆలీ అంశం తెలిపి గుట్టుచప్పుడు కాకుండా హతమారిస్తే రూ.50 వేలు ఇస్తానని ఒప్పందం చేసుకున్నాడు. డబ్బు కోసం ఆశపడిన కిరాయి ముఠా సభ్యులు అప్పటికే తమకు సుపరిచితుడైన ఆలీని రప్పించుకుని మాటల్లో పెట్టి తమతో పాటు పిలుచుకెళ్లి ఫుల్‌గా మద్యం తాగించారు. మైకంలో ఉన్న మహమ్మద్ ఆలీ నోట్లో గుడ్డలు కుక్కి వెనుక వైపు నుంచి మెడకు చేతులు బలంగా చుట్టి ఊపిరాడకుండా చేసి హతమార్చారు. అనంతరం మృతదేహాన్ని కారులో తీసుకెళ్లి పడేయాలని చూశారు. మొదట నంద్యాల జిల్లా గిద్దలూరు ఘాట్ ప్రాంతంలో పడేయాలని అనుకున్న వారు.. కారు నానో కావడంతో అంతదూరం వెళ్లడం శ్రేయస్కరం కాదని భావించారు.
అనంతరం ఎ.నారాయణపురం శివారులోని వంకలో రాత్రి మృతదేహాన్ని పడేసి, నిప్పంటించి బూడిద చేశారు. ఈ మొత్తం ప్రక్రియలో ముగ్గురు యువకులు పాల్గొన్నారని, అందరూ చంద్రబాబు నాయుడు కాలనీకి చెందిన వారిగానే అండర్ కవర్ ఆపరేషన్‌లో పోలీసులు నిర్ధారించుకున్నారు. ఈ క్రమంలోనే ఓ నిందితుడు పట్టుబడడంతో అతని ద్వారా వివరాలు కూపీ లాగారు. నిందితుడు తెలిపిన మేరకు మహమ్మద్ ఆలీని దహనం చేసిన చోటుకు చేరుకున్న పోలీసులు అక్కడ బూడిద, ఎముకలను సేకరించి ఫొరెన్సిక్ ల్యాబ్‌కు పంపారు.
చెల్లి కూడా పాత్రధారే?
మహమ్మద్ ఆలీని హతమార్చిన అనంతరం మృతదేహాన్ని మాయం చేయడంలో రఫీకి సొంత చెల్లెలు, అక్క, బావ మద్దతుగా నిలిచినట్లుగా తెలుస్తోంది. వీరంతా కలసి ఓ కారును ఏర్పాటు చేయగా, చెల్లెలు అన్నతో కలసి కారులో వెంట వెళ్లి మృతదేహాన్ని కాల్చి బూడిద చేసే వరకూ అక్కడే ఉన్నట్లుగా పోలీసుల ప్రాథమిక విచారణలో నిర్ధారణ అయింది. మొత్తంగా మహమ్మద్ ఆలీని హత్య చేసి చట్టం నుంచి తప్పించుకోవాలని చూసిన వారిలో కీలక నిందితుడు తొలుత అనుమానితుడిగా పట్టుబడి నోరు విప్పినట్లుగా సమాచారం. అయితే నిందితుడి సమాచారంతో ఏకీభవించని పోలీసులు మరింత లోతైన దర్యాప్తు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment