
సీఎం సభలో సేవలందిస్తామంటున్న విద్యార్థులు
అనంతపురం: రాప్తాడులో ఈ నెల 18న జరుగనున్న వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ‘సిద్ధం’ సభకు రాయలసీమ జిల్లాల నుంచి లక్షలాది మంది పార్టీ శ్రేణులు హాజరుకానున్నారు. ఏ చిన్నలోటుపాట్లు తలెత్తకుండా ఏర్పాట్లకు అన్ని విధాలా చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో వలంటీర్లుగా పనిచేసేందుకు విద్యార్థులు స్వచ్ఛందంగా ముందుకొచ్చారు. వైస్సార్‌సీపీ విద్యార్ధి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు పానుగంటి చైతన్య నేతృత్వంలో వచ్చిన పలువురు విద్యార్థులతో మంగళవారం సిద్ధం సభాస్థలి వద్ద ముఖ్యమంత్రి ప్రోగ్రామ్స్ కోఆర్డినేటర్, ఎమ్మెల్సీ తలశిల రఘురామ్ భేటీ అయ్యారు. వలంటీర్లుగా విద్యార్థులు అందించాల్సిన సేవలపై తలశిల దిశానిర్దేశం చేశారు. జరగబోయే ఎన్నికల యుద్ధంలో విపక్షాలన్నీ కట్టగట్టుకుని జగనన్న ప్రజా ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమం మీద, ప్రతి ఇంటికీ మనం చేస్తున్న మంచి, అభివృద్ధి మీద దాడి చేస్తున్నాయన్నారు.
పేదోడి బంగారు భవిష్యత్తును ప్రశ్నార్థకంగా మార్చే కుట్రలు జరుగుతున్నాయని ఆరోపించారు. ఈ పరిస్థితుల్లో అన్ని వర్గాల ప్రజలు ఆలోచించాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. చంద్రబాబు దుష్ట సైన్యాన్ని, వారి కుట్రల్ని, కుతంత్రాల్ని, చీల్చి, చెండాడటానికి, మళ్లీ జగనన్నను ముఖ్యమంత్రిగా చేసుకునేందుకు సిద్ధంగా ఉండాలని తలశిల రఘురామ్ పిలుపునిచ్చారు.
విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు పానుగంటి చైతన్య మాట్లాడుతూ ప్రభుత్వం అమలు చేస్తున్న రాబోయే తరం విద్యా విధానాన్ని నీరుగార్చేందుకు పెత్తందార్లంతా ఏకమవుతున్నారని ఆరోపించారు. పోర్టులు, హార్బర్లు, మెడికల్ కాలేజీలు, నాడు–నేడుతో మారుతున్న స్కూళ్లు, ఆస్పత్రులు, పారిశ్రామిక అభివృద్ధి, మొత్తంగా రాష్ట్ర అభివృద్ధి మీద వారి దండ యాత్ర కొనసాగుతుందన్నారు. వారి కుట్రలను విద్యార్థిలోకం తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. సమావేశంలో విద్యార్ధి విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు నరేంద్రరెడ్డి, అనంతపురం జిల్లా అధ్యక్షుడు సుధీర్‌రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాఘవ, రాష్ట్ర అధికార ప్రతినిధి కేశవ, రాష్ట్ర కార్యదర్శి షెక్షావలి, నాయకులు శ్రీకాంత్, రమేష్, విజయ్, ఆదాం, కిరణ్, అనిల్, వినోద్, ప్రశాంతి, కోమల, ఇమ్రాన్, ఇర్షాద్, చంద్ర, పవన్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment